మహమ్మారికి జగన్ సర్కార్ లేట్‌గా అయినా లేటెస్ట్గా అద్భుతమైన డోస్ ఇచ్చిందని చెప్పొచ్చు. అయ్యా బాబూ, కరోనా వైరస్ ఎక్కువగా ఉంది, కొన్నాళ్లు ఆగితే స్థానిక సంస్థల నిర్వహణకు సహకరిస్తామని, అంత వరకూ కాస్తా ఓపిక పట్టాలని ఏపీ ప్రభుత్వం కోరినా ….పట్టించుకున్న పాపాన పోలేదు.
అప్పుడేమో ఒకట్రెండు కరోనా కేసులు ఉన్నప్పుడు మాత్రం ముందస్తు జాగ్రత్తలో భాగంగా అంటూ స్థానిక సంస్థల ప్రక్రియను మధ్యలో వాయిదా వేశారు. ఇప్పుడేమో కాదు, కూడదంటూ ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్లాల్సిందేనంటూ మొండిగా వ్యవహరిస్తుండడం చూస్తున్నాం.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గత నెల 17న రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రొసీడింగ్స్ జారీ చేసింది. ఈ ప్రొసీడింగ్స్‌ను ఆపాలంటూ పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
అయితే ఎన్నికల వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు పేర్కొంది. మరిన్ని వివరాలను తమ ముందు పెట్టాలని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది. ఒక వైపు విచారణ జరుగుతుండగా తాజాగా ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది.
ఈ అఫిడవిట్ సారాంశం ఏంటంటే… వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కరోనా వ్యాక్సిన్ వేయాల్సి వుంటుందని, ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులంతా బిజీగా ఉంటారని, కావున పంచాయతీ ఎన్నికలకు సహకరించలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అందువల్ల గత నెల 17న ఎస్ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేయాలని మరోసారి హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది.
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ డీవీవీఎస్ సోమయాజులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను ప్రభుత్వ తరపు న్యాయవాది సి.సుమన్ న్యాయస్థానానికి అందించారు. సుమన్ వాదిస్తూ రాష్ట్రస్థాయిలో స్టీరింగ్ కమిటీతో పాటు టాస్క్‌ఫోర్స్, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి, అలాగే బ్లాక్ లెవల్లో సబ్ కలెక్టరు, తహశీల్దారు, పీడీవో స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆన్లైన్లో రిజిస్టరైన వారి సంఖ్యను బట్టి రాష్ట్రప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు ప్రణాళిక రూపొందించుకోవాల్సి ఉంటుందని వివరించారు.
ఎన్నికల ప్రక్రియ జరిపిన విధంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర మార్గదర్శకాల్లో ఉన్న విషయాన్ని ధర్మాసనానికి వివరించారు. ఈ మొత్తం ప్రక్రియలో కిందిస్థాయి ఉద్యోగులు మొదలుకుని ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొదటి విడత వ్యాక్సినేషన్ వేసే అవకాశం ఉందని, వ్యాక్సిన్ వేయించుకున్నవారికి మళ్లీ నాలుగు వారాల తర్వాత రెండోసారి ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వ తరపు న్యాయవాది పూర్తి వివరాలను న్యాయస్థానం ఎదుట ఉంచారు. ఈ పరిస్థితి ఒక్క మన రాష్ట్రానికే పరిమితం కాదు.
దేశ వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ఉద్యోగులు అప్రమత్తంగా ఉంటూ వ్యాక్సిన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా మొత్తానికే ఎసరు వస్తుంది. కావున న్యాయస్థానం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ మాత్రం ఎన్నికలు నిర్వహించాలని తహతహలాడడమే కాదు, జనం ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా దహించేసేందుకు రగిలిపోతున్న మహమ్మారికి సరైన సమయంలో స్ట్రాంగ్ డోస్ ఇచ్చేలా అదనపు అఫిడవిట్ దాఖలు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.