పొత్తులు ప్రకటించాలంటే పవన్‌కు చచ్చేంత భయం!

‘మాతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాం’.. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వం’… ‘కలిసి పోటీ చేసి ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తాం’… ‘ప్రస్తుతం జనసేన పార్టీకి పెరిగిన బలాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని…

‘మాతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాం’.. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వం’… ‘కలిసి పోటీ చేసి ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తాం’… ‘ప్రస్తుతం జనసేన పార్టీకి పెరిగిన బలాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని పొత్తుల్లో మాకు సీట్లను డిమాండ్ చేస్తాం’.. ఇలాంటి డైలాగులను పవన్ కళ్యాణ్  ఎప్పటినుంచో పదే పదే వల్లిస్తున్నారు. 

అంతే తప్ప ‘‘తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్నాం’’ అనే స్పష్టమైన వాక్యం పలకడానికి ఆయనకు నోరు రావడం లేదు! రాజకీయాలలో తొలినాటి నుంచి ఇవాళ్టి దాకా పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాటా పుష్కలమైన అస్పష్టతతో కూడిన మాట! 

పొత్తు ఖరారు అయినప్పటికీ అధికారికంగా ఆ మాట ప్రకటించడానికి పవన్ కళ్యాణ్ కు ధైర్యం చాలడం లేదు.. పొత్తుల గురించి ఇప్పుడే బయటకు చెప్పాలంటే ఆయన భయపడిపోతున్నారు.

ఇందుకు సహేతుకమైన కారణం ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకోబోతున్నామనే సంగతి జనసైనికుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుగుదేశం ఓట్లు కూడా కలిసి వస్తే తాము నెగ్గుతామనే అభిప్రాయం ఆ పార్టీలో చాలామందిలో ఉంది. ఆ రకంగా చూసినప్పుడు సగానికి పైగా నియోజకవర్గాలలో జనసైనికులు పొత్తుల్లో తమ పార్టీకే సీటు రావాలని, ఆ సీటును తమకే కేటాయించాలని ఇప్పటినుంచే ఆశలు పెంచుకుంటున్నారు. జనసేనాని పవన్ దృష్టికి తీసుకు వెళుతున్నారు. ఆయన మీద ఒత్తిడి పెడుతున్నారు. 

పవన్ కల్యాణ్ కు తెలుగుదేశం నుంచి దక్కగల సీట్లకు, ఆ పార్టీలో టికెట్ మీద ఆశలు పెంచుకుంటున్న వారి సంఖ్యకు ఏమాత్రం పొంతన లేదు. ఈ సమయంలో పొత్తుల గురించి అధికారిక ప్రకటన వస్తే.. సీట్ల గురించిన చర్చ కూడా ఆటోమేటిగ్గా జరుగుతుంది. 

ఏతావతా.. తమ నియోజకర్గం పార్టీకి దక్కకపోతే జనసైనికుల్లో అసంతృప్తి ప్రబలుతుంది. అలాంటి వారందరూ కూడా కనీసం తమను ఓడించడానికైనా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లిపోతారని, లేదా, ఇండిపెండెంట్లుగా పోటీ చేసేందుకు తగినట్టుగా బలపడతారని పవన్ కల్యాణ్ కు భయం. అందుకే ఆయన పొత్తుల గురించిన ఫైనల్ ప్రకటన చేయడంలేదు. 

కానీ.. ఇలాంటి అస్పష్టమైన అడుగులు వేస్తుండడం వల్ల ఏ నియోజకవర్గంలోనూ పార్టీ శ్రేణులు డబ్బు ఖర్చు పెట్టి పనిచేయడానికి సుముఖంగా లేకపోతే పార్టీ బలపడడం అసాధ్యం అనే సంగతిని ఆయన ఎందుకు గుర్తించలేకపోతున్నారో అర్థం కాని సంగతి.