సోము కొత్తగా పాడుతున్న పాత పాట…?

బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మీడియా ముందుకొచ్చి అంతా బీజేపీ వల్లనే అని చెబుతారు. ఏపీ ఈ రోజు ఇలా ఉంది అంటే అది బీజేపీ ఆద్వర్యాన కేంద్ర ప్రభుత్వం సాధించిన గొప్పతనం…

బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మీడియా ముందుకొచ్చి అంతా బీజేపీ వల్లనే అని చెబుతారు. ఏపీ ఈ రోజు ఇలా ఉంది అంటే అది బీజేపీ ఆద్వర్యాన కేంద్ర ప్రభుత్వం సాధించిన గొప్పతనం అని అంటారు. మరో వైపు చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి సమస్యలు ప్రస్తావిస్తే మాత్రం పాత మాటలనే కొత్తగా చెబుతూంటారని సెటైర్లు పడుతున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే అది ఎక్కడికీ పోదు, అక్కడే ఉంటుంది అని సోము అంటారు. మరి ఇందులోని అర్ధాన్ని వెతుక్కోలేక ఏడాదిగా విశాఖలోని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు అలా అలసి సొలసి  పోరాడుతూనే ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది అని సోము ఎక్కడా చెప్పడంలేదు, కానీ స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది అని అంటున్నారు. అంటే ప్రైవేట్ పరం చేసినా అక్కడే ఉంటుంది కదా అని అర్ధం తీసుకుంటున్నారు ఉద్యమకారులు.

ఇక విశాఖ రైల్వే జోన్ గురించి చూస్తే సోము కచ్చితంగా ఏర్పాటు చేస్తామని పదే పదే చెబుతూనే ఉన్నారు. మరో వైపు బడ్జెట్ లో నిధుల కేటాయింపు లేదని ఇతర రాజకీయ పార్టీలు అంటున్నాయి. ఇక జోన్ కి సంబంధించి విశాఖలో ఒక అడుగు కూడా ముందుకు పడడంలేదని కూడా ఆరోపిస్తున్నారు.

అయినా కానీ విశాఖ జోన్ తప్పకుండా వస్తుందని సోము చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఉత్తరాంధ్రా వెనకబాటుతనానికి ఏపీ పాలకులే కారణమని సోము ఆరోపిస్తున్నారు. అదే సమయంలో విభజన చట్టంలో పేర్కొన్న మేరకు అభివృద్ధి నిధుల గురించి ఎందుకు మాట్లాడరని వైసీపీ నేతలు అంటున్నారు. అలాగే ఉత్తరాంధ్రా మీద అంత అభిమానం ఉంటే బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజిని కేంద్రం తో మాట్లాడి మంజూరు చేయించవచ్చు కదా అని కూడా అడుగుతున్నారు.

మొత్తానికి ఉత్తరాంధ్రా అభివృద్ధి కోసం ఉద్యమం చేస్తామని చెబుతున్న సోము ఇక్కడ అనేక సమస్యలకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్షమే కారణమని, ముందు కేంద్రం మీద పోరాడితే బాగుంటుంది అని సూచిస్తున్నారు. అయినా సోము పాత పాటనే కొత్తగా ఎపుడూ పాడుతూనే ఉంటారా. అదే కరెక్టేమో.