భట్టికి ఆ మాట చెప్పే అర్హత ఉందా?

ఐఏఎస్ మాజీ అధికారి సోమేశ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రికి సలహాదారుగా నియమితులు కావడాన్ని ఎవ్వరూ సమర్థించరు. గులాబీనీడలో ఉంటే చాలు తాను ఎలా చెలరేగిపోయినా, ఎవ్వరినీ ఖాతరు చేయకపోయినా పర్లేదని విర్రవీగిన ఐఏఎస్ అధికారులు…

ఐఏఎస్ మాజీ అధికారి సోమేశ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రికి సలహాదారుగా నియమితులు కావడాన్ని ఎవ్వరూ సమర్థించరు. గులాబీనీడలో ఉంటే చాలు తాను ఎలా చెలరేగిపోయినా, ఎవ్వరినీ ఖాతరు చేయకపోయినా పర్లేదని విర్రవీగిన ఐఏఎస్ అధికారులు సోమేశ్ కుమార్ ముందువరుసలో ఉంటారు. 

విభజనకు ముందే గులాబీ అనుకూల వైఖరిని దాచుకోలేకపోయిన ఐఏఎస్ అధికారి ఆయన. రాష్ట్ర విభజన తర్వాత.. జీహెచ్ఎంసీ కమిషనర్ గా చెలరేగిన రోజుల్లో సీమాంధ్రుల కు సంబంధించిన వ్యవహారాల్లో చాలా కక్ష కట్టినట్టుగా వ్యవహరించారనే పేరు కూడా మూటకట్టుకున్నారు. 

విభజనలో ఆయనను ఏపీ కేడర్ కు కేటాయిస్తే.. తెలంగాణలోనే కొనసాగుతూ సీఎస్ అయ్యారు. తప్పనిసరిగా ఏపీకి వెళ్లాల్సి వచ్చేసరికి అక్కడ పనిచేయడానికి మొహం చెల్లక వీఆర్ఎస్ తీసుకున్నారు. సహజంగానే కేసీఆర్ ఆయనకు రెడ్ కార్పెట్ వేసి కేబినెట్ హోదాతో సలహాదారు పోస్టు కట్టబెట్టారు. ఇది ఎవ్వరూ సమర్థించదగిన నియామకం కాదు.

అంత మాత్రాన, దీనిని నిందించడానికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కకు అర్హతగానీ, నైతిక హక్కు గానీ ఉందా అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఎందుకంటే.. ఐఏఎస్ లు తాము సర్వీసులో ఉండగా.. అనుచితమైన రీతిలో రాజకీయ పార్టీలకు ఊడిగం చేసి, పదవీ విరమణ తర్వాత ఆయా పార్టీల తీర్థం పుచ్చుకుని రాజకీయంగా చెలరేగడం అనేది చాలా మామూలు సంగతి. 

కాంగ్రెస్ అలాంటి వాటికి అతీతం ఎంతమాత్రమూ కాదు. కాంగ్రెస్ తరఫున స్పీకరుగా చేసిన మీరాకుమార్, ఎంపీ మణిశంకర్ అయ్యర్ వీరంతా సివిల్ సర్వీసెస్ అధికారులే. ఉమ్మడి తెలుగురాష్ట్రంలో ఐఏఎస్ గా సేవలందించిన కొప్పుల రాజును రాహుల్ గాంధీ తన కోర్ టీమ్ కు చీఫ్ గా నియమించుకున్న సంగతి వాస్తవమే కదా! 

ఇలా తమ పార్టీలోనే.. పదవీవిరమణ చేసిన ఐఏఎస్ లకు పెద్దపీట వేసే సంస్కృతి పుష్కలంగా పెట్టుకుని.. ఇవాళ కేసీఆర్ ఒక పదవి కట్టబెడితే.. దానిమీద నిందలు వేయడానికి భట్టి విక్రమార్కకు అర్హత ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. రాజకీయాల్లో దందా చేయడానికి ఒక పదవీవిరమణ వయసు అంటూ లేదు. అందువల్లనే.. బ్యూరోక్రాట్లుగా పదవీవిరమణ చేసిన వారందరూ ఈ దందాలో అడుగుపెడుతున్నారు. ఇంకా యింకా దండుకోవాలని చూస్తున్నారు. కాబట్టి భట్టి లాంటి సిస్టమేటిక్ రాజకీయం కోరుకునే వాళ్లు అధికారంలోకి వస్తే.. రాజకీయ నాయకులకు పదవీ విరమణ వయసును చట్టబద్ధంగా నిర్దేశిస్తే సరిపోతుంది.