బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని నరేంద్రమోడీని ప్రతిపక్షానికి పరిమితం చేయాలనే పరమోన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అందుకోసం ఆయన తన శక్తివంచన లేకుండా పాటుపడుతున్నారు.
భారతీయ జనతా పార్టీ పతనాన్ని లక్ష్యించడం, మోడీని గద్దె దించడం వరకు లక్ష్యాలు అయితే ఒక రకంగా ఉండేది. భాజపాయేతర పార్టీలను ఏకతాటిమీదకు సమీకరించడం అనే పని సులువు అయ్యేది. ఆ లక్ష్యంతో పాటు, ఆ పనిని కాంగ్రెస్ సారథ్యంలో చేయడం అనేది కూడా నితీశ్ తన లక్ష్యంగా అనుసరిస్తున్నారు. అక్కడే ఆయనకు బహుశా కొన్ని చికాకులు ఎదురవుతుండవచ్చు.
అయితే కాంగ్రెస్ సారథ్యంలో తాను సంకల్పిస్తున్న బలమైన ప్రతిపక్ష మహా కూటమి ఏర్పాటు కోసం ఎక్కేగడప దిగే గడపగా తిరుగుతున్న నితీశ్ కుమార్ తాజాగా ఎదురైన అతిపెద్ద ఫెయిల్యూర్ ప్రయత్నానికి చాలా అందమైన ముసుగు తొడిగారు.
తన ప్రయత్నంలో భాగంగా నితీశ్ వివిధ రాష్ట్రాల్లోని భాజపాయేతర ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. అందులో భాగంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కూడా కలిశారు. ఇద్దరి భేటీలో ఏం జరిగిందనేది మనకు తెలియదు. కానీ బయటకు మాత్రం.. ఇద్దరూ కూడా, తమ భేటీలో మహా కూటమి గురించి చర్చించనే లేదని ప్రకటించడం విశేషం.
దేశ రాజకీయాల గురించి తాము చర్చిచంనే లేదని ఇద్దరూ తేల్చేశారు. పూరీ శ్రీక్షేత్రం దర్శనానికి బీహార్ భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారుట. వారి సౌకర్యం కోసం బీహార్ సర్కారు నిర్మించదలచుకున్న గెస్ట్ హవుస్ కు స్థలం కావాలని అడగడానికి నితీశ్ వచ్చారట. పాత మిత్రుడు గనుక.. అడగగానే ఒకటిన్నర ఎకరా ఉచితంగా ఇస్తానని నవీన్ పట్నాయక్ హామీ ఇచ్చారట. వారి భేటీ సారాంశం ఇదే అన్నట్టుగా వెల్లడించారు.
అయితే నితీశ్ తనవద్ద మహా కూటమి ప్రతిపాదన తేవడం, తాను దానిని తిరస్కరించడం వారికి అవమానకరంగా ఉంటుంది గనుక.. అసలు రాజకీయచర్చలే జరగలేదన్నట్టుగా చెప్పుకుంటున్నట్టు కనిపిస్తోంది. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ కాంగ్రెస్, బిజెపిలతో సమానదూరం పాటిస్తోంది. కాకపోతే మోడీ విధానాల పట్ల అనుకూల ధోరణితో వ్యవహరిస్తుంటుంది. వచ్చేఏడాది ఒదిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీకి సొంతంగా అధికారం దక్కకపోతే గనుక.. బిజెపి సాయం తీసుకునే అవకాశం కూడా ఉన్నదని ప్రచారం ఉంది.
ఇలాంటి నేపథ్యంలో.. వారిని మహా కూటమిలోకి తీసుకురావాలనే నితీశ్ ప్రయత్నమే అతిశయమైనది. అదికాస్తా బెడిసి కొట్టింది. ఈ ఫ్లాప్ ప్రయత్నానికి ఇద్దరు నాయకులూ చాలా గౌరవప్రదంగా అందమైన ముసుగు తొడిగి బయటకు చెప్పుకున్నారు.