బాలీవుడ్ లో మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైంది. ఈసారి పరిణీతి చోప్రా వంతు. కొన్నాళ్లుగా పొలిటీషియన్ రాఘవ్ చద్దాతో ఆమె డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి పలుమార్లు కెమెరా కంటికి కూడా చిక్కారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాతే వీళ్లిలా బయటపడ్డారనేది వేరే సంగతి.
ఇప్పుడీ జంట పెళ్లికి ఏర్పాట్లు సాగుతున్నాయి. ముందుగా ఈ శనివారం ఎంగేజ్ మెంట్ ప్లాన్ చేశారు. ఢిల్లీలో జరగనున్న ఈ నిశ్చితార్థ వేడుకకు అటు రాజకీయాలు, ఇటు సినీ రంగాలకు చెందిన 150 మంది హాజరుకానున్నారు. ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్లి తేదీని ఖరారు చేస్తారు. ఈ ఏడాదిలోనే పరిణీతి-రాఘవ్ ఓ ఇంటివారు కాబోతున్నారు.
పరిణీతి-రాఘవ్ ఒకే కాలేజీలో చదువుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరి రంగాల్లో వాళ్లు బిజీ అయ్యారు. 2011లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పరిణీతి. అటు రాఘవ్ ఓవైపు తన ఫ్యామిలీ బిజినెస్ పనులు చూసుకుంటూనే, మెల్లగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు వచ్చాడు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు.
పరిణీతి-రాఘవ్ ఎన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారనేది ఎవ్వరికీ తెలియదు. కానీ ఈమధ్య కాలంలోనే ఇద్దరూ కలిసి బయట కనిపించడం మొదలుపెట్టారు. ముందుగా ముంబయిలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకొస్తూ కనిపిస్తారు. అప్పుడే పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత రీసెంట్ గా ఓ ఐపీఎల్ మ్యాచ్ లో కూడా ఇద్దరూ సందడి చేశారు.
పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాతే వీళ్లిద్దరూ ఇలా బయటకొచ్చారు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయాన్ని ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా గతంలోనే స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ జంటకు శుభాకాంక్షలు కూడా తెలిపారు.