ఆమధ్య కోడి కూర వండలేదని భార్యను భర్త చంపేసిన ఉదంతం గురించి విన్నాం. ఇక్కడ మాత్రం ఈ భార్య కోడి కూర వండింది కానీ అన్నం వండలేదు. దీంతో భర్తకు కోపమొచ్చింది, భార్యను చంపేశాడు. ఒరిస్సాలో జరిగింది ఈ ఘటన.
సంబల్ పూర్ జిల్లాలోని నాధి అనే గ్రామంలో కొన్నేళ్లుగా నివశిస్తున్నారు సనాతన్, అతడి భార్య పుష్ప. వీళ్లకు కొడుకు, కూతురు ఉన్నారు. కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం కూడా పెద్ద గొడవ జరిగింది. దీంతో కోపంతో భర్త బయటకు వెళ్లిపోయాడు.
అదే టైమ్ లో కూతురు, వేరే ఇంట్లో పని చేయడానికి వెళ్లింది. కొడుకు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లాడు. ఆకలితో ఇంటికి తిరిగొచ్చిన భర్తకు ఖాళీ గిన్నెలు కనిపించాయి. కోడి కూర చేసిన భార్య, భర్తకు అన్నం మాత్రం ఉంచలేదు. దీంతో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది.
ఆవేశంలో భార్యను ఇష్టమొచ్చినట్టు కొట్టాడు సనాతన్. ఆ దెబ్బలకు ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఇంటికొచ్చిన కొడుకు, తల్లి విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జమాన్ కిరా పోలీసులు జరిగిన ఘటనపై కేసు నమోదుచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. భర్త సనాతన్ ను వెదికే పని మొదలుపెట్టారు. అయితే పోలీసుల్ని పెద్దగా శ్రమపెట్టలేదు సనాతన్. తనే వచ్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కోడి కూర వండి, అన్నం వండలేదని, అందుకే చంపేశానని స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు.