కాంగ్రెస్ రాక కోసం టీడీపీ, జ‌న‌సేన ఎదురు చూపు!

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రావాల‌ని ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీలు టీడీపీ, జ‌న‌సేన వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నాయి. క‌ర్ణాట‌క అసెంబ్లీకి బుధ‌వారం పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల‌న్నీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి.…

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రావాల‌ని ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీలు టీడీపీ, జ‌న‌సేన వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నాయి. క‌ర్ణాట‌క అసెంబ్లీకి బుధ‌వారం పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల‌న్నీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ మాత్ర‌మే కాదు, ఎగ్జాట్ రియ‌ల్ట్స్ కూడా అట్లే వుండాల‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ దేవుళ్లందరినీ ప్రార్థిస్తుంటారు. ఎందుకంటే బీజేపీ బ‌ల‌హీన‌ప‌డితేనే త‌మ మాట వింటుంద‌నేది ఆ పార్టీల భావ‌న‌.

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ గ‌తానుభ‌వాల దృష్ట్యా టీడీపీతో అంట‌కాగ‌డానికి ఏ మాత్రం సుముఖంగా లేదు. బీజేపీపై వ్య‌తిరేక‌త వుంద‌ని, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటే న‌ష్ట‌పోతామ‌నే భ‌యంతో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌ద్దు, ప్యాకేజీ ముద్దు అని చెప్పింది తానే అన్న సంగ‌తిని మ‌రిచి, బీజేపీని దోషిగా నిల‌బెట్టి, త‌ద్వారా రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు. 

ఆ త‌ర్వాత ఏమైందో అంద‌రికీ తెలుసు. దేశ వ్యాప్తంగా ప్ర‌ధాని మోదీ హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌నే వార్త‌లొస్తున్నాయి. దీంతో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏపీలో జ‌గ‌న్‌ను క‌ట్ట‌డి చేయ‌డం సులువ‌వుతుంద‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఎత్తుగ‌డ వేశారు. కానీ జ‌న‌సేన‌తో  క‌లిసి ప్ర‌యాణించ‌డానికి ఇబ్బంది లేద‌ని, టీడీపీతో మాత్రం స‌సేమిరా అని బీజేపీ అంటోంది. మ‌రోవైపు టీడీపీతో క‌లిసి వెళ్ల‌డానికి ఎలాగైనా బీజేపీని ఒప్పించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ముందుకెళుతున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబుతో భేటీలో కూడా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. 

క‌ర్ణాట‌క ఫ‌లితాలు చూసి ఎలా ముందుకెళ్లాల‌నే అంశంపై చ‌ర్చిద్దామ‌ని నిర్ణ‌యించుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఎంత బ‌ల‌హీన‌ప‌డితే, అంత అవ‌స‌రం త‌మ‌తో వుంటుంద‌ని చంద్ర బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనుకున్నార‌ని తెలిసింది. దీంతో క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శించాల‌ని ఆ ఇద్ద‌రు నాయ‌కులు కోరుకుంటున్నారు. 

అప్పుడు మాత్ర‌మే బీజేపీ అహంకారం వీడి, తాము చెప్పిన‌ట్టు పొత్తుకు ముందుకొస్తుంద‌ని ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ల భావ‌న‌. క‌నీసం త‌మ కోస‌మైనా కాంగ్రెస్‌కు క‌ర్ణాట‌క ఓట‌ర్లు ప‌ట్టం క‌ట్టాల‌నే వారి కోరిక ఎంత వ‌ర‌కు నెర‌వేరుతుందో చూడాలి. క‌ర్ణాట‌క‌లో ఫ‌లితాలు బీజేపీకి వ్య‌తిరేకంగా వ‌చ్చినంత మాత్రాన‌, ఏపీలో చంద్ర‌బాబుతో క‌లిసి వెళ్ల‌డానికి ఆ పార్టీ సిద్ధ‌మ‌వుతుందా? అనేది కాలం తేల్చాల్సి వుంది.