ఏపీలో పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణకు కంకణం కట్టుకున్న ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కరోనా వ్యాక్సినేషన్ అంశం అడ్డంకిగా మారింది. ఒకవైపు కరోనా వ్యాక్సినేషన్ కు సమాయత్తం కావాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తూ ఉంది.
ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ను కూడా ఇటీవలే నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ అతి త్వరలో అందుబాటులోకి రానుందని, దాన్ని తొలి విడతగా వేసేందుకు ఏర్పాట్లకు సమాయత్తం కావాలని సూచించారు. అందుకు తగ్గట్టుగా ముఖ్యమంత్రులు కూడా తమ తమ రాష్ట్రాల అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
వ్యాక్సినేషన్ స్టోర్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, దాన్ని ఎలా చేరవేయాలి, తొలి విడతలో వ్యాక్సినేషన్ ఎవరికి జరగాలనే అంశం గురించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది రాష్ట్ర ప్రభుత్వం.
ఎలాగైనా తను పదవీ కాలాన్ని పూర్తి చేసుకునేలోగా స్థానిక ఎన్నికలను నిర్వహించాలనే పట్టుదలతో కనిపిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఇప్పుడు ఈ వ్యవహారం ఆటంకంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
పంచాయతీ రాజ్ ఎన్నికల నిర్వహణ గురించి కోర్టుకు ఎక్కడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రస్తావించింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో వ్యాక్సినేషన్ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటాయని, కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టులో ప్రస్తావించింది.
వ్యాక్సినేషన్ జరగడంలో ప్రభుత్వ ఉద్యోగులది కీలక పాత్ర అని, కోవిడ్ వారియర్స్ గా వారు వ్యాక్సినేషన్ లో బిజీగా ఉంటారని, సుప్రీం కోర్టు కూడా ఇదే చెప్పిందని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టడం అర్థం లేని చర్య అనే రీతిలో వాదన సాగినట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఎస్ఈసీ తరఫు లాయరు కౌంటర్ దాఖలుకు సమయం కోరినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా వ్యాక్సినేషన్ అంశాన్ని తీసుకొచ్చే సరికి అప్పటికిప్పుడు నిమ్మగడ్డ తరఫు న్యాయవాది దగ్గర వాదన లేకపోయినట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో.. కౌంటర్ దాఖలుకు సమయం కోరుతూ కేసును వాయిదా వేయించుకున్నారు.
ఒకవైపు దేశం చూపు ఇప్పుడు వ్యాక్సిన్ మీదే ఉంది. ఇప్పటికీ కోవిడ్ కేసుల సంఖ్య వస్తూనే ఉంది. కొంతమంది ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. వ్యాక్సినేషన్ జరిగే వరకూ వైరస్ నియంత్రణలోకి వచ్చేలా లేదు.
ఈ నేపథ్యంలో తొలి దశ వ్యాక్సినేషన్ మీద అందరి దృష్టీ నెలకొని ఉంది. అయితే ఏపీ ఎస్ఈసీ మాత్రం ఎన్నికలు ఎన్నికలు అంటోంది. మరి వ్యాక్సినేషన్ కన్నా ఎన్నికలు ఏ రకంగా ప్రాధాన్యతతో కూడుకున్నవి అవుతాయో ఎస్ఈసీ తన వాదనలతో నిరూపించాల్సి ఉంది.