కోర్టుల్లోని పరిణామాలు సామాన్యులకు అంతుబట్టవు. న్యాయమూర్తుల వ్యాఖ్యానాలపై ఏపీ ప్రభుత్వ పెద్దలు బాహాటంగా అభ్యంతరం చెబుతూ ఉన్నారు. తీర్పు సందర్భంగా వ్యాఖ్యలు రాయవచ్చు కానీ, విచారణ సందర్భంగా అనునిత్యం కామెంట్లు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు.
ఇక బిల్డ్ ఏపీలో భాగంగా వివాదాల్లో ఉన్న ఆస్తుల అమ్మకం కేసు విచారణలో జస్టిస్ రాకేష్ కుమార్ తప్పుకోవాలంటూ ఏపీ ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. విచారణకు ముందే ఆయన చేస్తున్న వ్యాఖ్యానాలతో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయిందని, సుప్రీం కోర్టు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందట.
ఆ వ్యవహారంలో ఏం తేలుతుందో కానీ.. మరో ఉదంతంపై విచారణలో భాగంగా జస్టిస్ రాకేష్ కుమార్, ఏపీ ప్రభుత్వ న్యాయవాదుల మధ్యన వాదోపవాదాలు జరిగినట్టుగా పత్రికల్లో వార్తలను బట్టి తెలుస్తోంది.
లాయర్ల మధ్యన వాదోపవాదాలు జరుగుతాయని సినిమాల్లో చూస్తూ ఉంటారు సామాన్యులు. అయితే పత్రికల కథనాలను బట్టి.. జడ్జిలకూ, లాయర్లకు మధ్య కూడా వాదనలో జరుగుతాయేమో అని అనుకోవాల్సి వస్తోంది!
ఏపీలో కొన్ని హెబియస్ కార్పస్ రిట్ల నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో రాజ్యాంగం విఫలం చెందిందనే అంశం గురించి విచారణ జరుగుతూ ఉంది. ఈ విషయంలో సుమోటోగా తీసుకుని ఈ కేసు విచారణ చేస్తున్నారట జస్టిస్ రాకేష్ కుమార్. అందుకు సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నట్టున్నాయి.
అసలు ఇలాంటి విచారణ జరగాల్సిన అవసరం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదుల వాదనగా తెలుస్తోంది. దీనిపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నట్టుగా వారు చెబుతున్నారట. అయితే సుప్రీం కోర్టు ఈ విషయంలో స్టే ఇస్తే విచారణ మొత్తం ఆగిపోతుందని, ప్రస్తుతానికి అలాంటి ఉత్తర్వులు లేవు కాబట్టి విచారణ కొనసాగుతుందని జస్టిస్ రాకేష్ కుమార్ చెప్పినట్టుగా పత్రికల్లో కథనాల ద్వారా తెలుస్తోంది.
మరోవైపు ఈ విషయంలో తమను ప్రభుత్వ లాయర్లు బెదిరిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని కూడా ఆ జడ్జి వ్యాఖ్యానించారట. అయితే అభ్యర్థించడం బెదిరించడం అవుతుందా? తమరే మమ్మల్ని బెదిరిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆ జడ్జిని ఉద్దేశించి అభ్యంతరం వ్యక్తం చేశారట ప్రభుత్వం తరపు లాయర్లు.
న్యాయమూర్తి ఏజీతో గౌరవప్రదంగా వ్యవహరించలేదని కూడా వారు వాదించినట్టుగా సమాచారం. న్యాయమూర్తుల వ్యాఖ్యానాల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును కూడా న్యాయవాదులు జస్టిస్ దృష్టికి తీసుకు వచ్చారట.
రాజ్యాగం విఫలం చెందిందంటూ విచారించే పరిధి హైకోర్టుకు లేదంటూ ఏపీ ప్రభుత్వం ఇది వరకూ ఒక పిటిషన్ దాఖలు చేసింది. అయితే దాన్ని హై కోర్టే తిరస్కరించింది. దానిపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. దానిపై ఈ నెల 18న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న తదుపరి విచారణ చేపట్టాలని హై కోర్టు ధర్మాసనాన్ని న్యాయవాదులు కోరారట. అయితే ఆ అభ్యర్థనను హై కోర్టు తిరస్కరించినట్టుగా తెలుస్తోంది.