గతంలో నాగబాబు జనసేన సభలకు వస్తే ఆయనకి కూడా ప్రాధాన్యం దక్కేది. దాదాపుగా నాదెండ్ల మనోహర్ స్థాయిలో నాగబాబు కూడా అభివాదాలు చేస్తూ రెచ్చిపోయేవారు. కానీ ఆమధ్య గాడ్సే ట్వీట్ తో తమ్ముడు క్లాస్ పీకాక మిడిల్ బాబు కాస్త వెనక్కి తగ్గారు. అలిగారు, సోషల్ మీడియాకే పరిమితం అయ్యారు.
అటు జబర్దస్త్ కూడా లేకపోవడంతో బాబు బాగా ఖాళీగా ఉన్నారు. అందుకే మత్స్యకార సభకు వచ్చారు. మత్స్యకారుల సమస్యలపై అవగాహన కోసం వచ్చానన్నారు. కల్యాణ్ బాబు దృష్టికి మీ సమస్య తీసుకొచ్చారు కాబట్టి 100శాతం పరిష్కారమైపోతుంది, ఇక మీరు మర్చిపోండి అంటూ డైలాగులు పేల్చారు.
కట్ చేస్తే.. జనసేన పార్టీలో నాగబాబు ప్రాధాన్యం ఏపాటిదో తేలిపోయింది. నాదెండ్ల మనోహర్ స్పీచ్ కి సెపరేట్ గా ప్రెస్ నోట్ విడుదల చేశారు కానీ, నాగబాబుని గుంపులో కలిపేశారు. స్టేజ్ పైన కూడా అందరూ నాదెండ్లపై ఫోకస్ పెట్టారు కానీ, అసలు నాగబాబు ఎవరికీ గుర్తున్నట్టు లేరు. పార్టీలో ఆమాత్రం కూడా గుర్తింపు లేకుండా నాగబాబు రాజకీయాలు చేయడం వేస్ట్, జనసేన తరపున బయటకు రావడం అనే విషయంలో ఆయన మరోసారి ఆలోచిస్తే బెటర్.
నాగబాబు వల్ల పార్టీకి లాభమా.. నష్టమా..?
కేవలం పవన్ కల్యాణ్ అన్నయ్య అనే ఒకే ఒక్క రీజన్ తో జనసైనికులు నాగబాబుని భరిస్తున్నారు. జనసైనికుల్లో చిరంజీవిపై ఉన్న రెస్పెక్ట్ నాగబాబుపై లేదని అంటారు. ఉంటే.. కనీసం ఆయన పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండేవారు. ఆయన మాట ఎవరూ లెక్కచేయరు (పవన్ కల్యాణ్ సహా) కాబట్టే నాగబాబు పార్టీకి దూరంగా ఉంటున్నారు, ఉండాల్సి వచ్చింది.
మళ్లీ ఇప్పుడు మత్స్యకార సభ అంటూ రాసుకుపూసుకు తిరిగితే లాభం ఉంటుందా. ఇప్పటికే స్టీరింగ్ నాదెండ్ల చేతుల్లో పెట్టి పవన్ సినిమాలు, పాలిటిక్స్ అంటూ డబుల్ గేమ్ ఆడుతున్నారు. నాదెండ్ల ఉన్నంతకాలం నాగబాబుకి జనసేనలో ప్రయారిటీ ఉండదు. అప్పుడప్పుడు అలా వెళ్లి తన ఇమేజ్ చెక్ చేసుకుని రావడమే కానీ, అసలు విషయం ఏదీ లేదు.
ఈ విషయంలో నాగబాబు మరోసారి ఆలోచిస్తారేమో చూడాలి. లేదూ తమ్ముడికి తోడుగా ఉంటాను అంటే.. పదే పదే జనసేనలో అవమానాలు భరించాల్సిందే.