అంతటి ‘మొనగాడు’ ఈ దేశంలో పుడతాడా?

“ఈ దేశం మారదండీ..మన రాజకీయ వ్యవస్థ ఇలా ఉన్నంతకాలం మన దేశం మారదు. కొన్నాళ్లైనా మనకొక నియంత కావాలి”- ఈ మాట కొన్నేళ్ల క్రితం ఎక్కువగా వినబడేది.  Advertisement నిరుద్యోగం, పేదరికం, ప్రభుత్వ ఉద్యోగుల…

“ఈ దేశం మారదండీ..మన రాజకీయ వ్యవస్థ ఇలా ఉన్నంతకాలం మన దేశం మారదు. కొన్నాళ్లైనా మనకొక నియంత కావాలి”- ఈ మాట కొన్నేళ్ల క్రితం ఎక్కువగా వినబడేది. 

నిరుద్యోగం, పేదరికం, ప్రభుత్వ ఉద్యోగుల లంచగొండితనం, శ్రమదోపిడీ, విద్యుత్ సరఫరాలో నిరంతర అంతరాయాలు, అధ్వాన్నమైన రోడ్లు మరియు రవణావసతులు మొదలైన అనేక కారణాలు అప్పట్లో నియంతృత్వ పాలనుంటే తప్ప దేశానికి రోగం నయం కాదనే అభిప్రాయాలు యువతలోనూ, చదువుకున్నవారిలోనూ ఉండేది. 

ఆ క్రమంలోనే నిరుద్యోగం, పేదరికం, లంచగొండితనం కోరల్లో చిక్కుకున్న యువత ఆవేశంలో తుపాకీలు పట్టుకుని అడవుల బాట పట్టేది. ప్రజాస్వామ్యం తమకు పనికిరావట్లేదన్న భావనతో కుళ్లిన వ్యవస్థ మీద తిరుగుబాటు చేసే పనిలో ఉండేది. వ్యవస్థల మీద దాడులు చేసి సంఘవిద్రోహశక్తులుగా మారేవాళ్లు కొందరు యువకులు. ఆ మార్గంలో వారు సాధించింది శూన్యం కోల్పోయింది మాత్రం సర్వం. 

“పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప” అనుకుని పోరాడినా ఏ సంకెల పోకపోగా వారికి కూడా సంకెళ్లు బిగిసాయి. 

క్రమంగా ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ కారణంగా నిరుద్యోగ సమస్య కరిగిపోతూ వచ్చింది. యువతకి ఎక్కడో అక్కడ ఏదో ఒక కొలువు అర్హతను బట్టి దొరకడమ్మొదలుపెట్టింది. విదేశాలకు తలుపులు తెరుచుకున్నాయి. సాఫ్ట్వేర్ రంగం ఈ దేశయువతకి వరంగా మారింది. ఫలితంగా తుపాకులు పట్టుకునే యువత తగ్గిపోయింది.  

ఆ గతాన్ని పక్కనబెట్టి వర్తమానంలోకొద్దాం. 

ప్రస్తుతం భారతదేశంలో 35 ఏళ్ల వయసుకంటే తక్కువున్నవాళ్లు ఏకంగా 65% జనాభాగా ఉన్నారు. ఇదే చైనాలో అయితే 41% మాత్రమే. అయినా కూడా చైనా స్వయం ఉత్పత్తిలో కానీ, సృజనలో కానీ, దేశ ఆర్థిక పరిస్థితికి తోడ్పడే యువతలో కానీ ఎన్నో రెట్లు ముందుంది. అమెరికాతో పోటీ పడుతూ, అమెరికాని కూడా తమ మీద ఆధరపడేలా చేస్తూ ఆ దేశం ముందుకు సాగుతోంది. 

ఏదో కరెంటుపోవడమో మరొకటో జరిగి చైనాలో కర్మాగారాలు పనిచేయడం ఆగిపోతే ప్రపంచమంతా ఆగిపోయే పరిస్థితుంది నేడు. గుండుసూది నుంచి, కార్ల తయారీకి కావాల్సిన ముడి సరుకు నుంచి, నట్టు, బోల్టు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ రా మెటీరియల్ వరకు ప్రపంచమంతా చైనావద్దే కొంటోంది. ఎందువల్ల? మేలురకం సరుకు వాళ్లకంటే చవకగా ప్రపంచంలో ఇంకెవ్వరూ తయారు చేయట్లేదు కనుక. 

మరి అక్కడికన్నా ఇండియాలో యూత్ ఎక్కువకదా. ఉదాహరణకి చైనావాళ్ళు ఒక వస్తువుని పది రూపాయలకి ప్రపంచానికి అమ్ముతున్నారనుకుందాం. అదే వస్తువుని అదే క్వాలిటీతో ఇండియాలో తయారు చేసి 6 రూపాయలకి అమ్మగలిగే ఆలోచన మనం చేయలేమా? అలా చేయగలగాలంటే మన ప్రభుత్వాలు కల్పించాల్సిన వనరులేంటి? వెసులుబాట్లేంటి? ఈ ప్రశ్నలు వేసుకుని ముందుకెళ్లాలి కదా. ఇది కదా మేకిన్ ఇండియా అంటే!

అసలీ ఆలోచన మన యువతకి కానీ, ప్రభుత్వానికి కానీ ఉందా?

అసలు మన యువత ఆలోచన ఎలా ఉంది? 

ఏదో రకంగా చదువు పూర్తి చేసి అమెరికా చెక్కేసి అక్కడేదో ఉద్యోగం చేసుకోవలనే ఆలోచనే అధికశాతం యువత ఆలోచన. ఆసక్తి, ఆశ, అర్హత ఉండి సివిల్స్ కి, ఇతర ప్రభుత్వ స్థానాలకి ట్రై చేస్తూ ఉద్యోగమొచ్చేదాకా కాలక్షేపం చేసే యువత కూడా గణనీయమైన శాతంలోనే ఉన్నారు. అంతే కానీ ఆర్థికంగా దేశం రూపురేఖలు మార్చాలనే ఆలోచన ఎంతమందికుంది?

ఒకవేళ ఉన్నా కూడా ఆ దిశగా పని చేయడానికి ప్రభుత్వం కల్పిస్తున్న వాతావరణమేది?

“ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం” అన్నటుగ్గా “ఏ పార్టీ అధికారంలోకొచ్చినా ఏమున్నది మార్పు” అనుకోవడమే అందరి పనీను. 

కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చినా, ఇది పోయి రేపు మరొక సంకీర్ణమొచ్చినా దేశంలోని యువత చైనా ఫోను, అమెరికా ల్యాప్టాపు, జర్మన్ చెప్పులు వేసుకుని అదే గొప్పనుకుని పోజు కొట్టడమేగా? అలా కాకుండా యువశక్తితో (మ్యాన్ పవర్) స్వయం ఉత్పత్తి చేసి ప్రపంచాన్ని ఏలే విధంగా మార్చగలిగే నాయకుడెవడైనా వచ్చే అవకాసముందా? 

అసలు ఈ దేశాన్ని ముందుకు వెళ్లకుండా వెనక్కు లాగుతున్న అంశాలేవిటి? 

బలముండి, వయసుండి, తెలివుండి..సొంతంగా సంపాదించకుండా కేవలం అప్పులు మాత్రమే చేసుకుంటూ బతికే వ్యక్తికి మన దేశానికి ఏం తేడా లేదు. 

దేశం చేసే అప్పులకి వడ్డీలు కట్టాలంటే ప్రజలమీద పన్నులు బాదాలి. అయినా సరిపోకపోతే కొత్త పన్నులు సృష్టించి మరీ బాదాలి. అయినా చాలకపోతే ఏ దేశం నుంచి అప్పుతెస్తున్నామో ఆ దేశానికి మన దేశం తాళాలివ్వాలి. అంటే మన ఆర్థిక వ్యవస్థలో ఆ దేశం దూరి పెత్తనం చేస్తుందన్నమాట. 

వడ్డీకి ప్రతిగా తమ దేశానికి సంబంధించిన వస్తువులనే అమ్మాలని షరతులు పెట్టొచ్చు. ఆ విధంగా భారతీయుల సొమ్ముని తమ దేశానికి పట్టుకుపోవచ్చు. మన దేశం దివాళా తీసి రూపాయి విలువ దారుణంగా పడిపోయి తెల్లమొహమేసి చూడొచ్చు. 

అంటే స్వతంత్ర భారతాన్ని తెలివితక్కువతనంతో, సొంత ఉత్పత్తులు చేయలేని సోమరితనంతో పరాధీనం చేసి ఆర్థిక బానిసత్వంలో బతకాల్సి రావచ్చు. 

ఈ దుస్థితి దేశానికి రాకూడదంటే ఏం చెయ్యాలి?

సినిమాటిక్ గా అనిపించినా కొన్ని సూత్రాలున్నాయి. వాటిని అమలు చేయగల అర్హత, సామర్థ్యం, తెగువ, దమ్ము ఉన్నవాడు పుట్టగలగాలి. సాధ్యాసాధ్యాలు పక్కనబెట్టి అవేంటో చూద్దాం. 

– ముందుగా ప్రజాస్వామ్య బద్ధంగా ఆబ్సొల్యూట్ మెజారిటీతో 2014లో మోదీ నెగ్గినట్టు ఒక నాయకుడు ప్రధాని కావాలి. అతనికి “ప్రపంచదేశాలన్నీ నా దేశంపై ఆధారపడేలా చెయ్యాలి..చైనాని తలదన్నేలా స్వయం ఉత్పత్తులు చెయ్యాలి” అనే ఆలోచన నాడి, నరం, బుద్ధి, మనసు అన్నిటా విపరీతంగా ఉండాలి. 

– తన సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఆ నాయకుడిలో నియంతృత్వధోరణి ప్రవేశించాలి. తనకున్న ఆబ్సొల్యూట్ మెజారిటీతో ముందుగా చెయ్యాల్సిన పని…పత్రికాస్వేచ్ఛని నియంత్రించడం. దేశం ఇమేజ్ దెబ్బతీసే నెగటివ్ వార్తలు రాసినా, ప్రసారం చేసినా, ప్రతిపక్షాలపై పక్షపాతం చూపిస్తూ ప్రభుత్వంపై వ్యతిరేకత చూపించినా ఆయా పత్రికల్ని మూసేయడమే కాకుండా అధినేతల్ని కారాగారంలో బంధించే హక్కుని ప్రభుత్వం చేజిక్కుంచుకోవాలి. ఈ లెక్కలో సోషల్ మీడియా కూడా ఉండాలి. దీనివల్ల ప్రజలకి వార్తలు చూస్తూ దేశంపై నెగిటివిటీ పెంచుకునే వాతావరణం ఆగిపోతుంది. 

– తర్వాత ఫేస్బుక్, ట్విటర్, గూగుల్, వాట్సాప్ లాంటివి దేశంలో ఏ మూలా పనిచేయకుండా చేసి చైనా మోడల్లో సొంత సర్చ్ ఇంజన్లు, సొంత చాట్ యాప్స్, సోషల్ మీడియా ఏర్పాటు చెయ్యాలి. ఇవి దేశంలోనే పనిచేస్తాయి. విదేశాల్లో ఇవి పనిచేయవు. సోషల్ మీడియాలో కూడా ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడానికి వీల్లేదు. అంటే ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని తొక్కిపెట్టాలి. సోషల్ మీడియాని కేవలం సమస్యల్ని ప్రభుత్వానికి చెప్పుకోవడానికి, మెరుగైన ఆలోచనలు పంచుకోవడానికి, కళాసాంస్కృతిక కార్యక్రమాలకి మాత్రమే వాడాలి. 

– చేస్తున్న వ్యాపారంతో సంబంధం లేకుండా ప్రతి వ్యాపారి ఆదాయపు పన్ను కట్టాల్సిందే. లేని పక్షంలో కఠిన శిక్ష తప్పదు. అలా వచ్చిన డబ్బుతో ముందుగా దేశ పారిశుధ్యం, కనీస వస్తుల రూపురేఖలు మార్చేయాలి. 

– విదేశీ కర్మాగారాలన్నీ తక్షణమే ఖాళీ చేసి దేశాన్ని వదిలి పోవాలి. ఆ స్థానంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తులు జరగాలి. అందులో దేశంలోని యువత నిర్బంధ ఉద్యోగాలు చెయ్యాలి. ఇదంతా మాకొద్దని విదేశాలకి పోవాలనుకుంటే పోర్ట్ ఆఫ్ ఎగ్జిట్ లో వారిని ఆపేయాలి. 

– ఉచిత సంక్షేమపథకాలు పూర్తిగా నిలిపెయ్యాలి. ఒళ్ళొంచి పని చేసే వాళ్ల కుటుంబాలకే జీతాలతో పాటు సంక్షేమం కూడా అందాలి. 

– నియమాలకు లోబడి పని చేస్తున్నవారికి ఉత్తమపౌరులుగా గుర్తించి అవార్డులివ్వాలి. బయట దేశాలకి మన నాయకుడు కరడు కట్టిన నియంత అయినా దేశ పౌరులు మాత్రం క్రమంగా దేవుడిగా చూసే పరిస్థితి తెచ్చుకోవాలి. 

– ఎగుమతులతో ధనార్జన చేసి ఇన్నేళ్లుగా దేశం చేసిన అప్పులు తీర్చాలి. ధనార్జనను బట్టి ఉచిత వైద్యం, విద్య వంటివి ఇవ్వాలి. ఆదాయం మరింత బాగున్నాక దేశంలో ఆదాయపు పన్ను ఎత్తేయాలి.  

– ఎన్నికల విధానం రద్దు చేసి తనను తానే యావజ్జీవ దేశాధినేతగా ప్రకటించుకోవాలి. మిలిటరీ అధినేతలుగా తన సొంతవాళ్లని నియమించుకోవాలి. 

– ఈ పనులన్నీ చేసే క్రమంలో ఎవరన్నా అడ్డొస్తే వారిని సైలెంటు చేయగలగాలి. ఏ విధంగా సైలెంటు చేసినా మీడియా కంట్రోల్లో ఉంటుంది కనుక వార్త బయటికి రాదు.

ఈ రకమైన స్వాప్నికుడైన మహానియంత ఈ దేశాన్ని కనీసం 30 ఏళ్లు పాలిస్తే తప్ప భారతదేశం ప్రపంచశక్తిగా మారే అవకాశం లేదు. చైనాలోనూ, నార్త్ కొరియాలోనూ పుడుతున్నారు కానీ అలాంటి మొనగాడు మనదేశంలో అసలు పుడతాడా? 

శ్రీనివాసమూర్తి