అకాశ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతో పాటు నష్టపోయిన రైతుల్ని పరామర్శించడానికి జనసేనాని పవన్‌కల్యాణ్ ఎట్టకేలకు రెండు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టారు. కాసేపటి క్రితం రాజమండ్రి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. పవన్‌కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు. ఇక అక్కడి నుంచి ఆయన పంట పొలాలను పరిశీలించేందుకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి వుంది. పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలకడానికి ఏ ఒక్క టీడీపీ కార్యకర్త, నాయకుడు రాజమండ్రి విమానాశ్రయానికి వెళ్లలేదు. అలాగే పవన్ పర్యటనలో పాల్గొనేందుకు టీడీపీ వాళ్లెవరూ అటు వైపు తొంగి చూడలేదు. టీడీపీ నుంచి చాలా నేర్చుకోవాల్సి వుందని జనసేన కార్యకర్తలకు పవన్ అభిమానులు హితవు చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లి భేటీ అయ్యారు.
పొత్తులపై చర్చించుకున్నారు. రానున్న ఎన్నికల్లో అవలంభించాల్సిన విధివిధానాలపై మాట్లాడుకున్నట్టు జనసేన నేతలు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఇలాంటి భేటీలు మరిన్ని జరుగుతాయని జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బాబుతో పవన్ భేటీ అయిన మరుసటి రోజే కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ చెంతకు జనసేన కార్యకర్తలు వెళ్లారు.
లోకేశ్ కోసం టీడీపీ ఏర్పాటు చేసిన సభలో జనసేన జెండాలు ప్రత్యక్షమయ్యాయి. తమకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన జనసేన కార్యకర్తల్ని చూసి లోకేశ్ ఆనందించారు. జనసేన సోదరులకు లోకేశ్ నమస్కారాలు పెట్టారు. మరి పవన్‌కల్యాణ్ పర్యటనలో టీడీపీ కార్యకర్తలెవరూ పాల్గొనలేదని, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం తమ వాళ్లకు ఎందుకు లేదని పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
పవన్‌కు సంఘీభావం చెప్పడానికి టీడీపీ కార్యకర్తలెవరూ రాలేదని, మనం మాత్రం అత్యుత్సాహంతో లోకేశ్ దగ్గరికి వెళ్లామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ అవగాహన లేకపోవడంతో టీడీపీ పల్లకీ మోయాల్సి వస్తోందని, ఇప్పటికైనా జనసేన కార్యకర్తలు సిగ్గు తెచ్చుకుని తెలివిగా నడుచుకోవాలనే హిత వచనాలు వెల్లువెత్తుతున్నాయి.