మాజీ మంత్రి అఖిలప్రియ సోమవారం అర్ధరాత్రి ఆళ్లగడ్డ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు పరుగు తీశారు. అర్ధరాత్రి వేళ, ఒక మహిళా నాయకురాలు హడావుడిగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేంత అత్యవసరం ఏమొచ్చింది? అనే ప్రశ్న ఎవరిలోనైనా తలెత్తుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే… అసలేం జరిగిందో తెలుసుకుందాం.
తన భర్త భార్గవ్‌రామ్ వ్యక్తిగత సహాయకుడైన అశోక్‌ను ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారనే సమాచారం రావడంతో ఆమె కంటి మీద నిద్ర కరువైంది. ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గత కొంత కాలంగా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌లపై హైదరాబాద్, కర్నూలు, కడప జిల్లాల్లో వివిధ కేసులు నమోదయ్యాయి. వీటిలో హత్యాయత్నాలు, కిడ్నాప్, విధ్వంసాలు, బెదిరింపులు తదితర నేరాలకు సంబంధించిన కేసులున్నాయి.
ఈ కేసుల్లో అఖిల కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు కూడా ఇరుక్కున్నారు. అలాంటి వారిలో అశోక్ ఒకడు. ఇటీవల తన స్థలానికి సంబంధించి ప్రహరీ గోడను అర్ధరాత్రి వేళ విధ్వంసం చేయడానికి మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు అశోక్ తదితరులపై బీజేపీ ఆళ్లగడ్డ ఇన్‌చార్జ్ భూమా కిషోర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా కేసు నమోదు చేయడంతో పాటు అశోక్‌ను గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే విచారణలో భాగంగా తీగ కదిల్చితే డొంక కదులుతుందనే భయం అఖిలప్రియ కంటి మీద కునుకు లేకుండా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో కిడ్నాప్, కడపలో సొంత పార్టీ నేతపై హత్యా యత్నం, అలాగే ఆళ్లగడ్డలో ప్రహరీ గోడ విధ్వంసం, లక్ష్మయ్య అనే వ్యక్తితో నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి, తనదే స్థలమని కోర్టుకెక్కడం వెనుక సూత్రధారులు, పాత్రధారుల పేర్లను అశోక్ బయటపెడతారనే భయంతోనే అఖిలప్రియ పోలీస్‌స్టేషన్‌కు పరుగు తీసిందనే వాదన వినిపిస్తోంది.
ఇదిలా వుండగా తెలంగాణకు చెందిన లక్ష్మయ్య భార్యకు అశోక్ ఫోన్ చేసి బెదిరించిన ఆడియో రికార్డ్స్ పోలీసులకు చిక్కాయని సమాచారం. లాయర్లను వెంటబెట్టుకెళ్లిన అఖిలప్రియ అశోక్‌ను బెయిల్‌పై తీసుకురావాలనే ప్రయత్నాలు ఫలించలేదు. అఖిలప్రియ ఆందోళనతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి సంబంధించి జరుగుతున్న ప్రచారంలోని నిజానిజాలు తెలియాలంటే పోలీసులు నోరు విప్పాలి.