న్యూసెన్స్ ట్రైలర్ చూశాను. జర్నలిస్టులపై వ్యంగ్యంగా తీసినట్టున్నారు. జర్నలిజం చెడిపోయింది అనడం కంటే చెడగొట్టారు అనడం కరెక్ట్. అన్ని వ్యవస్థలూ చెడిపోయినట్టే, ఇది పోయింది. పత్రికా స్వేచ్ఛ వల్లే ప్రజాస్వామ్యం బతుకుతోంది అంటే ఇది సినిమా డైలాగ్ తప్ప, వాస్తవం కాదు. స్వేచ్ఛ అంటే యజమానుల స్వేచ్ఛే.
లాల్చీ పైజామా, మాసిన గడ్డం, భుజానికి సంచి, చేతిలో నోట్ బుక్, ఒక ముసలి ప్రెంటింగ్ ప్రెస్, గోడలకి నాయకుల ఫొటోలు మన సినిమాల్లో విలేకరి రూపం. అతను విలన్‌కి వ్యతిరేకంగా రాసి, ప్రాణం పోయినా సరే సత్యాన్ని అమ్ముకోను అని సింగిల్ డైలాగ్ చెప్పి, కత్తిపోట్లతో పోతాడు. వాస్తవానికి విలేకరి జీవితంపై మన సినిమా దర్శకులకు కనీస అవగాహన కూడా లేదు. జర్నలిస్టు అంటే పాతకాలం చక్రం తిరిగే ప్రెస్‌లో వుంటూ విలన్ చేతిలో బెదిరింపులకి గురయ్యేవాడు. లేదంటే ఏ పోలీస్ ఆఫీసర్ వెంట పరుగెత్తుతూ ప్రశ్నలు అడిగేవాడు.
న్యూసెన్స్ వెబ్‌సిరీస్‌లో ఇంకొంచెం లోతుగా వెళ్లినట్టున్నారు. రాస్తే వచ్చే డబ్బుల కంటే, రాయకపోతే వచ్చేది ఎక్కువ అనే డైలాగ్ వుంది. దీనికి జర్నలిస్టులు భుజాలు తడుముకోవలసిన పనిలేదు. ఇది మనకి ఉద్యోగంలో చేరినప్పుడే తెలుసు. A for Apple లాంటి ప్రాథమిక సూత్రం.
అయితే వాస్తవాన్ని తొక్కి పెట్టడం సాధ్యమా? ఈ డిజిటల్ యుగంలో సాధ్యం కాదు. ఎవరి సత్యాన్ని వాళ్లు చెప్పుకుంటారు. రాజకీయంగా ఒక సంఘటన జరిగితే ఒక్కో పేపర్‌లో ఒక్కో రకంగా వస్తుంది. చానల్స్ కూడా తమ యాజమాన్యం అనుసరించే పార్టీని బట్టి రిపోర్ట్ చేస్తాయి. రాజకీయ పార్టీలతో సంబంధం లేని మీడియా వుండే అవకాశం లేదు. పార్టీ నాయకులే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా యజమానులు కాబట్టి.
యాజమాన్యాలే ప్రయోజనాల కోసం అమ్ముడుపోయినప్పుడు కూలి డబ్బులకి పని చేసే జర్నలిస్టులు అమ్ముడుపోతే ఆశ్చర్యం ఎందుకు? కూలి అని ఎందుకు అంటున్నానంటే చాలా మండల కేంద్రాల్లో పని చేసే విలేకరులకి ఒక వ్యవసాయ కూలీకి ఉపాధి పనుల్లో వచ్చే డబ్బు కూడా రాదు. డబ్బులివ్వకుండా, గౌరవ వేతనం పేరుతో, జనాల మీద పడి బతకమని యాజమాన్యాలే ఉసిగొల్పుతున్నాయి. యాడ్స్ టార్గెట్స్ పెట్టి వసూళ్ల కోసం పరిగెత్తిస్తున్నాయి.
పూర్వం ఆంధ్రప్రభ పత్రిక ఉన్నప్పుడు విలేకరులంటే చాలా గౌరవం. సమాజంలో జరిగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలకి వారధిగా వుండేవారు. నామమాత్రపు వేతనం వచ్చినా, నలుగురిలో గౌరవం కోసం వృత్తిలో వుండేవారు. 1990 తర్వాత అసలు పతనం ప్రారంభమైంది. పత్రికల విస్తరణ మొదలైంది. జిల్లా ఎడిషన్లు, రంగుల ముద్రణ, పేజీల పెంపు జరిగే సరికి ఖర్చులు పెరిగాయి. పత్రిక అమ్మకాల్లో లాభాలు రావు. నిర్వహణ ఖర్చుకి, అమ్మకాల్లో వచ్చే డబ్బుకి సంబంధం లేదు. యాడ్స్‌లో వచ్చేదంతా లాభం కింద లెక్క. అయితే అందరికీ విపరీతమైన యాడ్ రెవెన్యూ వుండదు. కాబట్టి పత్రికలో నష్టాలొస్తున్నాయని విలేకరులకి అరకొర జీతాలు, డెస్క్ జర్నలిస్టులు, జిల్లా రిపోర్టర్లకి ఘోరమైన జీతాలు ఇస్తుంటారు.
అయితే పత్రిక పేరుతో ఇతర ప్రయోజనాలు వేరే వుంటాయి. ప్రభుత్వంతో పనులు, ఇతర వ్యాపారాల విస్తరణ, పత్రికాఫీసులకి స్థలాలు వీళ్లకి వేల కోట్ల ఎంఫైర్ ఏర్పడడానికి మీడియానే కారణం. కానీ ఇది ఎక్కడా చెప్పరు. నష్టాలు వస్తున్నాయని అంటుంటారు.
దీన్ని సింపుల్‌గా చెప్పాలంటే, గేదెను సాకుతున్న వాడు పాలు. పెరుగు హాయిగా అమ్ముకుంటూ పిడకల వ్యాపారంలో గిట్టుబాటు లేదని ఏడ్చినట్టు. ఎప్పుడైతే యాజమాన్యాలు యాడ్స్ డబ్బుల కోసం విలేకరుల వెంటపడ్డాయో డబ్బులు అడుక్కునే శక్తిలేని వాళ్లు గౌరవంగా తప్పుకున్నారు. దీంట్లో బంగారు బాతుని కనిపెట్టిన వాళ్ల సంఖ్య పెరిగింది.
మండల కేంద్రాల్లో రింగ్‌గా ఏర్పడ్డారు. వీళ్లకి తర్వాత అదనంగా చానళ్ల విలేకరులు కలిశారు. టీవీ విలేకర్లకి డబ్బులివ్వరు. కేవలం కార్డు వుంటుంది. కెమెరా కూడా సొంతంగా తెచ్చుకోవాలి. వాళ్లు పంపిన వార్త టీవీలో వస్తే డబ్బులిస్తారు. కొందరు అదీ ఇవ్వరు.
విలేకరుల రింగ్ బతకడానికి ఏం చేస్తుందంటే (సంస్థలు జీతం ఇవ్వకపోగా, ఎదురు అడుగుతున్నాయి మరి) పోలీస్ స్టేషన్లో పంచాయితీలు, రియల్ ఎస్టేట్ మధ్యవర్తిత్వం, లంచగొండి అధికారుల నుంచి నెల వసూళ్లు, ప్రభుత్వం ఇచ్చే స్థలాలు, పథకాలు పొందడం, ఆయా ఊరు స్టామినా ఆధారంగా దందా వుంటుంది. ఇంత చేసినా కొంత మంది తెలివైన వాళ్లే బాగా సంపాదించుకుంటారు. మిగతా వాళ్లకి జరుగుబాటు అంతే.
ఒక మండల కేంద్రంలో రాజకీయ పార్టీ ధర్నా చేయాలంటే భయపడే పరిస్థితి. జనాలకి డబ్బులివ్వాలి. విలేకర్లకి ఇవ్వాలి. అన్ని రకాల రిపోర్టర్లు కలిసి చిన్నవూళ్లో కూడా 30 మంది దాకా తేలుతున్నారు. వీళ్లని గమనించుకోవాలంటే చమురు వదులుతుంది.
విలేకర్లల్ని మేపడం కంటే ఏనుగుని మేపడం సులభం అని ఒక రాజకీయ నాయకుడు అన్నాడంటే పరిస్థితి అర్థమవుతోంది. యాజమాన్యాలు చెడిపోవడం వల్ల వీళ్లనెవరూ బాగు చేయలేరు. ఎవరైనా రిపోర్టర్ నేను నిజాయతీగా వార్తలు రాస్తాను అంటే వాడి ఉద్యోగం పోయినట్టే. కావాల్సింది నిజాయతీ కాదు, సంస్థకి అనుగుణంగా రాయడం, జనం వెంటపడి యాడ్స్ కలెక్ట్ చేయడం.
ఎపుడైతే జనాలకి నీతి సూత్రాలు వల్లిస్తూ, కేంద్రం నియమించిన వేజ్‌బోర్డ్ వేతనాల్ని కూడా యాజమాన్యాలు ఎగ్గొట్టాయో అప్పుడే పతనం మొదలైంది. రకరకాల బినామీ సంస్థల్ని ఏర్పాటు చేసి చాకిరీ చేయించుకున్నారో అప్పుడే జర్నలిస్టుల నైతికత పోయింది. వెట్టి చాకిరీ చేసే వాళ్లకి సమాజం గురించి మాట్లాడే హక్కుందా? జీతాలు విధిలిస్తున్న సంస్థలకి, రాజకీయ పార్టీలకి తాళం వేస్తూ జీవించేయడమే. న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్‌లో పచ్చి బూతులు తిట్టినా తిట్టించుకోవాల్సిందే. సిగ్గుపడేదేముంది? సిగ్గుపడాలంటే చాలా విషయాలకి సిగ్గుపడాలి. అయినా సిగ్గు పడడం మరిచి చాలా కాలమైంది కదా!
జీఆర్ మహర్షి