ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకొని థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడిపై చాలా భారం పడిపోతోందట. ఆ భారం తగ్గించేందుకే బుక్ మై షోపై నిషేధం విధించారట. మొన్నటివరకు ఎగ్జిబిటర్లు చెప్పిన మాట ఇది. ఈరోజు ఈ వివాదం పరిష్కారమైంది. అంతా భాయ్ భాయ్ అంటూ కలిసిపోయారు. కట్ చేస్తే.. మళ్లీ అదే రేటు. బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే, మళ్లీ అదే పాత రేట్లు పునరావృతం అయ్యాయి.
కన్వీనెన్స్ పేరిట బుక్ మై షో వసూలు చేస్తున్న రేటులో గతానికి, ప్రస్తుతానికి ఎలాంటి తేడా లేదు. అటుఇటుగా 13 శాతం నుంచి 14 శాతం (సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్సు మధ్య చిన్న తేడా) ఛార్జీ విధిస్తోంది బుక్ మై షో. మరి ఈమాత్రం దానికి ఇన్నాళ్లూ ఎగ్జిబిటర్లు, ఆ యాప్ పై నిషేధం విధించడం ఎందుకు? ప్రేక్షకుడిపై భారం తగ్గిస్తామంటూ సినిమా డైలాగులు కొట్టడం ఎందుకు?
కన్వీనెన్స్ పేరిట బుక్ మై షో వసూలు చేస్తున్న మొత్తంలో కొంత భాగం తిరిగి ఎగ్జిబిటర్లకే వెళ్తుందనేది బహిరంగ రహస్యం. ఇలా బ్యాక్ డోర్ నుంచి వచ్చే మొత్తాన్ని మరింత పెంచుకోవడం కోసం బుక్ మై షోపై అప్రకటిత నిషేధాన్ని ఎగ్జిబిటర్లు విధించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమా విడుదల టైమ్ లో ఈ పని చేస్తే, బుక్ మై షో దారికొస్తుందనేది వీళ్ల ఎత్తుగడగా తెలుస్తోంది.
ఎగ్జిబిటర్ల ప్లాన్ ఫలించింది. బుక్ మై షో దారికొచ్చింది. అంతిమంగా బకరా అయింది ప్రేక్షకుడే. ఈలోగా థియేటర్ల వద్ద బాక్సాఫీస్ ముందు రాత్రి-పగలు క్యూ కట్టి టికెట్ దక్కించుకున్న ప్రేక్షకుడు మరింత పెద్ద బకరా అయ్యాడన్నమాట. ఈ సొంపుకి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు కూడా తిన్న ప్రేక్షకుడికి ఇంకేం పేరు పెట్టాలో?
మొత్తమ్మీద కాస్త ఆలస్యంగానైనా భీమ్లానాయక్ ఆన్ లైన్ టికెట్ సేల్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా బుక్ మై షో బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు.