ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది శ్రీదేవి కూతురు జాన్వి కపూర్. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. అంతలోనే తన రెండో తెలుగు సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు అఖిల్. ఇందులో అతడి సరసన జాన్వి హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉంది.
ఏజెంట్ తో పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు అఖిల్. అయినప్పటికీ అతడితో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తోంది యూవీ క్రియేషన్స్. ఓ కొత్త దర్శకుడు ఈ ప్రాజెక్టుతో పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకు ధీర అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో అఖిల్ సరసన జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారట.
ఏజెంట్ ఫ్లాప్ తర్వాత దుబాయ్ వెళ్లిపోయాడు అఖిల్. కొన్ని రోజులుగా అక్కడే రెస్ట్ తీసుకుంటున్నాడు. అతడు హైదరాబాద్ తిరిగొచ్చిన వెంటనే తుది చర్చలు మొదలవుతాయి. ఆ వెంటనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే యోచనలో ఉన్నారు.
చాన్నాళ్ల కిందటే లాక్ అయిన ప్రాజెక్టు ఇది. కథ బాగా నచ్చి అఖిల్ ఓకే చేశాడు. ఈ సినిమా తర్వాత మాత్రం, అఖిల్ చేయబోయే సినిమాల వ్యవహారాలన్నీ నాగార్జున చూడబోతున్నాడు. ఈ మేరకు ఆయన ఇప్పటికే కొంతమంది పెద్ద దర్శకుల్ని సంప్రదించారు.
యూవీ క్రియేషన్స్ సినిమా పూర్తయిన వెంటనే, ఓ టాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద డైరక్టర్ తో, అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై అఖిల్ సినిమా ఉంటుంది. ప్రస్తుతానికి అఖిల్ లైనప్ ఇదే.