పార్ట్ న‌ర్ ఫోన్ ను చెక్ చేసే అల‌వాటుందా?

ఇది క‌మ్యూనికేష‌న్స్ యుగం. గ‌త ద‌శాబ్ద‌కాలంలో వ‌చ్చిన పెను మార్పు ఇది. చిన్న వ‌య‌సులోనే ఫోన్లు, కంప్యూట‌ర్లు సొంతం అయిపోతున్నాయి. ఎవ‌రి ప‌ర్స‌నల్ స్మార్ట్ ఫోన్లు వారివి అవుతున్నాయి. ఐదారేళ్ల వ‌య‌సు పిల్ల‌ల‌కే త‌మ‌కే…

ఇది క‌మ్యూనికేష‌న్స్ యుగం. గ‌త ద‌శాబ్ద‌కాలంలో వ‌చ్చిన పెను మార్పు ఇది. చిన్న వ‌య‌సులోనే ఫోన్లు, కంప్యూట‌ర్లు సొంతం అయిపోతున్నాయి. ఎవ‌రి ప‌ర్స‌నల్ స్మార్ట్ ఫోన్లు వారివి అవుతున్నాయి. ఐదారేళ్ల వ‌య‌సు పిల్ల‌ల‌కే త‌మ‌కే సొంతం అనే ట్యాబ్ ల వాడ‌కం ఉంది. క‌రోనా కార‌ణంగా చ‌దువులు కూడా ఆన్ లైన్ కావ‌డంతో … స్మార్ట్ ఫోన్ల వినియోగం మ‌రింత త‌ప్ప‌నిస‌రి అయ్యింది. కేవ‌లం పిల్ల‌ల‌నే కాదు.. స్మార్ట్ ఫోన్, ఇంట‌ర్నెట్ ఇప్పుడు వ‌య‌సుతో నిమిత్తం లేకుండా అంద‌రి అవ‌స‌రం.

మ‌రి ఈ క‌మ్యూనికేష‌న్స్ విప‌రీత స్థాయికి చేరాయ‌ని కూడా వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. బోలెడ‌న్ని ప‌రిచ‌యాల‌కూ ఇవి ఆస్కారం ఇస్తున్నాయి. ఇంట‌ర్నెట్ తో ఫేస్ బుక్, ఇన్ స్టా ల‌తో కొత్త కొత్త స్నేహాలు, అలాగే పాత స్నేహితుల‌తో వాట్సాప్ చాట్ లు, గ్రూపులు ఇవ‌న్నీ త‌ప్ప‌నిస‌రి.

ఈ ప‌రిస్థితి దాంప‌త్యంలో కూడా అనునిత్యం ఎదుర‌య్యేదే. భార్య‌కూ, భ‌ర్త‌కూ వేర్వేరు స్మార్ట్ ఫోన్లు ఉండ‌నే ఉంటాయి. మ‌రి ఒక‌రి స్మార్ట్ ఫోన్ పై మ‌రొక‌రి ఆస‌క్తి కూడా స‌హ‌జ‌మైన‌దే అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఫోన్లు త‌న భ‌ర్త ఎవ‌రితో చాట్ చేస్తున్నాడు, వాట్సాప్ లో ఎవ‌రితో ట‌చ్లో ఉంటాడు, ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఎవ్వ‌రు? ఇన్ స్టాలో ఎవ‌రిని ఫాలో అవుతున్నాడు.. ఇవ‌న్నీ తెలుసుకోవాల‌నే ఆస‌క్తి భార్య‌కు ఉండ‌వ‌చ్చు.  

ఇదే స‌మ‌యంలో భ‌ర్త‌కు కూడా త‌న భార్య వాట్సాప్ చాట్ ల‌ను చూడాల‌నే భావ‌న‌లూ ఉండ‌వ‌చ్చు. ఈ విష‌యంలో ప‌రస్ప‌ర అభ్యంత‌రాలు లేని వాళ్ల‌తో స‌మ‌స్యే లేదు! తమ ఫోన్ ను ఎక్క‌డైనా పెట్టేయ‌గ‌ల వాళ్లు, ఫోన్ లాక్ నంబ‌ర్ ను ప‌రస్ప‌రం పంచుకునే వాళ్లూ, ఏ క్ష‌ణ‌మైన త‌మ ఫోన్ ను పార్ట్ న‌ర్ కు హ్యాండోవ‌ర్ చేయ‌గ‌లిగే వాళ్ల‌కు ఏ మాత్రం ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితి ఉండ‌దు.

అయితే ఎప్పుడైతే ఫోన్ పై పార్ట్ న‌ర్ క‌న్ను ప‌డ‌కూడ‌దు అనే భావ‌న మొద‌ల‌వుతుందో అక్క‌డే తేడా వ‌స్తుంది. ఫోన్ ను పార్ట్ న‌ర్ కంట ప‌డ‌నీయ‌కుండా, లేదా త‌న‌కు లాక్ ఓపెన్ చేసే అవ‌కాశం ఇవ్వ‌కుండా ఉండ‌టం లేని పోని అనుమానాల‌కు తొలి మెట్టు అనాలేమో!

ఇక వాట్సాప్ చాట్ హిస్ట‌రీని క్లియ‌ర్ చేయ‌డం, పాత చాట్ ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు డిలీట్ చేస్తూ ఉండ‌టం కూడా అన‌వ‌స‌ర‌మైన అనుమానాల‌కు తావిచ్చే అంశ‌మే.

అయితే ఈ విష‌యం గురించి రిలేష‌న్షిప్ ఎక్స్ ప‌ర్ట్స్ ఏమ‌ని స్పందిస్తారంటే.. పార్ట్ న‌ర్ ఫోన్ ను దొంగ చాటుగా చూడాల‌నే ఆస‌క్తే వ‌ల‌ద‌ని వారు అంటున్నారు. అలాంటి ఆస‌క్తి ఒక్క‌సారి మొద‌ల‌యితే ఎప్ప‌టికీ కొన‌సాగుతుంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. పార్ట్ న‌ర్ కు తెలియ‌కుండా ఫోన్ హిస్ట‌రీని చూడ‌టం మొద‌లుపెట్టాకా.. అది ఒక్క రోజుతో తీరిపోయే ఆస‌క్తి కాదు. 

ఒక్క‌సారి ఆ గాలి మ‌ళ్లితే మ‌ళ్లీ మ‌ళ్లీ అదే ప‌ని చేయాల‌నే ఆరాటం అధికం అవుతుంది. మీరు వారిపై స్పై వేసిన‌ట్టుగా అవుతుంది. ఆ విష‌యాన్ని అవ‌త‌లి వారు గ్ర‌హించారంటే మీ పై న‌మ్మ‌కం పోతుంది. భ‌ర్త వాట్సాప్ చాట్ విష‌యంలో భార్య ఈ ప‌ని చేసినా, భార్య వాట్సాప్ చాట్ విష‌యంలో భ‌ర్త ఈ ప‌ని చేస్తున్నా.. అది ప‌ర‌స్ప‌రం న‌మ్మ‌కం కోల్పోవ‌డ‌మే.

ఇలా కాకుండా.. ఓపెన్ బుక్ గా,  ఇద్ద‌రి వాట్సాప్ అకౌంట్ల‌నూ ఇద్ద‌రూ ఎప్పుడైనా చూసుకునే ప‌రిస్థితి ఉన్న వారికి ఇవ‌న్నీ వ‌ర్తించ‌వు. కేవ‌లం దొంగ చాటుగా చూడాల‌నే ఆరాట‌మే స‌రికాదు.