ఆదిపురుష్ ట్రయిలర్ వస్తుందనగానే ఫ్యాన్స్ ఎంత సంబరపడ్డారో, మరికొంతమంది అంతే భయపడ్డారు కూడా. ఎందుకంటే, ఈ సినిమా టీజర్ టైమ్ లో వచ్చిన విమర్శలు, ఎదుర్కొన్న వివాదాల గురించి అందరికీ తెలిసిందే. ఈసారి ట్రయిలర్ తో ఇంకెన్ని విమర్శలు ఎదుర్కోవాలో, ఇంకెన్ని వివాదాలు తలెత్తుతాయో అని యూనిట్ భయపడింది.
కానీ యూనిట్ భయపడినట్టు జరగలేదు. ఆదిపురుష్ ట్రయిలర్ అందరికీ నచ్చింది. టీజర్ లో గ్రాఫిక్స్ కు, ట్రయిలర్ లో గ్రాఫిక్స్ కు చాలా తేడా ఉంది. మరీ ముఖ్యంగా దుస్తులు, హావభావాలు విషయంలో ఎలాంటి కంప్లయింట్స్ లేవు. దీనికితోడు అందరికీ అర్థమయ్యే తెలుగులో డైలాగ్స్ పెట్టడం కూడా పాజిటివ్ రెస్పాన్స్ కు కారణమైంది.
ఇవన్నీ ఒకెత్తయితే.. ప్రభాస్ లుక్స్ మరో ఎత్తు. టీజర్ లో ప్రభాస్ లుక్స్ పై కొన్ని విమర్శలొచ్చాయి. శాంతస్వరూపుడిగా కనిపించాల్సిన రాముడు, టీజర్ లో ఉగ్రరూపంలో కనిపించేసరికి చాలామంది విమర్శలు చేశారు.
ట్రయిలర్ లో వాటికి సరైన సమాధానం దక్కింది. శబరి దగ్గర శాంతంగా, వానర సేన దగ్గర ఉగ్రంగా ప్రభాస్ వేరియేషన్స్ చూపించి ఆకట్టుకున్నాడు. ఇక టీజర్ టైమ్ లో అత్యంత వివాదాస్పదమైన రావణాసురుడి లుక్ ను కూడా ప్రస్తుతానికి ట్రయిలర్ లో చూపించలేదు. కేవలం ఓ బిక్షువుగా మాత్రం సైఫ్ ను చూపించి మమ అనిపించారు.
తాజా ట్రయిలర్ తో ఇలా చాలా అనుమానాలు నివృత్తి చేశారు. తెలిసిన కంటెంట్ కాబట్టి.. శబరి ఎపిసోడ్, రామసేతు నిర్మాణం, సీత గీత దాటడం లాంటి ఎన్నో కీలకమైన సన్నివేశాల్ని కూడా ట్రయిలర్ లో చూపించేశారు. మొత్తమ్మీద ఈ ట్రయిలర్ రాకతో, ఇన్నాళ్లకు ఆదిపురుష్ పై ఓ పాజిటివ్ బజ్ వచ్చింది. ఇక సినిమా రిజల్ట్ ఒక్కటే పెండింగ్.