జోలె ప‌ట్టి ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే భిక్షాట‌న‌

దేశానికి అన్నం పెట్టే రైత‌న్న క‌డుపు నింపేందుకు ఒక ప్ర‌జాప్ర‌తినిధి భిక్ష‌మెత్తారు. కేంద్రం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వెన‌క్కి తీసుకోవాల‌నే డిమాండ్‌పై కొన్ని రోజులుగా ఢిల్లీ వేదిక‌గా రైతులు భారీ నిర‌స‌న చేప‌ట్టిన విష‌యం…

దేశానికి అన్నం పెట్టే రైత‌న్న క‌డుపు నింపేందుకు ఒక ప్ర‌జాప్ర‌తినిధి భిక్ష‌మెత్తారు. కేంద్రం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వెన‌క్కి తీసుకోవాల‌నే డిమాండ్‌పై కొన్ని రోజులుగా ఢిల్లీ వేదిక‌గా రైతులు భారీ నిర‌స‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. రైతుల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని గ‌ద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి నిర‌స‌న‌కారులైన రైతుల‌కు అండ‌గా నిలిచారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌ల్ద‌క‌ల్ మండ‌లంలో జోలె ప‌ట్టుకుని ఇంటింటికి వెళ్లి పిడికెడు బియ్యాన్ని సేక‌రించారు. అనంత‌రం ఎమ్మెల్యే కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ సేక‌రించిన బియ్యాన్నిఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రైతుల‌కు పంపిస్తాన‌న్నారు.

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ బిల్లుల వ‌ల్ల రైతుల‌కు తీవ్ర న‌ష్టం క‌లుగుతుంద‌న్నారు. రైతుల న‌డ్డి విరిచేందుకు కేంద్రం ప్ర‌య‌త్నించ‌డం దారుణ‌మ‌న్నారు. 

ఇప్పుడిప్పుడే అభివృద్ధి ప‌థంలో ముందుకెళుతున్న తెలంగాణ రైతాంగానికి కేంద్రం తెచ్చిన కొత్త సాగు బిల్లులు తీవ్ర‌న‌ష్టాన్ని క‌లిగిస్తాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రైతుల ఆందోళ‌న‌ను దృష్టిలో పెట్టుకుని వెంట‌నే వ్య‌వ‌సాయ బిల్లుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకోవాల‌ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

కాగా కేంద్ర ప్ర‌భుత్వ నిరంకుశ విధానాల‌కు వ్య‌తిరేకంగా రైతులు త‌మ ఉద్య‌మాన్ని ఉధృతం చేశారు. ఈ నేప‌థ్యంలో ఈ రోజు దేశ వ్యాప్తంగా రైతులు నిర‌స‌న చేప‌ట్టారు. రైతుల ఆందోళ‌న‌కు టీఆర్ఎస్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో, సంఘీభావంగా గద్వాల ఎమ్మెల్యే భిక్షాట‌న‌తో నిర‌స‌న చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. 

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం జగన్