జనసేనాని పవన్‌కల్యాణ్ రీల్ లైఫ్‌లో సీరియస్ యాక్టర్. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం కామెడీ డైలాగ్స్‌ను సీరియస్‌గా చెబుతారు. ఇదే ఆయన ప్రత్యేకత. ప్రశ్నించడానికి వచ్చానంటూ జనసేనాని రూపమెత్తారు. సినిమాల్లో హీరోగా ప్రేక్షకులని రంజింప చేసిన పవన్‌కల్యాణ్, రాజకీయాల్లో కూడా అదే పంథా కొనసాగిస్తారని ఆశించారు. జనసేన పుట్టుకే ఆలస్యం …ప్రత్యామ్నాయంగా ఎదగడం మానేసి ఇతర పార్టీల కొమ్ము కాయడం ప్రారంభించింది.
అందుకే ఆ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా పోయాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభలో పవన్ వీరావేశంతో ఊగిపోయారు. ఈ సందర్భంగా మత్స్యకారుల కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధమన్నారు. జైలుకు వెళ్లాలని ఎవరూ కోరుకోరు. ఆ స్థాయిలో ఉద్యమాలు చేస్తే, పోలీసులు తమ పని తాము చేస్తారు. ఇందులో ఉద్యమకారుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండానే అన్నీ జరిగిపోతాయి. ఇటీవల తెలంగాణలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్షకు దిగితే, పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే.
మత్స్యకారుల సభలో పవన్ ఏమన్నారంటే…
“లక్షలాది మత్స్యకారుల పొట్ట కొట్టేలా, కష్టాన్ని దోచుకునేలా ఉన్న జీవో 217కి వ్యతిరేకంగా పోరాడాలి. మత్స్యకారులకి ఇబ్బంది కలిగించే జీవో ప్రతుల్ని చించేస్తున్నా. చట్టాల్ని పాటించడం ఎంత ముఖ్యమో, కష్టాన్ని దోచుకునే చట్టాలపై తిరగబడడం కూడా అంతే అవసరం. వాటిని ఉల్లంఘించడంలో ఏ తప్పూ లేదు. ప్రభుత్వం కేసులు పెడితే జైలుకెళ్లడానికైనా సిద్ధమే. ఈ జీవోను ఉపసంహరించుకునేలా క్షేత్రస్థాయిలో పోరడతా” అని పవన్‌కల్యాణ్ అన్నారు.
లక్షలాది మంది మత్స్యకారుల పొట్ట కొడుతోందని, కష్టాన్ని దోచుకునేలా జీవో 217 ఉందని స్వయంగా పవన్‌కల్యాణే చెబుతున్నారు. లక్షలాది మందికి మేలు జరగాలంటే కేవలం సభలో రెండు మాటలు మాట్లాడితే ప్రభుత్వం దిగి వస్తుందా? ఇదే తన మిత్రపక్షమైన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఏం చేశాడో పవన్ తెలుసుకుంటే మంచిది. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను కలవరపరిచే 317 జీవోను రద్దు చేయాలని బండి సంజయ్ కరీంనగర్‌లో పార్టీ కార్యాలయంలో జాగరణ దీక్షకు దిగారు. అర్ధరాత్రి వేళ బండి సంజయ్‌ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
పోరాటం చేయడమంటే, జైలుకు వెళ్లడం అంటే ఏంటో తెలుసుకోడానికి చిన్న ఉదాహరణ ఇది. ఏనాడైనా పవన్‌కల్యాణ్ ప్రభుత్వాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసేలా ఉద్యమించారా? సభల్లో మాత్రం అది చేస్తా, ఇది చేస్తా అని హెచ్చరికలతోనే కాలం గడుపుతున్నారు. సినిమాల్లో జైలుకు వెళ్లే పాత్రలో నటిస్తారేమో గానీ, రియల్ లైఫ్‌లో మాత్రం ఇలా రాజకీయాలు చేస్తే ఎప్పటికీ జరిగేది కాదు. ఇలాగైతే తన నాయకత్వంపై ప్రజల్లో భరోసా ఎలా కలుగుతుంది? మాటలతో మభ్య పెట్టడం మాని, ఆచరణకు దిగితే ప్రయోజనం వుంటుంది.