దత్తతండ్రి స్కెచ్ ప్రకారమే అడుగులు వేస్తూ ఉండే పవన్ కల్యాణ్.. తన షూటింగ్ గ్యాప్ లో రైతులను పరామర్శించడానికి కాస్త వీలు చేసుకున్నారు. అదే దత్తతండ్రి పర్యటించిన జిల్లాలు, ఆయన మిగలబెట్టిన ఊర్లు, ఆయన వండివార్చిన విమర్శలే- కొత్తవి లేవు. ఆయన వేసిన నిందలకు ఈయన ఎక్స్టెన్షన్ మాత్రమే.
రైతుల పరామర్శ మిషమీద తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ టూరు ఒక డ్రామాలాగా సాగిపోయింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలను రిపీట్ చేయడానికి పవన్ కల్యాణ్ మళ్లీ అక్కడకు వెళ్లినట్టుగా పరిస్థితి తయారైంది.
పవన్ కల్యాణ్ టూర్ ను ఒక రాజకీయ యాత్రగా అభివర్ణించి ఉంటే అది సాగిన తీరుకు పెద్దగా అభ్యంతరాల్లేవు. కానీ.. దానిని పరామర్శ యాత్రగా పేరు పెట్టి.. రాజకీయం తప్ప మరొకటి లేకపోవడం గమనిస్తే పవన్ డ్రామాలపై చీదర పుడుతుంది.
రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ తన షెడ్యూల్లో పెట్టుకున్నదే రెండు మూడు ఊర్లలో రైతులను కలిసి మాట్లాడడం.. వారి కష్టనష్టాలను తెలుసుకోవడం. కడియం సమీపంలో ఆవభూముల్లో నష్టపోయిన రైతులను ఆయన పద్ధతిగానే పరామర్శించారు.
కొత్తపేట నియోజకవర్గం అవిడి గ్రామంలో కూడా కళ్లాల మీద మొలకెత్తుతున్న ధాన్యాన్ని పరిశీలించారు. పి.గన్నవరం నియోజకవర్గంలోని రాజులపాళెం చేరుకున్నారు గానీ.. రైతులతో మాట్లాడడానికి ఆయనకు కుదర్లేదు. పార్టీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో.. రైతులను పలకరించడం సాధ్యం కాలేదని ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు.
అసలు తూగోయాత్ర పెట్టుకోవడం పవన్ కల్యాణ్ ఎజెండా ఏమిటి? రైతుల పరామర్శ కోసమే నిజాయితీగా వెళ్లి ఉంటే గనుక.. ఆయన పార్టీ కార్యకర్తలను వారించి రైతుల వద్దకు వెళ్లలేకపోయారా? లేదా, ఇన్నాళ్లూ షూటింగ్ కారవాన్లలో, ఏసీ గదుల్లో గడిపి.. ఇప్పుడు ఎండకు రెండు ఊర్లు తిరిగే సరికి మూడో ఊరిలో రైతుల కష్టాలు చూడకపోతే మాత్రం ఏం మునిగిపోయిందిలే అని ఆయనకు అనిపించిందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తన యాత్ర చూసి ప్రభుత్వం భయపడిందని, తన యాత్ర షెడ్యూలు రాగానే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, తనకు భయపడి రాత్రికి రాత్రి కొనుగోళ్లు ప్రారంభించారని.. ఇలా అవాకులు చెవాకులు జతచేసి అచ్చంగా దత్తతండ్రి చంద్రబాబునాయుడు మాదిరిగానే ప్రగల్భాలు కూడా పుష్కలంగా పలికారు.
సాధారణంగా పరామర్శకు ఎవరైనా వస్తే.. నష్టపోయిన రైతులు తమ కష్టాలు వెల్లడించుకుంటారు. కానీ.. పవన్ ను కలిసిన రైతులు ‘తామేమీ అవినీతి చేయడం లేదని, కాంట్రాక్టులు చేయడం లేదని, దోపిడీలు కాంట్రాక్టులు చేయడం లేదని..’’ చెప్పారట.
రైతులు తనతో అన్నట్టుగా.. తన బుర్రలో వైసీపీని తిట్టదలచుకున్న పాయింట్లన్నీ కలిపేసి ప్రెస్ మీట్ లో విలేకర్ల ముందు చెప్పేయడం పవన్ అలవాటుగా చేసుకున్నట్టుగా ఈ మాటలు గమనిస్తే మనకు అర్థమవుతుంది.
ఇంతకూ రైతులు పంటలకు గిట్టుబాటు ధర అడుగుతున్నారో, నష్టపోయిన పంటలకు పరిహారం అడుగుతున్నారో కూడా క్లారిటీ లేకుండా పవన్ తన ప్రసంగం ముగించారు. ఆయన రైతుల పరామర్శ పెద్ద ఫార్సుగా, కామెడీ డ్రామాగా సాగిపోవడం విశేషం.