కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో వెల్లడవుతున్న ఎగ్జిట్ పోల్స్ కాస్త భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. చాలా వరకూ ఎగ్జిట్ పోల్స్ హంగ్ తరహా ఫలితాలను అంచనా వేస్తున్నా, సీట్ల విషయంలో మాత్రం కాస్త తేడాలు చూపిస్తున్నాయి. వాటన్ని సంగతలా ఉంటే.. ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలా ఆసక్తిదాయకమైన ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ కు ఏకంగా 122 నుంచి 140 అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయి. భారతీయ జనతా పార్టీకి కేవలం 62 నుంచి 80 అసెంబ్లీ సీట్ల వరకూ మాత్రమే దక్కుతాయని ఇండియాటుడే సర్వే చెప్పడం గమనార్హం. జేడీఎస్ కు 20 నుంచి 25 సీట్లు, ఇతరులకు మూడు సీట్ల వరకూ దక్కే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది!
అన్ని సర్వేల్లో కెళ్లా ఈ సర్వే ఈ నంబర్లతో ప్రత్యేకంగా నిలుస్తోంది. అన్ని సర్వేల సగటును తీసుకుంటే కర్ణాటకలో హంగ్ తరహా ఫలితం రానుందని అవి చెబుతున్నాయి. అయితే వాటిల్లో కూడా కాంగ్రెస్ దే పై చేయి కావడం గమనార్హం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.
జన్ కీ బాత్ పోస్ట్ పోల్ అధ్యయనం ప్రకారం… 91-106 సీట్ల వరకూ కాంగ్రెస్ కు, బీజేపీకి 94-117 సీట్లు జేడీఎస్ కు 14 నుంచి 24 సీట్ల వరకూ దక్కుతాయి.
సీ ఓటర్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు గరిష్టంగా 112 సీట్లు, కనిష్టంగా 100 సీట్లు దక్కనున్నాయి. ఈ సర్వే ప్రకారం బీజేపీకి 83 నుంచి 95 సీట్ల వరకూ దక్కవచ్చని అంచనా. జేడీఎస్ కు 21 నుంచి 29 సీట్ల వరకూ దక్కవచ్చని ఈ సర్వే అంచనా వేసింది.
మరో ఆసక్తిదాయకమైన అంశం టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే కూడా కాంగ్రెస్ కు మ్యాజిక్ ఫిగర్ దక్కుతుందని చెప్పడం గమనార్హం. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 113,బీజేపీకి 85, జేడీఎస్ కు 23,ఇతరులకు మూడు సీట్లు దక్కుతాయని టైమ్స్ నౌ సర్వే అంచనా వేసింది. ప్రీ పోల్ సర్వేల్లో బీజేపీకే పట్టం గట్టింది టైమ్స్ గ్రూప్. అయితే పోస్ట్ పోల్ సర్వేలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను రీచ్ కావొచ్చని చెబుతుండటం గమనార్హం.
ఇక రిపబ్లిక్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ కు 101, బీజేపీకి 92, జేడీఎస్ కు 28 సీట్లు దక్కవచ్చని అంచనా! టీవీ 9 సర్వే ప్రకారం.. కాంగ్రెస్ కు 104, బీజేపీకి 93, జేడీఎస్ కు 24 సీట్లు దక్కవచ్చని అంచనా.
ఏతావాతా పోస్ట్ పోల్ సర్వేల్లో చాలా వరకూ కాంగ్రెస్ దే పై చేయి అని అంటున్నాయి. పేరున్న మీడియా సంస్థల సర్వేలు కాంగ్రెస్ కు మినిమం మెజారిటీ దక్కవచ్చని కూడా అంచనా వేస్తున్నాయి. ప్రీ పోల్ సర్వేల్లో కూడా కాంగ్రెస్ దే పై చేయి అవుతుందనే అభిప్రాయం వినిపించింది. పోస్ట్ పోల్ సర్వేల్లో కొన్ని కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను రీచ్ అవుతుందని కూడా చెబుతున్నాయి. మరి అసలు సంగతేమిటనేది ఈ శనివారం నాడు వెల్లడి కాబోతోంది.