ఇద్దరూ మహానాయకులు. వారి పార్టీల్లో కార్యకర్తలు ఆ ఇద్దరినీ కూడా.. తమరు తప్ప మాకు మరో దిక్కు లేనేలేదు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఒకరు హస్తిన పెదబాబు రాహుల్ అయితే.. మరొకరు అమరావతి చినబాబు నారా లోకేష్. రాజకీయ ప్రత్యర్థులు మాత్రం వీరిద్దరినీ కూడా ఒకే మాదిరి ముద్దుపేరుతో ‘పప్పు’ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరిలో చినబాబు- పెదబాబు ప్లాన్ ను కాపీ కొడుతున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తోంది.
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు సుదీర్ఘమైన పాదయాత్ర చేసేశారు. ఆ పాదయాత్ర ఒకటే మార్గంలో సాగిపోతుంది కనుక, ఆ మార్గానికి అటు ఇటుగా ఆయన రాష్ట్రాలలో అనేక ప్రాంతాలు నియోజకవర్గాలు మిగిలిపోతాయి గనుక.. దానిని కాంపెన్సేట్ చేయడం లక్ష్యం అన్నట్లుగా హాత్ సే హాత్ జోడో పాదయాత్రలను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ యాత్రల ఊసు వినిపించడం లేదు కానీ.. తెలంగాణలోనూ మరికొన్ని ఇతర ప్రాంతాలలోనూ ముమ్మరంగా హాత్ సే హాత్ జోడో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వీటి ద్వారా అన్ని ప్రాంతాలలోనూ కాంగ్రెస్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది.
దీనిని చూసి పచ్చదళం స్ఫూర్తి పొందినట్లుగా కనిపిస్తోంది. చినబాబు నారా లోకేష్ వంద రోజులుగా పాదయాత్ర సాగిస్తున్నారు. మే 15 నాటికి లోకేష్ పాదయాత్రకు శత దినోత్సవం జరగనుంది. ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా ఘనంగా రాష్ట్రవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకోవాలని పచ్చదళాలు ఫిక్స్ అయిపోయాయి.
ఇందుకోసం వాళ్లు రాహుల్ గాంధీ ప్లాన్ ను మక్కికి మక్కీగా కాపీ కొడుతున్నారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమం లాగా రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలలో చినబాబుకు మద్దతుగా పాదయాత్ర నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలందరినీ పోగేసి కనీసం ఏడు కిలోమీటర్ల దూరం ఉండేలాగా పాదయాత్రలు చేస్తారట! తద్వారా మొత్తం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఏకకాలంలో యాక్టివేట్ చేయడం సాధ్యమవుతుంది. ప్లాన్ బాగానే ఉంది కానీ ఆచరణలో ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది పార్టీలోనే పలువురు నాయకులను తొలిచి వేస్తున్న అంశం.
రకరకాల కారణాల వలన రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలలో పార్టీ నాయకులను ఇంకా స్తబ్ధత వీడలేదు. అభ్యర్థిత్వాలను ముందుగా ప్రకటించడం అనేది చంద్రబాబుకు ఎప్పుడూ అలవాటు లేదు. అయితే కనీసం పొత్తుల్లో తమ సీటు తమ పార్టీకే ఉంటాయా లేకపోతే పవన్ కళ్యాణ్ కు కానుకగా సమర్పిస్తారా అనే క్లారిటీ కూడా లేకుండా అనేక నియోజకవర్గాల నాయకులు సతమతం అవుతున్నారు. ఇలాంటివారు డబ్బు ఖర్చుపెట్టి కార్యక్రమాలు చేస్తారనుకోవడం భ్రమ.
175 నియోజకవర్గాలలో పాదయాత్రలు నిర్వహిస్తే ఎన్ని చోట్ల పార్టీ బలంగా ఉన్నదో ఎంత మేరకు వారు డొల్ల మాటలు చెబుతున్నారో బయటపడుతుంది. ఆ రకంగా పార్టీ మరింత ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అని కొందరు విశ్లేషిస్తున్నారు.