మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శిలాఫలకాలు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభోత్సవాలలో కనిపించాలని తమ్ముళ్ళు ఆరాటపడుతున్నారు. అలాగే జరగాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఎంవీవీ కాలనీలో ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాకు ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 11న ప్రారంభోత్సవం చేస్తున్నారు.
ఇది విశాఖకు తలమానికం కానుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి చేశారు అయితే దీనికి టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసింది మాజీ సీఎం చంద్రబాబు కాబట్టి ఆయన శిలాఫలకం కూడా జగన్ ప్రారంభం చేసే శిలాఫలకం పక్కనే ఉంటాయని తమ్ముళ్ళు పట్టుబడుతున్నారు.
అయితే కేవలం శంకుస్థాపన మాత్రమే ఆయన చేశారు మొత్తం చేసింది మేము కదా అని వైసీపీ నేతలు అంటున్నారు. చూడబోతే ఇదేదో రాజకీయ వివాదం అయ్యేట్లుగా ఉందనిపిస్తోంది. ఈ స్పోర్ట్స్ ఎరీనాకు స్మార్ట్ సిటీ పధకం నుంచి దాదాపుగా ఇరవై కోట్లు కేటాయించారు. వీమ్మార్డీయే నుంచి మరో నాలుగున్నర కోట్లు కేటాయించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసింది కాబట్టి క్రెడిట్ వైసీపీదే అని ఆ పార్టీ వారు అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ బాబు కల కాబట్టి ఆయనదే క్రెడిట్ అని తమ్ముళ్ళు వాదిస్తున్నారు. జగన్ చేతుల మీదుగా ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఓపెనింగ్ కి నోచుకోవడంతో తమ్ముళ్లకు మాత్రం నిద్రపట్టడం లేదని వైసీపీ నుంచి కామెంట్స్ వస్తున్నాయి.
టెంకాయలు గత ప్రభుత్వం కొడితే తాము అన్నీ పూర్తి చేసి శంకుస్థాపనలు చేస్తున్నామని వాస్తవాలు ఇలా ఉంటే ఈ రాజకీయ రగడ దేనికి అన్నది వైసీపీ వారి వాదన.