10 పార్టులుగా మహాభారతం – రాజమౌళి

బాహుబలిని 2 భాగాలుగా తీసిన రాజమౌళి, తన కలల ప్రాజెక్టు మహాభారతాన్ని ఎన్ని భాగాలుగా తీస్తాడు? కనీసం 4 పార్టులుగానైనా తీయాలి, లేదంటే కథ మొత్తం చెప్పలేం. ఇదే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది. షాకింగ్…

బాహుబలిని 2 భాగాలుగా తీసిన రాజమౌళి, తన కలల ప్రాజెక్టు మహాభారతాన్ని ఎన్ని భాగాలుగా తీస్తాడు? కనీసం 4 పార్టులుగానైనా తీయాలి, లేదంటే కథ మొత్తం చెప్పలేం. ఇదే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది. షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు జక్కన్న. ఇప్పుడున్న మైండ్ సెట్ తో మహాభారతం తీయాల్సి వస్తే కనీసం 10 పార్టులుగా తీస్తానని ప్రకటించాడు.

“మహాభారతం తీయాలనుకుంటే ముందుగా దేశంలో అందుబాటులో ఉన్న అన్ని మహాభారతం వెర్షన్లు చదువుతాను. దానికి కనీసం ఏడాదికి పైగా సమయం పడుతుందని అనుకుంటున్నాను. కాగితంపై పెన్ను పెట్టకుండా, కేవలం చదవడానికి మాత్రమే ఏడాదిన్నరకు పైగా టైమ్ తీసుకుంటాను. ఇక సినిమాగా తీయాల్సి వస్తే, మహాభారతాన్ని 10 పార్టులుగా తీయొచ్చని ప్రస్తుతానికి నా మనసులో అనిపిస్తోంది. ఎన్ని భాగాలుగా తీస్తాననేది నాకు తెలియదు.”

ఇలా తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతంపై స్పందించాడు రాజమౌళి. కెరీర్ స్టార్టింగ్ నుంచి, ఇప్పటివరకు తను తీస్తున్న ప్రతి సినిమా, మహాభారతాన్ని తెరకెక్కించడం కోసం నేర్చుకుంటున్న పాఠాలని చెప్పుకొచ్చాడు రాజమౌళి.

“నేను తీసిన ప్రతి సినిమా నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. అవన్నీ మహాభారతం తీయడానికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. నేను తీసే ప్రతి సినిమా మహాభారతం కోసమే అనిపిస్తుంది. అదే నా అంతిమ లక్ష్యం.”

అయితే మహాభారతాన్ని సినిమాగా తీయాలనేది కేవలం తన కల మాత్రమేనని, దాన్ని నెరవేర్చుకునేందుకు ఎంత టైమ్ పడుతుందనేది ప్రస్తుతం చెప్పలేనన్నాడు రాజమౌళి. అయితే మహాభారతాన్ని తెరకెక్కించడానికి మరింత టెక్నాలజీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని, ఇప్పుడున్న టెక్నాలజీతో భారతాన్ని అద్భుతంగా తీయొచ్చని అభిప్రాయపడ్డాడు.