జగన్‌ను చిరంజీవి మెచ్చుకుంటే చంద్రబాబుకు నష్టమా!

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చిత్ర, విచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. అంతకన్నా విచిత్రమైన కామెంట్లు చేస్తుంటారు. ఏదో రకంగా పది ఓట్లను పెంచుకోవాలన్న తాపత్రయంలో ఆయన తన హోదాను, సీనియారిటీని విస్మరిస్తున్నారన్న భావన…

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చిత్ర, విచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. అంతకన్నా విచిత్రమైన కామెంట్లు చేస్తుంటారు. ఏదో రకంగా పది ఓట్లను పెంచుకోవాలన్న తాపత్రయంలో ఆయన తన హోదాను, సీనియారిటీని విస్మరిస్తున్నారన్న భావన కలుగుతుంది.

సినీ పరిశ్రమకు సంబంధించి ఆయ చేసిన వ్యాఖ్యలు గమనించండి. సినీ ప్రముఖులకు ముఖ్యమంత్రి జగన్‌ వద్ద అవమానం జరిగిందట. మెగాస్టార్‌ చిరంజీవి ప్రాధేయపడ్డారట. ఇలాంటి మాటలు చెప్పి తెలుగుదేశంలో కూడా అందరిని ఒప్పించలేకపోవచ్చు. అయినా ఆయన తన పద్ధతి మార్చుకోరు.

ప్రతిపక్షం అంటే ఏదో ఒక పిచ్చిదో, ఎచ్చిదో విమర్శ చేసి, దానిని తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియాలో ప్రముఖంగా కవర్‌ చేసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారు. ఈ మధ్య ఏపీ పరిణామాలను నిశితంగా పరిశీలించే ఒకరు ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఆయన కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక ప్రముఖ విద్యా సంస్థలో పెద్ద ఉద్యోగంలో ఉన్నారు.

ఏపీలో జగన్‌ ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని, సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల ద్వారా ప్రజలకు ప్రభుత్వం తమ ఇళ్లకే వచ్చిందన్న సంతోషం కనబడిరదని అన్నారు. ఇలాంటివాటికి ప్రత్యామ్నాయంగా తాము ఏమి చేయాలో తెలుగుదేశం ఆలోచిస్తున్నట్లు లేదని, కేవలం రోజూ ప్రభుత్వంపై  విమర్శలు చేస్తూ, అవి రెండు పత్రికలలో ప్రముఖంగా వస్తుంటే వాటిని చదువుకుంటూ సంతోషపడుతున్నారే తప్ప, పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలన్న ఆలోచన పెద్దగా ఉండడం లేదని ఆయన అన్నారు.

ఇందులో వాస్తవం ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా పరిశ్రమవారు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి ఆయా అంశాలపై చర్చించి సమస్యను ఒక కొలిక్కి తెచ్చారు. తద్వారా చిరంజీవి కాని, ఇతర నటులు, ప్రముఖులు కాని తమ గౌరవం పెంచుకున్నారు తప్ప మరొకటి కాదు.

ఇందులో అవమానం అన్న ప్రసక్తి ఎక్కడ వస్తుంది. ఒకవేళ జగన్‌ ప్రభుత్వం వీరి సూచనలకు అంగీకరించి ఉండకపోతే, అప్పుడు ఇదే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంకా ఘాటుగా జగన్‌ను విమర్శించి ఉండేవారు. సినీ పరిశ్రమతో తనకు మాత్రమే సత్సంబంధాలు ఉండాలని, తద్వారా తన రాజకీయ ప్రయోజనాలను వారు కాపాడుతారని చంద్రబాబు నమ్మకం. ఇంతవరకు తప్పు లేదు. సినీ ప్రముఖులు కొందరికి ఏవో పదవులు ఇవ్వడం మినహాయించి, ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయన నిర్ధిష్ట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

విశాఖ వంటి నగరాన్ని కాని, సుదీర్ఘంగా ఉన్న తీర ప్రాంతాన్ని కాని, బీచ్‌లను కాని పరిగణనలోకి తీసుకుని కచ్చితంగా నిర్ధిష్ట శాతం షూటింగులు ఏపీలో జరగాలని ఆయన ఏనాడు కోరలేదు. తన బావమరిది సినిమాకు మాత్రం విశేషమైన రాయితీలు ఇచ్చారు. మరి ఆ సినిమా షూటింగ్‌ ఎక్కడ జరిగిందో తెలియదు. రాష్ట్ర విభజన జరగక ముందు సినీ పరిశ్రమవారు ఎక్కడ ఉన్నా పెద్దగా పట్టింపు లేదు. కాని విభజన జరిగాక, తనకు ఉన్న సంబంధాలను వాడుకుని చంద్రబాబు ఆ పని చేసి ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చేది. కాని అందులో ఆయన విఫలం అయ్యారు.

కాకపోతే ఎన్నికల సమయంలో తన ప్రచార చిత్రాలను సినీరంగంలోని కొందరు ప్రముఖుల ద్వారా తీయించి వాడుకునేవారు. దానిని ఆక్షేపించజాలం కాని, ఇప్పుడు సినీ ప్రముఖులు జగన్‌ను కలిస్తే మాత్రం ఆయన తెగ బాధపడుతున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ఏడుపు ఇంతా అంతాకాదు. దానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి.

చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకించి ఏపీలో విపరీతమైన క్రేజ్‌ ఉంది. భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. కొన్ని సామాజికవర్గాలలో ఆయన మాటకు మరింత విలువ ఉంటుంది. కొద్ది కాలం క్రితం చిరంజీవిని జగన్‌ సాదరంగా ఆహ్వానించడమే కాక, విందు ఇచ్చి, సత్కరించి చర్చలు జరిపారు. అప్పటి నుంచి చంద్రబాబుకు, టీడీపీ మీడియాకు జీర్ణం కావడం లేదు. ఎందుకంటే చిరంజీవి అభిమానులు జగన్‌ వైపు మొగ్గుతారేమో అని వారి భయం.

కాపు సామాజికవర్గం వారిని టీడీపీకి జతం చేయాలని వీరు చేస్తున్న యత్నాలకు గండి పడుతుందేమోనని వీరి ఆందోళన. దానికి తగ్గట్లుగానే చిరంజీవి కూడా జగన్‌ దగ్గర నుంచి బయటకు వచ్చి ఆయనను బాగా మెచ్చుకున్నారు. అది టీడీపీ వారికి మరింత ఇబ్బందిగా మారింది. జనసేన అధినేత, మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడు అయిన పవన్‌ కళ్యాణ్‌ ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు దానికి టీడీపీ నేతలు వంత పాడారు. అన్నిటి ధరలు తగ్గాలి కాని, సినీమా టిక్కెట్ల ధరలు పెంచాలని టీడీపీ వారు ప్రచారం చేశారు. చిరంజీవితో పాటు మహేష్‌ బాబు, ప్రభాస్‌, రాజమౌళి వంటి ప్రముఖులు కూడా జగన్‌ను కలవడం టీడీపీవారికి మరింత జలసీగా మారింది.

అలాగే ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి జగన్‌ చేస్తున్న ప్రయత్నాలు సహజంగానే గత టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతాయి. ఇలా పలు కారణాలతో చంద్రబాబుకాని, టీడీపీ మీడియాకాని ఏమి చేయాలా అని ఆలోచించి జగన్‌ సినీ పరిశ్రమవారిని అవమానించారని చిత్రమైన ప్రచారం ఆరంభించారు. చిరంజీవి అంతగా ప్రాధేయపడాలా అని చంద్రబాబు మరో విచిత్ర వ్యాఖ్య చేశారు. అంటే జగన్‌ వద్ద మర్యాదగా మాట్లాడుకుంటే ప్రాధేయపడినట్లా? అదే జగన్‌ వద్ద ఘర్షణ పడినట్లు మాట్లాడి ఉంటే చంద్రబాబుకు పరమానందంగా ఉండేదన్నమాట. ఇదే చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం ఒక సినిమా ఉత్సవంలో బహిరంగంగా చంద్రబాబును, బీజేపీ నేత వెంకయ్యనాయుడు బ్రహ్మాండంగా పొగిడారే. వెంకయ్యనాయుడును అయితే ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారని గుర్తు.

అప్పుడు మాత్రం చిరంజీవి తనను తాను తగ్గించుకున్నట్లు కాదన్నమాట. ఎందుకంటే ఎవరైనా తమను పొగడవలిసిందే తప్ప, వేరొకరిని మెచ్చుకుంటే వారిపై బురదచల్లే మనస్తత్వానికి టీడీపీ దిగజారిందే అన్నబాధ కలుగుతుంది. గతంలో ఎన్‌.టి.ఆర్‌. సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే ఆయనకు చంద్రబాబు అల్లుడయ్యారు. 1983 ఎన్నికలలో తాను కాంగ్రెస్‌ అధిష్ఠానం కోరితే మామపై కూడా పోటీచేస్తానని సవాల్‌ చేశారు. తదుపరి ఆయన ఎన్నికలలో ఓటమిపాలై, వెంటనే టీడీపీలోకి వచ్చేశారు. 1995లో ఎన్‌.టి.ఆర్‌. ప్రభుత్వాన్ని పడగొట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్‌.టి.ఆర్‌ సొంతంగా మరో పార్టీ పెట్టుకోవడానికి సన్నాహాలు చేసుకునేవారు. అప్పుడు సినిమావాళ్ల రాజకీయాలకు కాలం చెల్లిందని చంద్రబాబు వ్యాఖ్యానించేవారు.

ఎన్‌.టి.ఆర్‌ మరణం తర్వాత ఆయనకు తామే వారసులం అంటూ ప్రచారం చేసుకోగలిగారు. అది వేరే విషయం. ఇక చిరంజీవి రాజకీయాలలోకి వస్తారనుకున్నప్పుడు దానివల్ల కాంగ్రెస్‌కు అధిక నష్టం వస్తుందని టీడీపీవారు అంచనా వేసుకున్నారు. అందువల్ల అప్పట్లోనే టీడీపీకి మద్దతుగా ఉండే ఒక పత్రిక సర్వేల పేరుతో బోగస్‌ సమాచారాన్ని ఇచ్చి చిరంజీవి పార్టీ పెడితే అదరహో అంటూ కధనాలు ఇచ్చేది. కాని ఆ తర్వాత పరిణామాలలో టీడీపీకి నష్టం జరుగుతుందని భావించి చిరంజీవిపైన, ప్రజారాజ్యంపైన పలు వ్యతిరేక కధనాలు రాసేవారు చంద్రబాబు కూడా తన పార్టీ నేతలతో చిరంజీవిపై ఉన్నవి లేనివి విమర్శలు చేయించేవారు. అంతేకాదు. 

కొంతమందిని తన కోవర్టులుగా ప్రజారాజ్యంలోకి పంపించి సమాచారం రాబట్టి వ్యూహాలు పన్నేవారని చెబుతారు. రాజకీయాలలో రాటు తేలని చిరంజీవి వీటిని గమనించేలోపు బాగా డామేజ్‌ అయ్యేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో ప్రజారాజ్యంలో కీలక పాత్ర పోషించి, పార్టీతో తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చిన కేశినేని నాని టీడీపీ ఎంపీ అయ్యారు. పరకాల ప్రభాకర్‌ ముఖ్యమంత్రి సలహాదారు అయ్యారు. 

ఇందులో మతలబు ఉందో, లేదో చెప్పలేం కాని, చిరంజీవి, అల్లు అరవింద్‌ కలిసి పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నారని ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా టీడీపీ విపరీతంగా ప్రచారం చేసేది. మరి అదంతా చిరంజీవిని అవమానించినట్లవుతుందా? లేక సత్కరించినట్లు అవుతుందా? పవన్‌ కళ్యాణ్‌ మాదిరి చిరంజీవిది దూకుడు స్వభావం కాదు. ఏదిబడితే అది మాట్లాడే వ్యక్తికాదు. పవన్‌ మాదిరి మెచ్యూరిటీ లేకుండా మాట్లాడరు. ఈ విషయాలు ప్రజలకు కూడా తెలుసు. అయినా చంద్రబాబు తమ పార్టీకి ఈ పరిణామం నష్టం చేస్తుందని భావించి ఉండవచ్చు.

చిరంజీవికి జగన్‌ వద్ద సాదర సత్కారం లభిస్తే, చంద్రబాబు మాత్రం దానిని అవమానంగా ప్రచారం చేయ సంకల్పించారు. చిరంజీవికి అవమానం జరిగిందని పదే, పదే ప్రచారం చేయడం ద్వారా ఆయనను చులకన చేయడానికి చంద్రబాబు, ఆయనను బలపరిచే మీడియా ప్రయత్నించినట్లు అనిపించదా? చంద్రబాబు గతంలో ఎలాంటి విన్యాసాలు చేసినా, నడిచిపోయింది. ఎందుకంటే అప్పట్లో సోషల్‌ మీడియా లేదు. కాని ఇప్పుడు సోషల్‌ మీడియా విస్తారంగా అందుబాటులోకి వచ్చింది. 

క్షణాలలో ఏ రాజకీయ నేత వ్యాఖ్యలపైన అయినా విశ్లేషణలు వచ్చేస్తున్నాయి. ఆ విషయాన్ని తెలుగుదేశం నేతలు అర్ధం చేసుకోలేకపోతున్నారో, లేక ఇలాగే ప్రతిదానిని వ్యతిరేకించి విమర్శలు చేయడమో కరెక్టు అన్న అభిప్రాయంలో ఉన్నారో తెలియదు. ఈ మొత్తం వ్యవహారంలో చిరంజీవికి వచ్చే నష్టం ఏమీ ఉండదు కాని, చంద్రబాబుకు మాత్రం బాగానే నష్టం కలుగుతోందని, ఆయన వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసుకోవడం కష్టం కాదు.

6 Replies to “జగన్‌ను చిరంజీవి మెచ్చుకుంటే చంద్రబాబుకు నష్టమా!”

  1. annayya ni ex-cm ki dandam pettinchukuni attitude choopinchi avamaninchaadu….. ipudu thammudu pm ne annayya daggariki vachi abhivaadham chese situation ki pawan kalyan theesuku vachadu….

  2. మీరెన్ని విధాలుగా రాసినా చేసిన అవమానం పోదు.లోపల జరిగిన విషయాన్ని బయటపెట్టింది ఎవరు?ఆ వీడియో రిలీజ్ చేయకపోతే విషయం బయటికి రాదు కదా?

Comments are closed.