ఆత్మీయ మంత్రిని కోల్పోయిన జ‌గ‌న్‌

ఆత్మీయ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి (49)ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కోల్పోయారు. ఇవాళ ఉద‌యం గుండెపోటుతో మంత్రి గౌత‌మ్ తుదిశ్వాస విడిచారు. నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హించారు. 2014లో…

ఆత్మీయ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి (49)ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కోల్పోయారు. ఇవాళ ఉద‌యం గుండెపోటుతో మంత్రి గౌత‌మ్ తుదిశ్వాస విడిచారు. నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హించారు. 2014లో ఆత్మ‌కూరు నుంచి మొద‌టిసారిగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి గెలుపొందారు. ఆ త‌ర్వాత 2019లో కూడా విజేత‌గా నిలిచి, జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు.

జ‌గ‌న్ కేబినెట్‌లో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించేవారు. పారిశ్రామిక‌వేత్త‌గా జ‌గ‌న్‌కు గౌత‌మ్‌రెడ్డి ద‌గ్గ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ ప్రోత్సాహంతో రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. ఈయ‌నది రాజ‌కీయ కుటుంబం. మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి కుమారుడిగా రాజ‌కీయ వార‌స‌త్వాన్ని చేప‌ట్టారు. చిన్నాన్న మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి వైసీపీ ఎమ్మెల్యే.

ఎంతో సౌమ్యుడిగా పేరొందిన గౌత‌మ్‌రెడ్డి వివాదాల‌కు దూరం. వారం రోజుల పాటు దుబాయ్ ప‌ర్య‌ట‌న ముగించుకుని ఆదివారం హైద‌రాబాద్‌కు గౌత‌మ్ చేరుకున్నారు. సోమ‌వారం ఉద‌యం గుండెపోటుకు గురి కావ‌డంతో హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 

అత్య‌వ‌స‌ర విభాగంలో చేర్చి ట్రీట్‌మెంట్ అందించినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గౌత‌మ్ మ‌ర‌ణించార‌న్న వార్త‌ను ఆయ‌న భార్య‌కు అపోలో వైద్యులు అందించారు. గౌత‌మ్ మ‌ర‌ణంతో వైసీపీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.