తాడిని తన్నే వాడుంటే వాడి తలతన్నే వాడుంటాడనే చందాన… ఇంత కాలం ఏపీలోని మహామహులతో ఆడుకున్న చంద్రబాబు, రామోజీరావులకు సరైన మొగుడు దొరికాడు. వాళ్లిద్దరి తలతన్నేవాడు వైఎస్ జగన్ రూపంలో వచ్చాడు. ఈ మహత్తర కార్యంలో ఉండవల్లి అరుణ్‌కుమార్ అనే పాత్ర చాలా గొప్పది. మేధావితనం, నిజాయతీ, పట్టువదలని పోరాట పటిమ అరుణ్‌కుమార్ ఆస్తిపాస్తులు. ఇవే రామోజీరావు పాలిట శాపాలయ్యాయి.
అరుణ్‌కుమార్ వార్తల్ని బ్యాన్ చేయడం తప్ప, ఆయన్ను మరేమీ చేయలేని దయనీయ స్థితి రామోజీరావుది. గత 17 ఏళ్లుగా రామోజీరావుపై ఉండవల్లి చేస్తున్న పోరాటం కీలక దశకు చేరింది. ఉండవల్లికి పౌర సమాజం బ్రహ్మరథం పడుతోంది. ఎన్టీఆర్‌కు నిజమైన వారసుడు ఉండవల్లే అనే చర్చ మొదలైంది. తనకు చంద్రబాబు, రామోజీరావు చేసిన ద్రోహానికి పాపం పండేందుకు కారకులైన వైఎస్ జగన్, ఉండవల్లికి ఎన్టీఆర్ ఏ లోకాన ఉన్నా ఆశీస్సులు అందిస్తుంటారని ఆ నట దిగ్గజం అభిమానులు అంటుంటారు.
ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడంలో రామోజీరావు పాత్ర చిన్నదేమీ కాదు. ఇవాళ రామోజీకి లక్ష్మీపార్వతి రాసిన బహిరంగ లేఖలో ఈ వాక్యాలు చదివితే అర్థమవుతుంది. ఎన్టీఆర్‌ను పరామర్శించడానికి వెళ్లిన రామోజీరావు, తిరిగి వెనుదిరిగిన సందర్భంలో లక్ష్మీపార్వతి ఆయన్ను వేడుకున్నారు.
“మీరు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని సాగనంపటానికి బయటకు వచ్చిన నేను మీ కాళ్ళు పట్టుకుని ఏడ్చాను. 'అన్నా! ఆయన ఆరోగ్యం బాగుండటం లేదు. ఈ సమయంలో ఇంతటి అవమానాన్ని ఆయన తట్టుకోగలరా? మీరొక్కరే కాపాడగలరు. మీరు చంద్ర బాబుకి చెప్పి ఎన్టీఆర్‌ను పదవిలో కొనసాగనివ్వండి. నా వల్ల ఏ ఇబ్బంది లేదండీ' అంటూ ఒక చెల్లెలిగా భోరున ఏడ్చాను. మీ కసాయి గుండె ఏ కొంచెమైనా కరుగుతుందేమోనని ఆశపడ్డాను. మీరు నిర్దాక్షిణ్యంగా నన్ను తోసేసుకుని వెళ్ళిపోతే పడుకున్న ఎన్టీఆర్ లేచివచ్చి నన్ను ఓదారుస్తూ 'లక్ష్మీ! పులి చంపేస్తుందని కుందేలు సింహాన్ని ఆశ్రయించిందట. అలా ఉంది నువ్వు ఇతన్ని వేడుకోవటం. ఇదంతా ఇతడి వల్లనే కదా జరిగింది. నా కుటుంబ సభ్యుల్ని నా నుండి దూరం చేసి పట్టం కట్టింది ఎవరు? అంతా తెలిసి మళ్ళీ వాడి కాళ్ళు ఎందుకు పట్టుకుంటావ్. ఇలాంటి సిగ్గుమాలిన పని ఎప్పుడూ చేయకు. ఇదంతా మనం ప్రజల్లోనే తేల్చుకుందాం”
ఎవరైనా తండ్రిని అవమానించిన వదులుతారా? చీమూ నెత్తురు ఉన్నవాళ్లెవరూ విడిచిపెట్టారు. అదేంటో గానీ ఎన్టీఆర్ వారసుల బ్లడ్, బ్రీడ్ వేరు (బాలయ్య మాటల్లో). తండ్రిని తీవ్రంగా క్షోభకు గురి చేసిన బావ చంద్రబాబునాయుడితో పాటు రామోజీరావు పల్లకీ మోయడానికి వారసులు పోటీ పడ్డారు. ఇలాంటి తరుణంలో తామున్నామంటూ వైఎస్ జగన్, ఉండవల్లి అరుణ్‌కుమార్ వేర్వేరుగా పోరాటం మొదలు పెట్టారు. చివరికి రామోజీరావు అంతటి వ్యక్తిని బెడ్‌పై పడుకోబెట్టారు.
దీనంతటికి మార్గదర్శిపై ఉండవల్లి మొదలెట్టిన పోరాటమే కారణం. రాజకీయ కారణాలతో ఒక్కోసారి వైఎస్ జగన్ అయినా ఆచితూచి వ్యవహరించొచ్చు. కానీ ఉండవల్లి మాత్రం అలుపెరగని యోధుడిలా రామోజీరావుపై యుద్ధం చేస్తున్నాడు. ఉండవల్లికి రాజకీయాలు, పార్టీలకు అతీతంగా రామోజీ బాధితులంతా మద్దతుగా నిలిచారు, నిలుస్తున్నారు. నిజానికి రామోజీపై యుద్ధం చేయాల్సింది ఎన్టీఆర్ వారసులు. ఆ బాధ్యతల్ని వారు పక్కన పడేయడంతో ఉండవల్లి భుజానకెత్తుకున్నారు. ఎన్టీఆర్ కోణంలో కాకపోయినా, ఇంత కాలం విరవీగుతున్న రామోజీ ఆట కట్టించడానికి ఒకడొచ్చాడనే భావనతో ఉండవల్లికి ప్రజాదరణ పెరుగుతోంది.
అదే ఆయనకు శ్రీరామ రక్షణ. ఆయనకున్న ఏకైక బలం కూడా అదే. లక్ష్మీపార్వతి తాజాగా రామోజీకి రాసిన బహిరంగ లేఖలో ఉండవల్లికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడాన్ని గమనించొచ్చు. వ్యవస్థ పాలిట రాక్షసంగా వ్యవహరించే వ్యక్తుల అంతు చూసేందుకు పౌర సమాజం ఎంత బలంగా అండగా వుంటుందో చెప్పడానికి ఉండవల్లి ఎపిసోడే నిదర్శనం.
ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, ఆయన్ను తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామంటూ నిరాశనిస్పృహలతో బాధపడుతున్న అభిమానుల పాలిట ఉండవల్లి ఓ ఆశా దీపం. ఉండవల్లిలో ఎన్టీఆర్ నిజమైన వారసుడిని చూసుకుంటున్నారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.