ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వరుసగా అసాధారణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. హైకోర్టు, ఏపీ సర్కార్ మధ్య ఘర్షణ పూరిత వాతావరణాన్ని ఈ సంఘటనలు ప్రతిబింబిస్తున్నాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా న్యాయమూర్తి రాకేశ్‌కుమార్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయనపై తాజాగా ప్రభుత్వం వేసిన అఫిడవిట్ తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.
పలు కేసుల విచారణలో భాగంగా ప్రభుత్వంపై జస్టిస్ రాకేశ్‌కుమార్ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమ వుతున్నాయి. అసలు పిటిషన్‌కు సంబంధం లేకుండా రాజధాని లాంటి అంశంపై ఆయన చేసిన కామెంట్స్ విమర్శలకు దారి తీశాయి. ఒక దశలో ప్రభుత్వ న్యాయవాది తీవ్ర అభ్యంతరం చెప్పాల్సిన పరిస్థితి చూశాం.
మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా సర్కార్ ఆస్తులను వేలం ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో విచారణ నుంచి తప్పుకోవాలంటూ న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్‌ను అభ్యర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది.
ఈ వ్యాజ్యాలను విచారించే ధర్మాసనంలో జస్టిస్ రాకేశ్ కుమార్ సభ్యుడిగా కొనసాగితే, తాము న్యాయం పొందే అవకాశం ఉండదని హైకోర్టు దృష్టికి ఏపీ సర్కార్ తీసుకెళ్లింది. ఈ సందర్భంగా తమ అభ్యర్థన ఎలా సహేతుకమో కూడా హైకోర్టుకు ఏపీ సర్కార్ వివరించింది.
పక్షపాతంతో వ్యవహరించేందుకు ఆస్కారం ఉందనే అభిప్రాయం కలిగినప్పుడు, అది సరైందని భావిస్తే , కేసు విచారణ నుంచి తప్పుకోవాలని సదరు న్యాయమూర్తిని కోరవచ్చంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం.
రెండురోజుల క్రితం కూడా ఇదే రకమైన అసాధారణ పరిస్థితిని హైకోర్టులో చూశాం. ఇక్కడ కూడా జస్టిస్ రాకేశ్‌కుమార్ నేతృత్వం వహిస్తున్న ధర్మాసనం వైఖరిని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ అసాధారణ రీతిలో తప్పు పట్టారు.
రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా లేదా అని తేలుస్తామంటూ జస్టిస్ రాకేశ్‌కుమార్ సుమోటోగా కేసు స్వీకరించి విచారణ చేపట్టారు. అయితే ఈ ఉత్తర్వులని వెనక్కి తీసుకోవాలని (రీకాల్) ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై తమ వాదనలు వినాలని ఏజీ కోరారు.
ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కనీసం వాదనలు కూడా వినకుండానే జస్టిస్ రాకేశ్‌కుమార్ ధర్మాసనం కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామని, అప్పటివరకు విచారణ వాయిదా వేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా హైకోర్టు ధర్మాసనం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో జస్టిస్ రాకేశ్‌కుమార్, ఏజీ శ్రీరామ్ మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి.
తనకు వాదనలు వినిపించే అవకాశం, పలు న్యాయస్థానాల తీర్పులను ప్రస్తావించే అవకాశం ఇవ్వకపోవడం సరైంది కాదని ఏజీ శ్రీరామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వాదనలు వినలేదన్న విషయాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని ఏజీ కోరినా ప్రయోజనం లేకపోయింది.
తాను చెప్పిన వివరాలను ఉత్తర్వుల్లో ప్రస్తావించడం ద్వారా కోర్టు తన నిష్పక్షపాతాన్ని ఏజీగా తాను కోరుకుంటున్నానని శ్రీరామ్ గట్టిగా వాదించారు. అయితే ఏజీ నుంచి ఇలాంటి వాదనను ఆశించడంలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనికి ఏజీ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు.
న్యాయస్థానం నుంచి తాము కూడా ఇలాంటి దానిని ఆశించడంలేదని ఏజీ దీటుగా, ఘాటుగా బదులిచ్చారు. సుప్రీంకోర్టులో కేసు తేలిన తర్వాతే ఈ కేసులో కోర్టుకు సహకరిస్తానని ఆయన తేల్చిచెప్పారు.
దీంతో మధ్యాహ్నం నుంచి చేపట్టిన విచారణకు ఏజీ హాజరు కాకుండా తన నిరసనను ప్రకటించడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక అడ్వొకేట్ జనరల్ ఈ స్థాయిలో నిరసన వ్యక్తం చేయడం ఇదే ప్రథమమని చెబుతున్నారు.
ఏది ఏమైనా వృత్తిలో భాగంగా చివరి రోజుల్లో ఉన్న రాకేశ్‌కుమార్‌కు ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిధి దాటి ప్రవర్తిస్తే ప్రతికూల పరిస్థితులే ఎదురవుతాయని అనేక సంఘటనలు మనకు గుణపాఠాలు చెప్పిన సంగతి తెలిసిందే.