మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా మాత్రమే తమకు రాజకీయంగా మనుగడ ఉంటుందని భావించే నాయకులు చాలా మంది ఉంటారు. మతాల విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ది పొందే నాయకులు బహుళ ప్రచారంలోకి వస్తారు.
నిజానికి స్ట్రెయిట్ రాజకీయంతో మనుగడ సాధ్యమనుకునే వాళ్లు మనదగ్గర చాలా తక్కువ. ప్రాంతీయ దురభిమానాల్ని, కులాల్ని, మతాల్ని, అందులో సబ్ సెక్షన్లని ఇలా రకరకాల వేర్పాటు వాదాలను మెట్లుగా చేసుకుని రాజకీయ నాయకులుగా ఎదగాలని అనుకునే వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో కేంద్రమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ కూడా ఒకరైనట్లుగా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదం అవుతున్నాయి.
దేశంలో పరమత సహనం ఉన్న ముస్లింలు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారని, వారు కూడా పదవుల కోసం ఆ ముసుగేసుకుంటారని ఎస్పీ సింగ్ బఘేల్ వ్యాఖ్యానించారు. పదవుల నుంచి దిగిపోయిన తర్వాత వారి అసలు రంగు బయటపడుతుందని ఆయన అనడం గమనార్హం. తమను తాము మేధావులుగా చెప్పుకునే ఆ ముస్లింలు ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, వీసీల పదవులకోసం పరమత సహనం ఉన్నట్టుగా నటిస్తుంటారని బఘేల్ వ్యాఖ్యానించారు.
ఎస్పీ సింగ్ బఘేల్ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమైనవి. ఇలాంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే ఏపీ గవర్నరుగా నియమించిన సుప్రీం మాజీ న్యాయమూర్తి నజీర్ వ్యవహారం ఇలాంటిదే అనుకోవాలా? రామజన్మభూమి విషయంలో హిందూ అనుకూల తీర్పు ఇచ్చిన బెంచ్ లో ఉన్నందుకు ఆయనకు బిజెపి సర్కారు ఈ పదవిని తాయిలంగా ఎర వేసిందనే విమర్శలను నిజం అనుకోవాలా? అనే సందేహాలు బఘేల్ మాటల వల్ల ప్రజల్లో తలెత్తుతున్నాయి.
ముస్లిం నేతలు పదవులకోసం పరమత సహనం ముసుగు వేసుకుని ప్రవర్తిస్తున్నారని బఘేల్ అంటున్నారు. ఆ మాటకొస్తే.. బిజెపిలోని నాయకులందరూ పరమత ద్వేషం కలిగి ఉండడమే తమ రాజకీయ సోపానం అన్నట్టుగా వ్యవహరిస్తుంటారని విమర్శ వస్తే బఘేల్ లాంటి వాళ్లు ఏం చెప్తారు. హిందూ నేతలు కనీసం పరమతసహనం ముసుగుకూడా లేకుండా విద్వేషాల్ని ప్రచారం చేస్తున్నారనే విమర్శ వస్తే వారి జవాబు ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.