జనసేనాని పవన్‌కల్యాణ్ ఆర్భాటాలకు తక్కువేం లేదు. ఇప్పటికి రెండు మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్ మొహాన్ని కూడా చూడలేదు. ఇలాంటి పవన్‌కల్యాణ్ ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తానని మాటలు కోటలు దాటిస్తున్నారు. ఇటీవల ఏపీలో కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు నష్టపోయారు. నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
అయితే తమ వల్లే జగన్ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని నాలుగు రోజుల క్రితం చంద్రబాబు, నిన్న పవన్‌కల్యాణ్ మాట్లాడ్డం గమనార్హం. కనీసం చంద్రబాబు వెంటనే పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడారు. కానీ పవన్‌కల్యాణ్ మాత్రం అంతా అయిపోయిన తర్వాత, తీరిగ్గా షూటింగ్‌లు ముగించుకుని సినిమా షూటింగ్‌ను తలపించేలా మందీమార్బలంతో దెబ్బతిన్న పంటల పరిశీలనకు వెళ్లారు.
ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. పవన్ విమర్శలపై వైసీపీ సోషల్ మీడియా రివర్స్ ఎటాక్ చేస్తోంది. పవన్‌కు దిమ్మ తిరిగేలా నెటిజన్లు చీవాట్లు పెట్టడం గమనార్హం.
“కొత్తపేట నియోజకవర్గం అవిడి గ్రామంలో కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు వస్తే తప్ప వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదా? ప్రభుత్వం రైతులకు గోతాలు ఇవ్వలేదు కానీ, నేను వస్తున్నానని తెలిసి రాత్రికి రాత్రి కొనుగోలు చేశారు. రైతు కంట కన్నీరు పెట్టని రాష్ట్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. గిట్టుబాటు ధర వచ్చేవరకు నిలబడతా, ప్రతి గింజకు నష్టపరిహారం ఇచ్చే వరకు పోరాటం చేస్తా”
రాష్ట్రంలో విపత్తు జరిగితే తప్ప, ఇటువైపు కన్నెత్తి చూడని పవన్‌కల్యాణ్ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని వైసీపీ సోషల్ మీడియా పోస్టులు పెడుతోంది. ప్రతిపక్ష పార్టీలు వస్తే తప్ప అనే దానికి కౌంటర్‌గా ఇలాంటి కామెంట్స్ ప్రత్యర్థుల నుంచి వస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్‌కు, పవన్‌కల్యాణ్‌కు ఏంటి సంబంధం? విజిటింగ్ ప్రొఫెసర్ మాదిరిగా అప్పుడప్పుడు వచ్చి, షో చేయడం తప్ప, ఆయన చేసేదేమీ లేదని వ్యంగ్య కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
నిజంగా రైతులపై ఆయనకు ప్రేమే వుంటే, వెంటనే వచ్చి వారిని పరామర్శించేవారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైసా ఖర్చు లేని పని చేయడానికే పవన్‌కు పది రోజులు సమయం పడితే, మరి ఆర్థిక అంశాలతో ముడిపడిన అంశాలపై ప్రభుత్వం ఎలా ఆలోచించాలి? అయినా ఏపీ సర్కార్ ఏ మాత్రం జాప్యం చేయకుండా వెంటనే రైతులను ఆదుకుంటోందని వారు చెప్పుకొచ్చారు.