కర్ణాటక- మిశ్రమ సంకేతాలు

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ను అనుకూలంగా వున్నాయి. అయితే అలా అని మరీ ఏకపక్షంగా మాత్రం కాదు. కాంగ్రెస్ ఎడ్జ్…

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ను అనుకూలంగా వున్నాయి. అయితే అలా అని మరీ ఏకపక్షంగా మాత్రం కాదు. కాంగ్రెస్ ఎడ్జ్ లో వుందని వెల్లడైన మాట వాస్తవం. కానీ పోటా పోటీగా వుందని కూడా ఎగ్జిట్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 

గతంలో మాదిరిగానే ఇలాంటి సమయంలో జేడిఎస్ మరోసారి కీలకపాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా వున్నాయి. అధికారం తమకు అందినా, అందకున్నా కాంగ్రెస్ కు అందకూడదు అన్నది భాజపా పంతం. అందుకోసం ఏమైనా చేయడానికి సిద్దం. ఇది గతంలో ఎన్నోసార్లు రుజువయింది. అది అప్రజాస్వామికమైనా సరే భాజపా వెనుకాడదు. ఎలాగూ ఇది తప్పు అని నిర్మొహమాటంగా ఎత్తి చూపే మీడియా ఎలాగూ దేశంలో పెద్దగా లేదు.

అందువల్ల కర్ణాటకలో కాంగ్రెస్ కు యునానిమస్ మద్దతు లభిస్తే తప్ప అంతగా ఫలితం వుండదు. కేవలం పది నుంచి ఇరవై స్థానాల లీడింగ్ సరిపోదు. ఆ మేరకు జెడిఎస్ రెడీగా వుంటుంది. అసలు జెడిఎస్ ఆశ అంతా భాజపా ఆలోచనా ధోరణి మీదే. కాంగ్రెస్ రాకూడదు అన్నది భాజపా ఆలోచనా ధోరణి. అదే జెడిఎస్ కు అనుకూల అంశం. ముందుగా కాంగ్రెస్ ను పక్కన పెట్టగలిగితే తరువాత చూసుకోచవ్చు అన్నది భాజపా ఆలోచన.

కానీ ఇక్కడ ఒకటి వాస్తవం. కాస్మాపాలిటన్ కల్చర్ వున్న బెంగళూరు, చెప్పుకోదగ్గ మైనారిటీ పాపులేషన్ వున్న రాష్ట్రం, కాస్త బలమైన ఆలోచనాధోరణి వున్న ప్రాంతం, కులాలు, మతాలు రెండూ సమానంగా రాజకీయాలను ప్రభావితం చేసే చోటు, ఇలాంటి చోట భాజపా నెగ్గుకురావడం అంత కష్టం కాదు. 

మొదటి నుంచీ దక్షిణాదిన కేవలం కర్ణాటకలో మాత్రమే భాజపా పాగా వేయగలగడానికి ఇవన్నీ కొన్ని కారణాలు. కానీ ఇప్పుడు అవే కారణాలు భాజపాను విజయానికి దూరంగా నెడుతున్నాయి. కారణమేమిటంటే భాజపాలో కూడా కాంగ్రెస్ తరహా రాజకీయాలు చోటు చేసుకోవడ‌మే. అలాంటి రాజకీయాలను సహించని భాజపా, నిర్మొహమాటంగా సీనియర్లను, సిటింగ్ లను దూరం పెట్టి, కొత్తవారికి అవకాశం ఇచ్చింది. అది చాలా వరకు తేడా కొట్టిందని ప్రాధమిక వార్తలు అందుతున్నాయి.

దక్షిణాదిన భాజపాకు హొప్ వున్న రాష్ట్రం కర్ణాటక. అది ముందుగానే చేజారితే, మిగిలిన మూడు రాష్ట్రాల్లో భాజపా వ్యూహాలు మారవచ్చు. తమిళ, కేరళల్లో పెద్దగా చేయగలిగింది లేదు.ఇక మిగిలింది ఆంధ్ర, తెలంగాణ. ఆంధ్రలో స్వంతగా చేయగలిగింది అసలే లేదు. తేదేపాతో వెళ్లడమా? వైకాపా వెనుకే వుండడమా? అన్నది తేల్చుకోవాల్సి వుంటుంది. 

కర్ణాటక ఫలితాలు తెలంగాణలొ భాజపా ఫలితాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే తెరాస బలంగా వుంది. మైనారిటీ ఓటు బ్యాంక్ స్థిరంగా వుంది. కాంగ్రెస్ కనుక కాస్త కఠినంగా వ్యవహారించి, పాతుకు పోయిన సీనియర్లను పక్కన పెడితే, భాజపాకు పెద్దగా ఒరిగేది ఏమీ వుండదు.

మొత్తానికి కర్ణాటక ఎన్నికలు ముందుగా జరిగి, దక్షిణాది రాజకీయ ముఖచిత్రాన్ని ప్రభావితం చేసే అవకాశం క్లారిటీగా కనిపిస్తోంది.