ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, విశాఖపట్నం తదితర జిల్లాల్లో వివాదాస్పద, ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకానికి సంబంధించి హై కోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరుపుతున్న న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ ఆ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
ఎవరైనా న్యాయమూర్తులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పిటిషనర్లలో కలిగినప్పుడు వారిని తప్పుకోమని కోరే హక్కు ఉంటుందన్న సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి.. ఈ కేసు విచారణ నుంచి రాకేష్ కుమార్ ను తప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా తెలుస్తోంది.
ఈ కేసు విచారణ సమయంలో జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ప్రస్తావిస్తూ ఉంది. ఆయన వ్యాఖ్యలు యథాతథంగా పత్రికల్లో వచ్చాయి. ఇది వరకూ ఈ కేసు విచారణ జరిగిన సమయంలో ఈనాడు డాట్ నెట్ లో ఎన్నో ఘాటైన వ్యాఖ్యలు ప్రచురితం అయ్యాయి.
'ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో మాకు తెలుసు..' అంటూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి న్యాయమూర్తి వ్యాఖ్యానించారని అంటూ ఈనాడు డాట్ నెట్ లో రాశారు.
అలాగే తాగుబోతును కోవిడ్ వారియర్స్ గా ఆ న్యాయమూర్తి అభివర్ణించారని కూడా ఈనాడు లోనే రాశారు. కరోనా సమయంలో మద్యం ధరలను ప్రభుత్వం పెంచినా మద్యం కొని తాగి వారు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చారని న్యాయమూర్తి ఈ కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించినట్టుగా ఈనాడు డాట్ నెట్ లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును హై కోర్టు న్యాయమూర్తి తీవ్రంగా తప్పు పట్టారన్నట్టుగా ఈనాడు కథనంలో శ్లేష ఉంది.
ఈ పరిణామాల నేపథ్యంలో.. న్యాయమూర్తి ఈ కేసును విచారించడానికి మునుపే ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫిర్యాదుగా తెలుస్తోంది.
జస్టిస్ రాకేష్ కుమార్ ఈ కేసు విచారణలో కొనసాగితే న్యాయం జరగదు అనే ఆందోళన మేరకు.. ఈ కేసు విచారణ నుంచి ఆయన తప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్ లో కోరినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వ్యవహారంలో తదుపరి ఏం జరగబోతోందో!