ప్రతి ఎన్నికల్లోనూ జేడీఎస్ బలం అంతకంతకూ తగ్గిపోతూనే ఉంది. గత లోక్ సభ ఎన్నికల్లో అయితే.. జేడీఎస్ ఫస్ట్ ఫ్యామిలీ అభ్యర్థులే ఓడిపోయారు. మండ్య నుంచి కుమారస్వామి తనయుడు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జేడీఎస్ బలం తగ్గిపోతుందనే సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఆ పార్టీకి మహా అంటే పాతిక సీట్లు దక్కవచ్చని ప్రీ పోల్- పోస్ట్ పోల్ సర్వేలు అంచనా వేస్తున్నాయి.
మరి పార్టీ బలం అంతకంతకూ తగ్గిపోతూనే ఉన్నా.. కుమారస్వామికి సీఎం ఛాన్సులు మాత్రం మిస్సవడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ వాళ్లు వెంటపడి మరీ కుమారస్వామిని సీఎంగా చేశారు. బీజేపీ గద్దెనెక్కపోతే చాలు అనే లెక్కలతో కుమారస్వామిని కాంగ్రెస్ వాళ్లు దగ్గరుండి సీఎంగా చేశారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కొన్నాళ్లు కాపాడగలిగారు. దాదాపు ఏడాదిన్నర పాటు అప్పుడు కుమారస్వామి కర్ణాటక సీఎంగా వ్యవహరించారు.
ఇలాంటి పొత్తులతో కుమారస్వామికి అది రెండో అవకాశం. అంతకు ముందు బీజేపీ వాళ్లు ఆయనను ఒకసారి రెండున్నరేళ్ల పాటు సీఎం సీట్లో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాటు ఆయనను సీఎంగా కూర్చోబెట్టింది. మరి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి విడదలైన ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే.. కుమారస్వామి మరో సారి మహర్జాతకుడు అయినా పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మూడు పార్టీల్లో వేటికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ కు మినిమం మెజారిటీ అని రెండు మూడు సర్వేలు చెబుతున్నాయి. మిగతావి మాత్రం కాంగ్రెస్ పెద్ద పార్టీ గా నిలవొచ్చు.. బట్ హంగ్ అంటున్నాయి. మరి అలాంటి పరిస్థితి వస్తే.. 20 నుంచి 30 మధ్య ఎమ్మెల్యేల బలాన్ని జేడీఎస్ సంపాదించుకుని కింగ్ మేకర్ కావడం ఖాయం!
ఒకవేళ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా.. అప్పుడే ఎమ్మెల్యేలను కొనేయడంవంటివి కష్టం. అందుకే ప్రస్తుతానికి బీజేపీ తగ్గొచ్చు. లేదా జేడీఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు కూడా! మరి జేడీఎస్ ఫస్ట్ డిమాండ్, లాస్ట్ డిమాండ్ సీఎం సీటే ఉంటుంది. మరి ఎన్నికల సమయంలో జేడీఎస్ తీవ్రంగా విమర్శించారు మోడీ, షా. మరి ఇప్పడు ఆ అవినీతి, వారసత్వ పార్టీకి సీఎం సీటు ఇస్తారా.. అనేది మరీ తలలు బద్ధలు కొట్టుకునే అంశం ఏమీ కాదు. ఎన్నికల్లో మజ్లిస్ తో పొత్తు పెట్టుకున్న పార్టీ అయినా.. జేడీఎస్ తో అవసరం పడితే బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం అనగలదు!
ఇక రెండో అవకాశం కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం. గత ఎన్నికలప్పుడు ఇదే ఏర్పడింది. ఈ సారి కాంగ్రెస్ గనుక వంద సీట్లను సాధించినా, జేడీఎస్ పాతిక సీట్లతో సాధించినా.. ఐదేళ్ల కిందట తరహాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ అప్పుడు తక్కువ సీట్లు కాబట్టి జేడీఎస్ కు సీఎం సీటును ఇచ్చింది. మరి ఈ సారి కాంగ్రెస్ బేరం ఎలా ఉంటుందనేది ఆసక్తిదాయకమైన అంశం. బీజేపీకి అవకాశం దక్కనీయకూడదని కాంగ్రెస్ కుమారస్వామిని మరో ఆలోచన లేకుండా సీఎంగా చేయవచ్చు కూడా! ఆ ప్రభుత్వాన్ని బీజేపీ ఎలా బలహీనపరుస్తుందనేది వేరే కథ.
ఏతావాతా హంగ్ తరహా ఫలితాలు వస్తే మాత్రం.. కుమారస్వామికి మరోసారి కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టున్నాయి!