కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందనేది సామెత. తెలంగాణలో సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఇలానే ఆలోచిస్తున్నారు. ప్రేక్షకుడిపై భారం పడుతోందంటూ బుక్ మై షో లో ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ఆపేశారు. అందరూ బాక్సాఫీస్ కు వచ్చి టికెట్ తీసుకోవాలంటున్నారు. ఇదేం పద్ధతి? ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే అదనంగా కొంత ఛార్జ్ పడుతుందనేది నిజం. మరి బాక్సాఫీస్ కు వచ్చి టికెట్ తీసుకుంటే ఎంత 'అదనం' అవుతుంది? ఎంత సమయం వృధా అవుతుంది? ఈ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదు నైజాం బాబులు.
ఈ మధ్య తెలంగాణలో టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. దీనికి బుక్ మై షో యూజర్ చార్జీలు కూడా కలిపితే రేటు మరింత పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా అని బుక్ మై షోను ఆపేస్తే ఎలా? బాక్సాఫీస్ వద్ద టికెట్ రేట్లు తగ్గించుకోవచ్చు కదా? లేకపోతే బుక్ మై షోతో చర్చించి, యూజర్ ఛార్జీలు, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ చార్జీలు తగ్గించేలా చర్చలు జరపొచ్చు కదా.
సరిగ్గా భీమ్లానాయక్ విడుదలకు ముందు టాలీవుడ్ పెద్దలు, ఎగ్జిబిటర్లు కలిసి తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం ప్రేక్షకుడికి మేలు చేయకపోగా మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈరోజు హైదరాబాద్ లోని ఓ పెద్ద మాల్ లో భీమ్లానాయక్ సినిమా కోసం కౌంటర్ టికెట్ సేల్ మొదలుపెడితే.. మెయిన్ రోడ్డు వరకు ట్రాఫిక్ ఏర్పడింది. ఓ 10-15 మంది కుర్రాళ్లు ఘర్షణ పడ్డారు కూడా. ఆన్ లైన్ వ్యవస్థ ఉంటే ఈ రచ్చ ఉండేది కాదు కదా.
ప్రేక్షకుడిపై టికెట్ భారం తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని నైజాం ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. కానీ చూస్తుంటే, ఇది ప్రేక్షకుల కోణంలో తీసుకున్న నిర్ణయంలా కనిపించడం లేదు. బుక్ మై షోను తమ దారిలోకి తెచ్చుకునేందుకు, సరిగ్గా భీమ్లానాయక్ విడుదల సమయంలో టైమ్ చూసి ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంలా కనిపిస్తోంది.
రేపట్నుంచి మరిన్ని థియేటర్లలో కౌంటర్ సేల్ మొదలవుతుంది. అలాంటి థియేటర్ల దగ్గర కచ్చితంగా పోలీసుల్ని పెట్టాల్సిందే. గొడవలు జరగకుండా చూడడంతో పాటు, ట్రాఫిక్ ను మళ్లించాల్సిందే. ఈ అవ్యవస్థకు కారణం ఎవరు? ఒకప్పుడు బాక్సాఫీస్ ముందు వందల మంది ఇలా క్యూ కట్టేవారు. అర్థరాత్రి నుంచి ప్రేక్షకులు బారులు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత బాక్సాఫీస్ పై ఈ తాకిడి కాస్త తగ్గింది. ప్రేక్షకుడికి కూడా రిలీఫ్ దొరికింది. మళ్లీ అప్పటి పాత పరిస్థితుల్ని పునరావృతం చేస్తే ఎలా? ముందుకెళ్తున్నామా..? వెనక్కి వెళ్తున్నామా?
బుక్ మై షోతో ఇబ్బంది ఉంటే పిలిచి మాట్లాడాలి. చర్చలతో సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అంతేతప్ప, ఇలా ఓ పెద్ద సినిమా విడుదలకు ముందు రాత్రికిరాత్రి నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తే, ఇబ్బంది పడేది అమాయక ప్రేక్షకులే అనే విషయాన్ని గుర్తించాలి. ఈ సమస్య ఈరోజు, రేపటిలోగా పరిష్కారమైతే ఓకే, లేదంటే.. ప్రేక్షకులు అంతిమంగా తిట్టుకునేది థియేటర్ యాజమాన్యాల్ని, పరోక్షంగా భీమ్లానాయక్ ని మాత్రమే.