చిత్రం: కస్టడీ
రేటింగ్: 2.25/5
తారాగణం: నాగచైతన్య, అరవింద్ స్వామి, ఆర్. శరత్ కుమార్, కృతిశెట్టి, ప్రియమణి, సంపత్ రాజ్ తదితరులు
కెమెరా: కదిర్
ఎడిటింగ్: వెంకట్ రాజన్
సంగీతం: యువన్ శంకర్ రాజా, ఇళయరాజా
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
దర్శకత్వం: వెంకట్ ప్రభు
విడుదల తేదీ: 12 మే 2023
నాగచైతన్యకి గత ఏడాదిగా హిట్ లేదు. ట్రైలర్ చూస్తే ఒక కానిస్టేబుల్ వీరగాధ అని అర్ధమౌతుంది. దర్శకుడు వెంకట్ ప్రభు మీద నమ్మకంతో కాసిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు అరవింద్ స్వామి, శరత్ కుమార్ లాంటి పెద్ద నటులు కూడా తోడవ్వడంతో ఆశలు చిగురించడం మొదలెట్టాయి. ఇంతకీ సరైన కథాకథనాలతో ఈ చిత్రం ప్రేక్షకులని కస్టడీలోకి తీసుకుందా లేక కష్టమండి అనిపించేలా ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.
శివ (నాగచైతన్య) అనే సిన్సియర్ కానిష్టేబుల్ కి, ఒక సీబీయై ఆఫీసర్ (సంపత్) కి, సీఎం అండతో బతికే ఒక రౌడీషీటర్ (అరవింద్ స్వామి) కి, ఒక రౌడీ పోలీసాఫీసర్ (శరత్ కుమార్) కి మధ్యన జరిగే కథ ఇది. శివకి ఒక లవర్ (కృతిశెట్టి). ఆమెకి మరొకడితో (వెన్నెల కిషోర్) తో నిశ్చితార్ధం అవుతుంది. మన హీరో ఆమెను ఎలా దక్కించుకుంటాడు? ఇదొక ట్రాక్.
ఈ సినిమాలో హుక్ పాయింట్ ఏంటంటే సీబీయై ఆఫీసర్ రౌడీ షీటర్ ని ఎందుకు తరుముతున్నాడు? సీఎం కి ఆ రౌడీషీటర్ ఎఫైర్ ఏమిటి? క్లైమాక్స్ లో వీటికి జవాబు దొరుకుతుంది.
సాధారణంగా కాప్ స్టోరీస్ అంటే ఎస్సైయ్యో, కొత్తగా రిక్రూట్ అయిన ఐపీఎస్ ఆఫీసరో హీరోగా కనిపిస్తాడు. కానిస్టేబుల్ ప్రధానపాత్రలో కథలు చాలా అరుదు. ఈ మధ్యన కిరణ్ అబ్బవరం కానిస్టేబుల్ పాత్రలో ఒక సినిమాలో కనిపించినా పెద్దగా ఆడలేదు. నాగచైతన్య లాంటి నటుడు ఒక సీరియస్ కాప్ స్టోరీలో కానిస్టేబుల్ గా కనిపిస్తున్నప్పుడు అంత కన్విన్సింగ్ యాక్షన్ డ్రామా ఏముంటుందా అనిపిస్తుంది!
నిజజీవితంలో కానిస్టేబుల్ పవర్స్ ఎంతవరకు ఉంటాయో, ఎస్సైల నీడలో వాళ్లు వృత్తిని ఎలా నిర్వర్తిస్తూ ఉంటారో చూస్తుంటాం. మరి అంత ఛాలెంజింగ్ గా అనిపించే పాత్రతో కూడిన కథ కన్విన్సింగ్ గా ఉందా అంటే అస్సలు లేదని చెప్పాలి. చిన్న చిన్న పాత్రలకి కూడా పెద్ద పెద్ద నటుల్ని తీసుకుని అత్యంత పేలవంగా తీసిన సినిమా ఇది. క్రైం థ్రిల్లర్స్, యాక్షన్ డ్రామాలు జనం చాలానే చూస్తున్నారు. ఎంతో బలమైన స్క్రీన్ ప్లే తో, బరువైన కథతో, షాకింగ్ గా అనిపించే రివీలింగ్ పాయింట్స్ తో గొప్ప చిత్రాలొస్తున్నాయి. వాటి దరిదారుపుల్లోకి ఏమాత్రం రాకుండా ముప్పై ఏళ్ల క్రితం తీసినా కూడా ఔట్ డేటెడ్ అనిపించేలా ఎక్కడా ఆసక్తికరమైన పాయింట్ లేకుండా తీసిన సినిమా ఇది.
ప్రధమార్ధం పాత్రల పరిచయాలతో కొనసాగి నసగుతూ, నీల్గుతూ ఉంటుంది. అరవింద్ స్వామి పాత్ర ఎంటరయ్యక ఏదో కథ మొదలయ్యిందన్న ఫీలింగొస్తుంది. కానీ మళ్లీ విసుగు కొనసాగి పేలవమైన ఇంటర్వల్ బ్యాంగ్ అవుతుంది.
ద్వితీయార్ధంలో అధికభాగం యాక్షన్ సీన్లే.
క్లైమాక్స్ చాలా ప్రెడిక్టిబుల్ గా ఉండడమే కాకుండా ఎమెచ్యురిష్ గా ముగిసింది.
టెక్నికల్ గా యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ బాగుంది. సింగిల్ షాట్ ఫైట్ సీక్వెన్స్ ఇంకా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త భిన్నంగా ఉండి అక్కడక్కడ ఓకే అనిపించినా ఎక్కువశాతం నీరసపరిచింది.
కెమెరా వర్క్ బాగున్నా ఎడిటింగ్ పదును లేకుండా ఉంది. మళ్లీ మళ్లీ ఒకే తరహా సీన్స్ రావడం రిపీటెడ్ అనిపించింది.
పాటల్లోని సంగీత సాహిత్యాలు దారుణంగా ఉన్నాయి. యువన్ శంకర్, ఇళయరాజా- ఒకరు కాదు ఇద్దరు ఉద్దండ సంగీత దర్శకులు. కానీ ఔట్పుట్ దయనీయం. సాహిత్యం మరీ బి-గ్రేడ్ అరవ డబ్బింగు సినిమా పాటల్ని పోలి ఉన్నాయి. ఎవరు రాసారా అని చూస్తే రామజోగయ్య. ఈ లెక్కన ఈ సినిమాపట్ల అన్ని విభాగాల్లోనూ పేరున్న వాళ్లునా శ్రద్ధగా పని చేయలేదనో, దర్శకుడు చేయించుకోలేదనో అనిపిస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే నాగచైతన్య సీరియస్ క్యారెక్టరైజేషన్లో అక్కడక్కడ ఓకే అనిపించాడు. వీక్ రైటింగ్ వల్ల అతని హీరోయిజం పెద్దగా రిజిస్టర్ కాలేదు.
కృతిశెట్టి పక్కింటమ్మాయి టైపులో సింపుల్ గా పాత్రకి తగ్గట్టుగా ఉంది. మరొక కథానాయిక ఆనంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అతిధి పాత్ర టైపులో కనిపిస్తుంది.
అరవింద్ స్వామి కి బిల్డప్ బానే ఇచ్చారు కానీ దానికి తగిన క్యారెక్టర్ డెప్త్ లేదు. అయినప్పటికీ ఉన్నంతలో ఈ పాత్రే చివరిదాకా ఉండి క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇస్తుంది.
శరత్ కుమార్ విలనీ బానే ఉంది. ముఖ్యమంత్రిగా కనిపించిన ప్రియమణికి బిల్డప్ షాట్స్ ఫుల్, పవర్ఫుల్ డైలాగ్స్ నిల్ అన్నట్టుగా రాసుకున్నారు.
రాంకీ, జయసుధ..ఇలా ప్రతి చిన్న సీన్లోనూ పెద్ద పెద్ద నటుల్ని, మాజీ హీరోలని, అలనాటి హీరోయిన్ ని వాడేయడం జరిగింది.
అత్యంత బలహీనమైన రచనకి ఈ సినిమా ఒక ఉదాహరణ. కథ, కథనం, డైలాగ్ ఇలా ఏ విభాగంలోనూ కూడా బలం లేకుండా తీయడం ఈ చిత్ర దర్శకుడికే చెల్లింది.
అయినా కృతిశెట్టి “కష్టడీ” సినిమాకి ప్రచారంచేస్తూ తాను నటించిన సినిమాల్లో తనని బాగా కదిలించిన సినిమాలు ఇప్పటి వరకు “బంగార్రాజు”, “శ్యాం సింగరాయ” మాత్రమేనని చెప్పినప్పుడే అర్ధం చేసుకుని ఉండాల్సింది.
“నిజం గెలవడానికి లేట్ అవుతుంది కానీ కచ్చితంగా గెలుస్తుంది” అని ఇందులో ఒక డైలాగుంది. “నిజం గెలవడానికి” ప్లేసులో “హిట్టు కొట్టడానికి” అని పెట్టుకుని ఆ వాక్యాన్ని జపించుకుంటూ మరొక ప్రయత్నం చెయడమే నాగచైతన్య చేయగలిగేది. ఈ కష్టడి చూసినవాళ్లని బాగా కష్టపెట్టింది.
బాటం లైన్: కష్ట(మం)డి