ఏపీలో ఉద్యోగాల్లేవు, ఏపీ ఆర్థిక కష్టాల్లో ఉంది, ఏపీలో నీటికి కరువు, ప్రాజెక్ట్ ల నిర్వహణ బాగా లేదు, మౌలిక వసతులు లేవు.. ఇవన్నీ ఇటీవల కాలంలో బీజేపీ చేస్తున్న ఆరోపణలు. వీటన్నిటికీ ఏకైక పరిష్కారం ప్రత్యేక హోదా.
హోదా వస్తే ఏపీకి ఆర్థిక కష్టాలు తప్పిపోతాయి, ప్రాజెక్ట్ లకు సత్వర అనుమతులు వస్తే నీటి సమస్యలుండవు, కంపెనీలతో పాటు ఉద్యోగాలొస్తాయి. అసలు ఏపీకి సమస్యలే ఉండవు. మరి ఆ హోదా ఎవరి జేబులో ఉంది, ఎవరు ఇవ్వాలి, ఎవరికి ఆ అధికారం ఉంది. అది కూడా బీజేపీ చేతుల్లోనే ఉంది. సమస్య వారే చెబుతున్నారు, దానికి పరిష్కారం కూడా వారి దగ్గరే ఉంది.
మరి కబుర్లు చెప్పేబదులు హోదాపై ప్రకటన చేయొచ్చు కదా. హుందాగా తమ పని తాము చేస్తే.. ఏపీలో బీజేపీకి కూడా హోదా పెరుగుతుంది కదా..? ఆ దిశగా కేంద్రాన్ని ఒప్పించే దమ్ములేని వీర్రాజు.. ఇలా అర్థంపర్థం లేకుండా వైసీపీని ఆడిపోసుకుంటున్నారు.
చేరికలతో చిటికెలు.. చిటికెలు..
ఇటీవల ఏపీలో బీజేపీ కండువాలకు బాగా డిమాండ్ పెరిగిందట. ఎందుకంటే.. బీజేపీలోకి నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా వలస వెళ్తున్నారట. బీజేపీ ఏపీ సోషల్ మీడియాని చూస్తే అసలు ఈ రేంజ్ లో వలసలు ఉన్నాయా అనిపించక మానదు.
అవును, ఇది నిజం.. ఏపీలో బీజేపీ బలంగా బలపడిపోతోందట, ఆ మేరకు వైసీపీ వీక్ అవుతోందట. ఇదీ ఆ పార్టీ ప్రచారం. కేవలం జగన్ ని టార్గెట్ చేసేందుకే వీర్రాజు కూడా ఇటీవల ఈ చేరికల సభల్లో రెచ్చిపోతున్నారు. ఏపీ కష్టాల గురించి ఏకరువు పెడుతున్నారు. మరి దానికి పరిష్కారం కూడా ఆయనే చెబితే ఓ పనైపోతుంది కదా..
హోదా ఇవ్వకూడదు.. అధికారం కావాలి..
తెలంగాణ ఇచ్చాం, తెచ్చాం అని చెప్పుకున్న కాంగ్రెస్ నే అక్కడ పాతర పెట్టారు ప్రజలు. అలాంటిది ఏపీకి కాంగ్రెస్ చేసిన మోసం కంటే, బీజేపీ చేసిన మోసమే ఎక్కువ. విభజన కంటే.. విభజన తర్వాత హోదా ఇవ్వకుండా బీజేపీ చేసిన మోసాన్నే ప్రజలు బాగా గుర్తు పెట్టుకున్నారు. అలాంటిది ఆ హోదా ఇచ్చేస్తే నెత్తిన పెట్టుకుంటారు కదా. ఈ చిన్న లాజిక్ ని వీర్రాజు ఎలా మర్చిపోయారు.
కనీసం ఏపీ పార్టీ శాఖ తరపున అయినా జాతీయ పార్టీపై ఒత్తిడి తెస్తున్నాం అని కూడా చెప్పుకోలేని దీన స్థితి ఏపీలో బీజేపీ నాయకులది. ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేరు, మాట్లాడే వారికి సమాధానం చెప్పలేరు. అయితే ఏపీలో అధికారం మాత్రం వారికి కావాలి. గతంలో పాచిపోయిన లడ్డూలంటూ సెటైర్లు పేల్చిన పవన్ కల్యాణ్ కూడా.. బీజేపీలో కలిసిన పాపానికి.. ఏపీ ప్రజలెవరూ ప్రత్యేక హోదా కోరుకోవట్లేదని స్టేట్ మెంట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ప్రత్యేక హోదాకి అడ్డుగా ఉన్నంత కాలం.. ఏపీలో బీజేపీ మనుగడ అసాధ్యం.