మొన్న పునీత్- నేడు మేకపాటి: అసలేం జరుగుతోంది?

మొన్నామధ్య పునీత్ రాజ్ కుమార్, నేడు మేకపాటి గౌతం రెడ్డి మరణాలు దక్షిణ భారతాన్ని భయంతో కృంగదీస్తున్నాయి. అంత ఫిట్టుగా ఉండే వాళ్లకి గుండెపోటులేవిటని ఆశ్చర్యపోవడం మన వంతవుతోంది. వాళ్లంత సెలెబ్రిటీలు కాకపోయినా సామాన్యుల్లో…

మొన్నామధ్య పునీత్ రాజ్ కుమార్, నేడు మేకపాటి గౌతం రెడ్డి మరణాలు దక్షిణ భారతాన్ని భయంతో కృంగదీస్తున్నాయి. అంత ఫిట్టుగా ఉండే వాళ్లకి గుండెపోటులేవిటని ఆశ్చర్యపోవడం మన వంతవుతోంది. వాళ్లంత సెలెబ్రిటీలు కాకపోయినా సామాన్యుల్లో కూడా ఆరోగ్య నియమాలు, వ్యాయామాలు చేసే వాళ్లు కూడా గుండెపోటుతో అకస్మాత్తుగా పోవడం చూస్తున్నాం. 

వీళ్లందరికీ కామన్ పాయింట్ ఏవిటని ఆరా తీస్తే అందరూ కరోనా వచ్చి తగ్గినవారే అంటున్నారు. 

“అబ్బే! ఒమిక్రాన్ ఏం చేయదండీ. మామూలు జలుబు లాంటిదంతే. ఆసుపత్రిపాలు కావడం చాలా అరుదు. ఆక్సీజన్ పెట్టుకోవాల్సిన అవసరం ఇంకా అరుదు. చావు మరీ అరుదు. పైగా ఇది ప్రకృతి ప్రసాదించిన వ్యాక్సీన్. అందుకే మాస్క్ తీసేసా”, అని ఒకరు మరొకరితో అనడం గత కొన్ని రోజులుగా కామనైపోయింది. 

అయితే ఆ స్టేట్మెంటులో “అరుదు” అంటున్నారు తప్ప “జరగదు”, “ఉండదు”, “లేదు” అనే మాటలనట్లేదు. 

అంటే ఏంటి? ఎక్కడో కొంతమంది ఆసుపత్రిపాలౌతున్నారు, కొందరు పోతున్నారనేగా. అంటే ఇది ప్రాణాంతకమనేగా? అరుదైనంత మాత్రాన ఆ లిస్టులో మనముండం అనడానికి ధీమా ఏవిటి?

అదలా ఉంటే కరోనా వచ్చి తగ్గిన వారిలో మరణానికి దారితీసేంత గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని అంతర్జాతీయ పరిశోధనల్లో తేలిందని డాక్టర్ ముఖర్జీ ఈ రోజు అన్నారు. 

మేకపాటి గౌతం రెడ్డి మరణాన్ని పోస్ట్ కోవిడ్ పరిణామంగా భావిస్తూ అడిగిన ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ ముఖర్జీ పై విషయం చెప్పారు. 

గుండెపోటు ఒక్కటే కాదు, ఎన్నో ఇతర ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టి జీవితాన్ని దుర్భరం చేయగలిగే శక్తి ఈ కరోనా మహమ్మారికుంది. 

ఏదో బాగా వృద్ధులైతేనో, ఇమ్యూనిటీ లేకపోతేనో కరోనా తీవ్రత చూపిస్తుందనుకుంటున్నారు చాలామంది. అది నిజం కాదు. 

అది ఎవర్ని ఎలా పట్టుకుంటుంది అన్న దానికి సరైన సమాచారం లేదు. అయితే ఎన్ని రకాలుగా ఈ కరోనా పట్టిపీడిస్తుందో చూద్దాం. 

1. దీర్ఘకాలిక కోవిడ్:

కొందరికి దీర్ఘకాలికంగా కోవిడ్ లక్షణాలుంటున్నాయి. అంటే ఆయాసం, దగ్గు వంటివి. సాధారణంగా ఇవి 14 రోజుల తర్వాత నెగటివ్ రిపోర్ట్ వచ్చాక పోయే లక్షణాలే. కానీ కొందరిలో ఇవి ఆర్నెల్లు, కొందరికి రెండేళ్లు ఉంటున్నాయి. అంటే తొలి విడతలో కరోనా సోకిన వారిలో కొందరికి ఇప్పటికీ ఊపిరితిత్తులు పాడైపోయి, సరిగ్గా గాలి పీల్చలేక ఇబ్బంది పడుతున్నవారున్నారు. వారికిది జీవితాంతం ఉండొచ్చని కొంతమంది డాక్టర్ల అభిప్రాయం. 

ఈ దీర్ఘకాలిక లక్షణాల పర్యవసానంగా శరీరం క్షీణించి తరచూ జ్వరం, అధిక నీరసం, కళ్ల మసక, అతిసారం, గుండె దడ, కండరాల నొప్పులు, పొత్తికడుపు నొప్పి, మూడ్ బాగోలేకపోవడం, నిద్రలేమి, కిడ్నీ సమస్యలు ఇలా అనేకం సంభవిస్తున్నాయి. అవి దీర్ఘకాలంగా ఉండి క్రమంగా జీవితాల్లో భాగమైపోతున్నాయి. 

2. కేవలం జలుబు కాదు:

ఒమిక్రాన్ దాడి కేవలం జలుబు కాదు. ఇది ప్రాణం తీయగల శక్తున్న జబ్బు. ఇది సోకి ఇమ్యూనిటీ వీక్ అయ్యి మళ్లీ కోలుకోవడానికి సమయం పడుతొంది. కొందరికి మళ్లీ పూర్వపు వ్యాధినిరోధక శక్తి రావట్లేదు. 

తత్ఫలితంగా మధుమేహం, గుండె జబ్బులు,  నరాల బలహీనత ఏర్పడుతున్నాయి. శేషజీవితం వీటితో పోరడడమే ఇక మిగిలేది. 

3. పిల్లలకి అంటించడం:

నాకేం కాదన్న ధీమాతో వైరస్ ను తగిలించుకుని ఇంటికి తీసుకొచ్చి పిల్లలకి అంటించి వారి జీవితాల్ని పాడు చేసే పరిస్థితిని కూడా కాదనలేం. 

ఒమిక్రాన్ అయినా, డెల్టా అయినా అన్నీ ఒక ఇంటి విషపు కాట్లే. అవి ఎవరికి ఎంతవరకు దిగుతాయో లెక్కేసి చెప్పడం కష్టం. “అరుదు” అన్న లెక్కలో ఎవరు చేరతారో క్లారిటీ లేదు…ఎవరైనా చేరొచ్చు. 

4. ఆసుపత్రి వ్యవస్థపై ప్రభావం:

ఒమిక్రాన్ ఎవర్ని ఏమీ చెయ్యదని ప్రతి ఒక్కరూ నేచరల్ వ్యాక్సీన్ పేరుతో అన్నీ వదిలేసి తిరిగితే “అరుదుగా” ఆసుపత్రిపాలయ్యే వారిని లెక్కేసుకున్నా ఆసుపత్రులు సరిపోవు. అందులోనూ భారతదేశంలాంటి అధిక జనాభాగల దేశంలో ఆ పరిస్థితిని ఎదుర్కోవడం చాలా కష్టం. 

ఒమిక్రాన్ అనేది పిల్లి కాదు పులి. దానికి ఎప్పుడు ఆకలేస్తుందో తెలియదు. ఆకలేయనప్పుడు ఎవర్నీ ఏమీ చేయకపోవచ్చు. కానీ ఆకలేస్తే పక్కనున్నది ఇమ్యూనిటీ ఉన్నవాడా, వృద్ధుడా అని చూడదు. వేసేయగలదు. వేసేస్తోంది కూడా. 

మరిప్పుడు ఏం చెయ్యాలంటే సరైన సమాధానం లేదు. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కరోనా సోకుతోంది. అలాగని జాగ్రత్తలు మానేయకూడదు. తరచూ ఆరోగ్యపరీక్షలు చేయించుకుంటుండాలి. వాటిల్లో 2డి ఎకో, ట్రేడ్ మిల్ టెస్ట్ కూడా ఉండేలా చూసుకోవడం మంచిది. ఏ బ్లాకన్నా ఉంటే గుండెపోటు రావడానికి మునుపే సరి చేసుకునే అవకాశముంటుంది. 

– శ్రీనివాసమూర్తి