జగన్ ను కలవనున్న రోజా.. ఏం జరగబోతోంది?

ఇన్నాళ్లూ లేనిది, ఉన్నట్టుండి సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరారు నగరి ఎమ్మెల్యే రోజా. ఎందుకింత సడెన్ గా ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నారు? నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తారా..? కేవలం మంత్రి పదవిపై ఓ…

ఇన్నాళ్లూ లేనిది, ఉన్నట్టుండి సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరారు నగరి ఎమ్మెల్యే రోజా. ఎందుకింత సడెన్ గా ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నారు? నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తారా..? కేవలం మంత్రి పదవిపై ఓ మాట ముందుగానే వేసి ఉంచుతారా? లేక నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని కోరతారా..? వీటిల్లో ఒకటి కానీ లేదా అన్నీ కానీ చర్చనీయాంశాలు కావొచ్చని అంటున్నారు.

నియోజకవర్గంలో అంతర్గత కలహాలు..

వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా రోజాకు స్థానిక నాయకులతో ఎందుకు గొడవలు ఉంటున్నాయో అర్థం కావడం లేదు. ఈ పాటికే రోజా అసమ్మతి వర్గాన్ని తనవైపు తిప్పుకుని ఉండాల్సింది. పదవుల పంపకంలో వాటాలిచ్చేసి, పెత్తనం తనదిగా ఉంచుకోవాల్సింది. కానీ రోజా తగ్గలేదు, స్వపక్షంలో విపక్షం కూడా ఆమెను విడిచిపెట్టడం లేదు. 

సీనియర్ మంత్రి ఒకరు తనకు చక్రం అడ్డు వేస్తున్నారనే అనుమానం రోజాలో రోజురోజుకీ బలపడిపోతోంది. అందుకే ఆమె నేరుగా జగన్ వద్దే పంచాయితీ పెట్టాలనుకుంటున్నారని సమాచారం.

మంత్రి పదవి..

ఫస్ట్ ఫేజ్ లోనే మంత్రి పదవి ఆశించినా ఏపీఐఐసీ చైర్మన్ కావడంతో కాస్త అసంతృప్తిని దిగమింగుకున్నారు రోజా. ఇప్పుడు ఆ పదవి కూడా లేదు, కనుచూపు మేరలో మంత్రివర్గ విస్తరణ అనే ఆశలు కూడా లేవు. 

ఈ దశలో అసలు తనకు పదవీ యోగం ఉందో లేదో కూడా జగన్ దగ్గర తేల్చుకోడానికే రోజా వెళ్తున్నారనే అనుమానాలున్నాయి. ఇప్పటి వరకూ జగన్ తో రోజాకు విభేదాలు లేవు, మంత్రి పదవి విషయంలో తేడాలొస్తే ఏం జరుగుతుందో చెప్పలేం.

బాలాజీయే కావాలి..

జిల్లాల విభజన జరిగినా కూడా నగరి నియోజకవర్గం చిత్తూరులోనే కొనసాగుతుంది. కానీ రోజా తమకు కొత్త జిల్లా కావాలంటున్నారు. శ్రీవారి దయ కోసం బాలాజీ జిల్లాలో నగరిని కలిపేయాలని కోరుతున్నారు. 

శ్రీవారిపై భక్తితో పాటు.. చిత్తూరు సీనియర్ల బారి నుంచి బయటపడిపోవచ్చనే ఆలోచన కూడా ఆమెలో ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాల విషయంలో రోజాకు వెసులుబాటు ఇస్తే, ఆనం వంటివారు రెడీగా ఉన్నారు. అందుకే జగన్ ఈ విషయంలో ఇకపై ఎవరికీ ఛాన్స్ ఇచ్చేలా లేరు.

ఇంతకీ జగన్ అపాయింట్ మెంట్ ఇస్తారా? లేదా..?

అధికారంలోకి వచ్చిన తర్వాత అతికొద్ది మంది ఎమ్మెల్యేలకు మాత్రమే జగన్ అపాయింట్ మెంట్ దొరికింది. కేవలం తీవ్రస్థాయిలో విబేధాలు తలెత్తినప్పుడు, నియోజకవర్గ అభివృద్ధి, కీలక పదవుల పంపకం లాంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడు మాత్రమే, ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడారు జగన్. సర్దుబాట్లు చేశారు. 

మరి ఇప్పుడు ఎలాంటి సమయం-సందర్భం లేకుండా అపాయింట్ మెంట్ కోరిన రోజాకు జగన్ టైమ్ కేటాయిస్తారా? లేదా..? అనేది తేలాల్సి ఉంది. రోజాకు జగన్ అపాయింట్ మెంట్ ఇస్తే మాత్రం ఆటోమేటిక్ గా హామీ కూడా ఇచ్చినట్టే. ఇది ఫిక్స్.