సినిమాలు తగ్గిస్తున్న తమిళ స్టార్ హీరో?

క్రేజ్ ఉన్నప్పుడు ఎవరైనా వరుసగా సినిమాలు చేస్తారు. కానీ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మాత్రం సినిమాలు తగ్గించేస్తున్నాడు. ప్రస్తుతం ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తున్నాడు, త్వరలోనే అది కూడా తగ్గించేస్తాడనేది కోలీవుడ్…

క్రేజ్ ఉన్నప్పుడు ఎవరైనా వరుసగా సినిమాలు చేస్తారు. కానీ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మాత్రం సినిమాలు తగ్గించేస్తున్నాడు. ప్రస్తుతం ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తున్నాడు, త్వరలోనే అది కూడా తగ్గించేస్తాడనేది కోలీవుడ్ మీడియా ప్రచారం. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది.

అజిత్ కు సినిమాల కంటే ఇప్పుడు బైక్ రైడింగ్ ప్రాణమైంది. ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు బైక్ రైడింగ్ చేస్తుంటాడు అజిత్. అలా గతేడాది డిసెంబర్ నాటికి ఇండియా మొత్తం చుట్టేశాడు ఈ సీనియర్ హీరో. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కవర్ చేశాడు. ఇండియాతో పాటు పక్కనే ఉన్న నేపాల్, భూటాన్ కూడా వెళ్లొచ్చాడు.

ఇప్పుడీ నటుడు వరల్డ్ బైక్ టూర్ కు సిద్ధమౌతున్నాడు. నవంబర్ నుంచి తన బైక్ పై ప్రపంచయాత్ర చేయబోతున్నాడు అజిత్. సరిగ్గా ఇక్కడే అజిత్ కెరీర్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇండియా టూర్ అంటే ఓకే, వరల్డ్ టూర్ అంటే మాత్రం నెలల తరబడి దేశానికి బయట ఉండాల్సిందే. అలాంటప్పుడు సినిమాలకు టైమ్ కేటాయించడం కుదరదు. పైగా అజిత్ కూడా సినిమాలపై పెద్దగా మొగ్గు చూపించడం లేదంట. 52 ఏళ్ల ఈ నటుడు హీరోగా కొనసాగుతున్నప్పుడే రిటైర్ అవ్వాలని అనుకుంటున్నాడట.

అందుకే ఇలా ప్రపంచ బైక్ రైడ్ కు సిద్ధమయ్యాడని కొన్ని కోలీవుడ్ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం అజిత్ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. నవంబర్ నాటికి ఆ సినిమాను పూర్తిచేసి వరల్డ్ టూర్ మొదలుపెడతాడు ఈ హీరో. ఈ వయసులో కూడా రజనీకాంత్ వరుసపెట్టి సినిమాలు చేస్తుంటే, అజిత్ మాత్రం రిటైర్మెంట్ గురించి ఆలోచించడం ఆశ్చర్యమే.