అకాల నాయ‌కుడు

మ‌నకు ఇంత కాలం అకాల వ‌ర్షాల గురించి మాత్ర‌మే తెలుసు. సీజ‌న్ కాని కాలంలో వ‌ర్షాలు కుర‌వ‌డాన్ని అకాల వ‌ర్షాల‌ని పిలుస్తారు. అకాల నాయ‌కుడు అంటే తెలుసా? ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయం పుణ్య‌మా అని అలాంటి…

మ‌నకు ఇంత కాలం అకాల వ‌ర్షాల గురించి మాత్ర‌మే తెలుసు. సీజ‌న్ కాని కాలంలో వ‌ర్షాలు కుర‌వ‌డాన్ని అకాల వ‌ర్షాల‌ని పిలుస్తారు. అకాల నాయ‌కుడు అంటే తెలుసా? ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయం పుణ్య‌మా అని అలాంటి నాయ‌కుడి గురించి వినాల్సి వ‌స్తోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ అకాల నాయ‌కుడ‌నే పేరుకు స‌రిపోతారు. ఎందుకంటే నెల‌కో, రెండు నెల‌ల‌కో వీకెండ్స్‌లో షూటింగ్స్ లేని స‌మ‌యంలో రాజ‌కీయం చేయ‌డం ప‌వ‌న్ ఒక విధానంగా పెట్టుకున్నారు. అందుకే వీకెండ్స్ కాని రోజుల్లో ప‌వ‌న్ జనంలోకి వ‌స్తున్నారంటే అదో ప్ర‌పంచ ఎనిమిదో వింతే. ఇప్పుడు అలాంటిదే జ‌రుగుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో గ‌త వారం రోజులుగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంట‌లు దెబ్బ‌తిన్నాయి. దెబ్బ‌తిన్న రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టింది. త‌డిసిన ధాన్యాన్ని ప్ర‌భుత్వ‌మే కొంటోంది. మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు 70 ఏళ్ల‌కు పైబ‌డిన వ‌య‌సులో అకాల వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించారు. రైతుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు.

దెబ్బ‌తిన్న రైతుల‌కు అండ‌గా వుంటామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. త‌డిసిన ధాన్యాన్ని ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాల‌ని, లేదంటే ఆందోళ‌న‌ల‌కు వెనుకాడ‌మ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఏది ఏమైనా రైతుల్ని ఆదుకోవ‌డంలో జ‌గ‌న్ స‌ర్కార్ చొర‌వ చూపింది. అందుకే ప్ర‌తిప‌క్షం ఆందోళ‌న‌ల‌కు పిలుపు ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో అంతా అయిపోయిన త‌ర్వాత తీరిగ్గా దెబ్బ‌తిన్న పంట‌ల ప‌రిశీల‌న‌, రైతుల ప‌రామ‌ర్శ‌కు వ‌స్తున్నానంటూ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు.

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో బుధ‌వారం ప‌వన్‌క‌ల్యాణ్ ప‌ర్య‌టించ‌నున్నారు ప‌వ‌న్ వెంట నాదెండ్ల మ‌నోహ‌ర్‌, ఆ జిల్లా జ‌న‌సేన నేత‌లు ఉండ‌నున్నారు. అకాల వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న రైతులను ప‌రామ‌ర్శించ‌డానికి ప‌వ‌న్‌కు స‌మ‌యం లేక‌పోవ‌డం విచిత్రంగా వుంది. త‌న‌కు బుద్ధి పుట్టిన‌ప్పుడు వ‌చ్చే వారిని నాయ‌కులుగా జ‌నం గుర్తించ‌రు. తాము క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు వ‌చ్చి అండ‌గా నిలిచిన నేత‌ల‌నే జ‌నం జ్ఞాప‌కం పెట్టుకుంటారు.

క‌నీసం ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు షూటింగ్‌లే ముఖ్య‌మైన‌ప్పుడు, అదే రంగంలో కొన‌సాగొచ్చు. అలా కాకుండా మొక్కుబ‌డి ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్ల‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంటి? ఇప్ప‌టికే చంద్ర‌బాబునాయుడు వెళ్లి రాజ‌కీయంగా కొద్దోగొప్పో మైలేజీ పొందారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఆయ‌న్ని గుర్తిస్తారే త‌ప్ప‌, త‌న‌కు తీరిక డొరికిన‌ప్పుడు వెళ్లే ప‌వ‌న్ గురించి రైతులు ఎందుకు ఆలోచిస్తార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.