మంత్రులు అంటే సచివాలయాలలో ఉంటారు. ఎమ్మెల్యేలు ఎన్నికల వేళ మాత్రమే కనిపిస్తారు. జగనన్న ఏలుబడిలో మాత్రం రెండేళ్ళ ముందు నుంచే జనంలో కనిపిస్తున్నారు. సమస్యలతో వారికి జనాలు స్వాగతం చెబుతున్నారు. వారు కూడా సానుకూలంగా పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు.
సాధ్యమైనంతవరకూ తమ దృష్టికి వచ్చిన ప్రతీ సమస్య పరిష్కరిస్తూ వస్తున్నారు. దీని మీద వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ మాట్లాడుతూ పల్లెలలో మంత్రులు రోజుల తరబడి తిరగడం గతంలో ఎపుడైనా చూశారా అని ప్రజలనే ప్రశ్నించారు.
సమస్యలు పేరుకుపోయి ఉన్నవి కేవలం నాలుగేళ్ల కాలం నుంచే కావు. దశాబ్దాలుగా అని అంటున్నారు. దశలవారీగా తాము ప్రతీ సమస్యనూ పరిష్కరిస్తూ వస్తున్నామని ఆయన అంటున్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేయడం వల్లనే సమస్యలు పెరిగి పెద్దవి అయ్యాయని ఆయన విశ్లేషించారు.
సమస్యలను పరిష్కరించడం వేరు కనీసం వినేందుకు కూడా ఓపిక నాడు లేదని, వారిని కలిసేందుకు జనాలకు అవకాశం లభించలేదని ఆయన విమర్శించారు. ఇపుడే ఇన్ని సమస్యలు ఉన్నట్లుగా ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. కానీ సమస్యలు గుట్టలుగా ఏళ్ల తరబడి పేరుకుపోయాయని గుర్తించడంలేదని వైసీపీ మంత్రులు అంటున్నారు.
తాము చొరవ చూపిస్తున్నామని పల్లెలకు వచ్చి సందు సందునా తిరుగుతున్నామని గతంలో ఎపుడైనా జరిగిందా ఇది కాదా జగన్ ఘనత అని వారు ప్రజలనే అడుగుతున్నారు. మండు వేసవిలో మంత్రులు గడప గడపకూ తిరుగుతున్నారు. గ్రామాల వెంట పరుగులు తీస్తున్నారు. జనాలు కలసి సాధకబాధకాలు చెప్పుకుంటున్నారు.
ఇదంతా రాజకీయం అని విపక్షాలు కానీ ప్రత్యర్ధి పార్టీలు కానీ అనవచ్చు. కానీ రాజకీయమే అయినా గతంలో ఎన్నిక ముందు మాత్రమే మంత్రులు సామంతులు కనిపించేవారు. మారుమూల పల్లెలను ఎవరూ టచ్ చేయని ప్రాంతాలను ఇపుడు వైసీపీ మంత్రులు చుట్టేసి వస్తున్నారు అంటే పాలనలో కొత్త సంస్కరణగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఒక విధంగా రేపటి తరం రాజకీయ నేతలకు, మంత్రులకు ఇది ఒక రాజకీయ పాఠంగా చెప్పాల్సి ఉంటుంది.