అదేంటి పవన్..అలా అంటారు?

2019 ఎన్నికల్లో ఓ ముఫై సీట్లు వచ్చి వుంటే ఇప్పుడు అలయిన్స్ లో భాగంగా సీఎం పోస్ట్ అడిగే అవకాశం వుండేది. అలా జరగలేదు కనుక అడగలేము అని తేల్చేసారు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. …

2019 ఎన్నికల్లో ఓ ముఫై సీట్లు వచ్చి వుంటే ఇప్పుడు అలయిన్స్ లో భాగంగా సీఎం పోస్ట్ అడిగే అవకాశం వుండేది. అలా జరగలేదు కనుక అడగలేము అని తేల్చేసారు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. 

తమ్ముళ్లేమో సీఎం పోస్ట్ ఇస్తేనే అలయన్స్ కు వెళ్లమని అంటుంటే, వాళ్ల ఆశలు నీరు కార్చేలా మాట్లాడేసారు పవన్. అన్ని జిల్లాల్లో తమకు పట్టులేదని, కొన్ని చోట్ల మాత్రమే వుందని కూడా చెప్పేసారు. అన్ని సీట్లలో పోటీ చేయమని అంటున్నా వెనుకంజ వేస్తున్నది ఇందుకే అని పరోక్షంగా హింట్ ఇచ్చారు. కానీ పవన్ వాదన అయితే సరి కాదు.

ఎందుకు? ఎలా అంటే… 2019 కన్నా ఇప్పుడు జనసేన బలం అంతో ఇంతో పెరిగింది. అది అంగీకరించాల్సిన వాస్తవం. నాగబాబు చెప్పినట్లు మరీ 35 శాతానికి చేరుకోకున్నా, మంచి స్థితిలోనే వుంది మరీ ఒక్క సీటు మాత్రమే దక్కే రేంజ్ లో అయితే కాదు. ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి బేరాలు ఆడాలి కానీ, 2019 లెక్కల ప్రకారం బేరాలు ఆడితే ఎలా?

పవన్ ఫ్లాప్ సినిమా 10 కోట్లు చేయకపోవచ్చు. హిట్ సినిమా 100 కోట్లు చేయచ్చు. ఈ హిట్ నే ప్రాతిపదికగా తీసుకుని రెమ్యూనిరేషన్ తీసుకుంటారు…సినిమాను మార్కెట్ చేస్తారు తప్ప, అప్పుడు ఫ్లాప్ అయింది..నాకు 10 కోట్లు ఇవ్వండి చాలు అని అనరు కదా? రాజకీయాలైనా సరే ఎప్పటి లెక్కలు అప్పుడే కానీ 2019లో పరిస్థితి బట్టి 2024లో లెక్కలు కడితే ఎలా?

తనకు సిఎమ్ ప్లేస్ వద్దు అని పవన్ ముందుగానే డిసైడ్ అయ్యారు. సిఎమ్ సీటు అడిగితే తెలుగుదేశంతో పొత్తు అసాధ్యం అని ఆయనకే కాదు. అందరికీ తెలుసు. సీటు కాదు పొత్తు ముఖ్యం పవన్ కు. అందుకే సిఎమ్ సీటు గురించి ఆశ పెట్టుకోలేదు కానీ అలా అని నేరుగా చెప్పలేరు. ఇలాంటి డొంక తిరుగుడు మాటలు, ఇల్లాజికల్ రీజన్లు చెబుతున్నారు.

పవన్ సిఎమ్ కానపుడు, అయ్యే ఉద్దేశం లేనపుడు ఇక జన సైనికులు ఎందుకు చొక్కాలు చించుకుని, వళ్లు అలవగొట్టుకుని కిందా మీదా అయిపోవాలి? చంద్రబాబునో చినబాబునో సిఎమ్ చేయడం కోసమా?

ఇక్కడ ఇంకో ముచ్చట కూడా వుంది. సపోజ్, ఫర్ సపోజ్ ఈ ఎన్నికల్లో పవన్ కు 30 సీట్లు వచ్చేసాయి అనుకుందాం. అప్పుడు 2029లో తనకు సిఎమ్ పోస్ట్ కావాలని పవన్ అడగగలరా? అడిగినా తెలుగుదేశం ఇస్తుందా? అలా ఇవ్వకుండా పొత్తును వదులుకోగలరా? అప్పుడేం చెబుతారు. అప్పుడు కూడా 2019 లెక్కలే తీస్తారా?

ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు పవన్? తాను రాజకీయం చేసేది తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించి, చంద్రబాబును సిఎమ్ చేయడానికి తప్ప వేరు కాదు అని నేరుగా చెప్పేయవచ్చు కదా?