ప్ర‌చారంలో క‌నిపించినంత జోష్ పోలింగ్ లో లేదే!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వం అత్యంత జోష్ తో సాగింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ క‌నివినీ ఎర‌గ‌ని స్థాయిలో ప్ర‌చార పర్వాన్ని సాగించింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ దాదాపు నెల రోజుల పాటు…

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వం అత్యంత జోష్ తో సాగింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ క‌నివినీ ఎర‌గ‌ని స్థాయిలో ప్ర‌చార పర్వాన్ని సాగించింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ దాదాపు నెల రోజుల పాటు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల కోస‌మే స‌మ‌యం కేటాయించారు. ఇక అమిత్ షా అత్యంత ఎక్కువ స‌భలు, ర్యాలీల్లో పాల్గొన్న నేత‌గా నిలిచారు. వీరు గాక 16 రాష్ట్రాల సీఎంలు, కేంద్ర‌మంత్రులు, బీజేపీ జాతీయ నేత‌లు, భ‌క్తులు.. ఈ హ‌డావుడి అలాంటిలాంటిది కాదు.

బీజేపీతో పోటీ ప‌డ‌లేక‌పోయినా.. కాంగ్రెస్ పార్టీ కూడా ప్ర‌చారాన్ని గ‌ట్టిగానే సాగించింది. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ప్ర‌చార‌ప‌ర్వం స‌గం స్థాయి క‌న్నా త‌క్కువే అని చెప్పాలి. ప్ర‌ధానులు, కేంద్ర‌మంత్రులు కాంగ్రెస్ ఖాతాలో లేరు. ఇక వేరే రాష్ట్రాల సీఎంలు వెళ్లి ప్ర‌చారం చేసేంత సీన్ లేదు. క‌నీసం తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేత‌లు కూడా అక్క‌డ‌కు వెళ్లి హ‌ల్చ‌ల్ చేసింది లేదు! అదే బీజేపీకి అయితే.. గ‌ల్లీకో ఎంపీ-ఎమ్మెల్యే స్థాయి నేత‌లు ప్ర‌చార ఇన్ చార్జిలుగా చేశారు.

ఇక జేడీఎస్ కూడా త‌న వ‌ర‌కూ పోరాడింది. పాతిక నుంచి యాభై సీట్ల‌లో జేడీఎస్ గ‌ట్టిగా ప్ర‌చారం సాగించింది. మిగ‌తా చోట్ల నామ‌మాత్ర‌పు పోటీ లేదా ఓట్లు చీల్చే పోటీ. ఏతావాతా క‌ర్ణాట‌క అసెంబ్లీ ప్ర‌చారం బ్ర‌హ్మాండ‌మైన రీతిలో సాగింది. వీధివీధీ కాషాయ జెండాల‌తో, నినాదాల‌తో వేడెక్కిపోయింది!

మ‌రి క‌ట్ చేస్తే.. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం 65 వ‌ర‌కూ మాత్ర‌మే న‌మోదైంది. సాయంత్రం ఐదు గంట‌ల‌కు ఈ శాతం పోలింగ్ న‌మోదైంద‌ని ఈసీ ప్ర‌క‌టించింది. పూర్తి లెక్క‌లు విడుద‌ల కావాల్సి ఉంది. ఒక‌వేళ మ‌హా అంటే ఒక‌టీ రెండు శాతం అద‌నంగా న‌మోదు కావొచ్చు. అయితే ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 65 శాతం అంటే ఇది త‌క్కువ పోలింగే!

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ శాతం 75 స్థాయిలో న‌మోద‌వుతూ ఉంటుంది స‌గ‌టున‌. అయితే క‌ర్ణాట‌క జ‌రిగిన ప్ర‌చార ప‌ర్వంతో పోలిస్తే పోలింగ్ శాతం త‌క్కువ స్థాయిలోనే న‌మోదైంది. మ‌రి ఈ త‌క్కువ పోలింగ్ శాతం బీజేపీకి సానుకూలం అనే వాద‌న స‌హ‌జంగానే ఉంటుంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉన్న‌ప్పుడే పెద్ద ఎత్తున పోలింగ్ శాతం న‌మోద‌వుతుంద‌ని, ఉన్న ప్ర‌భుత్వం పై సానుకూల‌త ఉన్న‌ప్పుడు త‌క్కువ పోలింగ్ శాతం న‌మోదవుతుంద‌నే వాద‌న పాత‌దే. మ‌రి శ‌నివారంతో అస‌లు క‌థేమిటో తేలిపోనుంది.