ముందు కేసీఆర్.. తర్వాత జగన్.. అసలేంటి సంగతి?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చిన రెండు రోజుల వ్యవధిలోనే ఏపీ సీఎం జగన్ హస్తిన బయలుదేరారు. ప్రస్తుతానికి హోంమంత్రి అమిత్ షా భేటీపై మాత్రమే క్లారిటీ ఉన్నా.. ఇతరత్రా వ్యవహారాలన్నిటిపై స్పష్టత…

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చిన రెండు రోజుల వ్యవధిలోనే ఏపీ సీఎం జగన్ హస్తిన బయలుదేరారు. ప్రస్తుతానికి హోంమంత్రి అమిత్ షా భేటీపై మాత్రమే క్లారిటీ ఉన్నా.. ఇతరత్రా వ్యవహారాలన్నిటిపై స్పష్టత రాలేదు.

రెండు రోజుల వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట ఎందుకు పట్టారనేదే అంతు చిక్కని రహస్యం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, నిధుల మంజూరు కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని చెబుతున్నా.. అధికారులు లేకుండానే ఆయన ఒంటరిగా మంత్రుల్ని, ప్రధానిని కలసి వచ్చారు. 

ఇటీవలే ఆర్థిక మంత్రి బుగ్గన, జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఏపీ తరపున ఢిల్లీ వెళ్లి వచ్చారు. అంతలోనే సీఎం పర్యటన ఖరారు కావడం మరింత విశేషంగా మారింది. పైకి పోలవరం పేరు చెబుతున్నా, తెరవెనక చాలా అంశాలే చర్చకొచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఈ ఎపిసోడ్ లో సస్పెన్స్ తట్టుకోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు మాత్రమే. ఢిల్లీలో ఏం జరుగుతోందో, అమిత్ షా ఆఫీస్ లో ఏం మాట్లాడుకున్నారో కనిపెట్టడానికి, నోటికొచ్చినట్టు రాయడానికి తోక పత్రికలు రెడీగా ఉన్నా కూడా.. అసలు నిజం తెలుసుకోడానికి బాబు ఆపసోపాలు పడిపోతున్నారు.

రైతు ఉద్యమంపై బుజ్జగింపులా..?

బాబు సంగతి పక్కనపెడితే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటన నిజంగానే ఆసక్తికరంగా మారింది. రైతు ఉద్యమం మెడకు చుట్టుకుంటుందనే ఆందోళన బీజేపీలో రోజు రోజుకీ పెరిగిపోతోంది. 

విఫల ప్రతిపక్షం కాంగ్రెస్ దాన్ని సరిగా క్యాష్ చేసుకోలేదు కానీ.. ఒకవేళ బలమైన నాయకుడే ఉండి ఉంటే.. ఇదే ఉద్యమంతో, రైతుల మద్దతుతో కేంద్రం మెడలు వంచేవారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేలా చేసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ పరోక్షంగా, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్షంగా రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపింది. దీంతో కేంద్రం కూడా ఇరకాటంలో పడింది.

పార్లమెంట్ లో వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకించిన కేసీఆర్ ని మరోసారి బుజ్జగించే ప్రయత్నం చేశారని, ఇదే విషయంలో ఏపీ సీఎం జగన్ ని కూడా కాస్త సానుకూలంగా ఉండాలని బతిమిలాడబోతున్నారని కూడా లీకులు వస్తున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులతో చెలిమి కోసమే కేంద్రం ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

జమిలితో చెలిమా..?

మరోవైపు జమిలి ఎన్నికలపై కూడా ఇప్పటికే చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. ఢిల్లీ పెద్దలతో భేటీ అయిన మరుసటి రోజే.. కేసీఆర్ తెలంగాణ నిరుద్యోగులపై వరాల జల్లు కురిపించారు. కేవలం ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక ఎన్నికల కోసం ఇంత పెద్ద అస్త్రాన్ని వాడాల్సిన అవసరం కేసీఆర్ కి లేదు. 

మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే సమాచారంతోనే.. ఎన్నికల ఏడాది వరకు నియామక ప్రక్రియను కొనసాగించేందుకు కేసీఆర్ ఉద్యోగ భర్తీ అస్త్రాన్ని బైటకు తీశారని అంటున్నారు.

ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ తో కూడా ఇదే విషయమై కేంద్రం చర్చలు జరిపే అవకాశముందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో నోట్ల రద్దు ప్రభావం పెద్దగా లేకపోయినా.. వచ్చే దఫా ఎన్నికల నాటికి.. లాక్ డౌన్, ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, వ్యవసాయ చట్టాలు.. వంటివన్నీ జాతీయ సమస్యలుగా బీజేపీ మెడకు చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఉత్తరాది ఓటు బ్యాంకుని నమ్ముకోవడం కంటే.. దక్షిణాదిలో మిత్రులను తయారు చేసుకోవడమే బీజేపీకి అత్యవసరం. అందుకే ఈ వరుస భేటీలు జరుగుతున్నాయనే అనుమానం కూడా ఉంది. మొత్తమ్మీద కేసీఆర్ వెళ్లొచ్చిన రెండు రోజులకే జగన్ ఢిల్లీ వెళ్లడం మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్ గా మారింది.

ఈ సెగ దేశం మొత్తానికి పాకుతుందా?