ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హీరోనే. తర్వాత రోల్స్ కరువైపోయాయి. కేరక్టర్ రోల్స్ పడ్డాయి. ఆ తర్వాత గెస్ట్ రోల్స్ పడ్డాయి. చిట్టచివరికి గెస్ట్ రోల్స్ కూడా కరవైపోయిన తర్వాత.. ఆయనకు ఇప్పుడు రాజకీయ మోజు పీక్స్ కు వెళ్లినట్టుగా కనిపిస్తోంది. రాజకీయం ఆయనకు కొత్త కాదు గానీ.. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి తీరుతా అని ఆ 63 ఏళ్ల మాజీ నటుడు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. ఆ నటుడే సుమన్!
ఆయన అసలు పేరు సుమన్ తల్వార్. మద్రాసులో పుట్టిపెరిగిన ఈ సీనియర్ నటుడు దక్షిణాది భాషల అన్ని చిత్రాల్లోను ముమ్మరంగా నటించాడు. ఒకప్పట్లో బహుభాషా హీరోగా ఒక వెలుగు వెలిగాడు. కరాటే మార్షల్ ఆర్ట్స్ ప్రవీణుడు కావడంతో యాక్షన్ సినిమాలకు అప్పట్లో మారుపేరుగా నిలిచాడు. అన్ని భాషల్లో కలిపి దాదాపు 700 చిత్రాలు చేసినా.. తెలుగు లోనే సెటిలయ్యాడు. తెలుగు రాజకీయాల మీదనే ప్రేమ పెంచుకున్నాడు.
మాజీ హీరో సుమన్ తాజాగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోమటితిప్ప అనే గ్రామంలో ఒక ప్రెవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా వాళ్లు వచ్చి ముచ్చట్లు పెట్టేసరికి అవి రాజకీయాలవైపు మళ్లాయి. తాను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ రంగ ప్రవేశం చేసి తీరుతానని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడినుంచి ఏ పార్టీ తరఫున బరిలోకి దిగుతారో మాత్రం చెప్పలేదు.
ఇప్పుడు ఆయన చెప్పినది బహుశా క్రియాశీల రాజకీయాల గురించి కావొచ్చు గానీ.. నిజానికి సుమన్ కు రాజకీయ వాసనలు రెండు దశాబ్దాల కిందటే అంటుకున్నాయి. 1999 సమయంలోనే ఆయన తెలుగుదేశంలో చేరి ఆ పార్టీకి అనుకూలంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. 2004లో ఆయన తన మద్దతు దారులతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఆ రెండు పార్టీల ద్వారా ఆయన రాజకీయంగా బావుకున్నది ఏమీ లేదు. ప్రస్తుతానికైతే, ఆయన తన మాటల్లో తెలంగాణలో తన మద్దతు భారాసకే ఉంటుందని తెగేసి చెబుతున్నారు. అంటే భాజపా రంగును కూడా వదిలించుకున్నారన్నమాట.
మాజీ హీరో సుమన్.. తనకు సినిమాల్లో గెస్ట్ వేషాలు రావడం కూడా గగనం అయిపోయిన తర్వాత.. ఇప్పుడు క్రియాశీల రాజకీయాల మీద ప్రేమ పెంచుకుంటున్నారు. బహుశా ఎన్నికల్లో పోటీచేయాలనే కోరిక కూడా ప్రబలంగా ఉన్నట్టుంది. భారాసకే తన మద్దతు అంటున్న సుమన్ ను కేసీఆర్.. ఏపీ నుంచి బరిలోకి దింపే ఆలోచన చేస్తే ఆయన రాజకీయ స్వప్నాలు ఎలా ఈడేరుతాయో మరి!