కారుమూరి మాట‌ల‌కి అర్థాలే వేరులే!

మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు ప్రెస్‌మీట్‌ Advertisement విలేక‌రులు ఏదో అడ‌గ‌బోతే “ఎర్రిప‌ప్ప‌ల్లారా” అని ముద్దుగా విసుక్కున్నాడు. మీరంతా జ‌ర్న‌లిస్టులే కానీ, లింగ్విస్టులు కాదు. లింగ్విస్టిక్ భాషా శాస్త్రం. ఎవ‌రి భాష వాళ్ల‌కి వుంటుంది. నా…

మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు ప్రెస్‌మీట్‌

విలేక‌రులు ఏదో అడ‌గ‌బోతే “ఎర్రిప‌ప్ప‌ల్లారా” అని ముద్దుగా విసుక్కున్నాడు.

మీరంతా జ‌ర్న‌లిస్టులే కానీ, లింగ్విస్టులు కాదు. లింగ్విస్టిక్ భాషా శాస్త్రం. ఎవ‌రి భాష వాళ్ల‌కి వుంటుంది. నా భాష‌లో ఎర్రి ప‌ప్ప అంటే బుజ్జినాయ‌నా అని అర్థం. దాన్ని తిట్టు అనుకుని కొన్ని ఛానెళ్లు హ‌డావుడి చేసాయి. ఎర్రి అంటే అమాయ‌కం, ప‌ప్ప అంటే తండ్రి. ప్రేమ త‌ప్ప ఇంకేమైనా వుందా? భాష‌కి నానార్థాలు వుంటాయి. మ‌న‌మే మ‌న‌కి కావాల్సింది తీసుకోవాలి. నా పేరులో రావు వున్నంత మాత్రానా, నాకు ఏదీ రాద‌ని అర్థం కాదు క‌దా. ఇంటి పేరులో కారు వుంది. నాకేం కార్ల ఫ్యాక్ట‌రీ లేదు క‌దా”

మంత్రి జ్ఞానానికి ఒక‌రిద్ద‌రు విలేకరులు మూర్చ‌పోతే, నీళ్లు చ‌ల్లి లేపారు. అది చూసి మంత్రి అందుకున్నాడు.

“మూర్చ‌ అంటే, ఒళ్లు తెలియ‌క‌పోవ‌డం. మూర్చ వేరు, మూర్చ‌వ్యాధి వేరు. రామాయ‌ణంలో ల‌క్ష్మ‌ణ‌స్వామికి జ‌రిగింది మూర్చ‌. మంత్రులుగా మేము ఇచ్చే వాగ్దానాల‌కి పుల‌కించి పోయిన జ‌నం గిల‌గిల‌ త‌న్నుకుంటే అది మూర్చ వ్యాధి. ప్ర‌జాస్వామ్యంలో మూర్చ వ్యాధి స‌హ‌జం. మూర్చ వ‌చ్చిన వాళ్ల చేతిలో తాళం చెవి పెడ‌తారు. ఇళ్ల‌కి వేసే తాళం వేరు, సంగీతంలోని తాళం వేరు. ఒక‌టి జాగ్ర‌త్త‌, రెండోది ర‌స‌జ్ఞ‌త‌.

గోడ‌ల‌కి చెవులున్నాయి అన్నారు కానీ, తాళానికి చెవులుంటాయ‌ని ఎవ‌రూ అన‌లేదు. ఎందుకంటే చెవి వున్నా అది విన‌లేదు. చెవులున్నా మ‌నుషులే స‌రిగా విన‌క ఎర్రి ప‌ప్ప అనే ప‌దాన్ని అపార్థం చేసుకున్న‌ప్పుడు అలంకార ప్రాయ‌మైన చెవితో వున్న తాళం గురించి చ‌ర్చ ఎందుకు? “

“సార్‌, ఏ భాషా రాక‌పోతేనే చివ‌రికి విలేక‌రులు అయ్యాం. మేము రాసేది తెలుగేన‌ని మా న‌మ్మ‌కం. మా విశ్వాసాన్ని దెబ్బ‌తీసే విధంగా భాష గురించి మాట్లాడ‌కుండా రైతుల గురించి చెప్పండి” అన్నాడు ఓ విలేక‌రి.

“బాడీ లాంగ్వేజీ ద్వారా మ‌నిషిని అర్థం చేసుకునే శ‌క్తి రాజ‌కీయ నాయ‌కుల‌కి వుంటుంది. జ‌నం మ‌నం, మ‌నం జ‌నం అంటే అర్థం ఏమంటే జ‌నం ఓట్లేస్తేనే మ‌నం, మ‌నం బాగుండాలంటే జ‌నం గురించి ప‌ట్టించుకోకూడ‌ద‌ని.

ధాన్యం త‌డిస్తే మొల‌క‌లొస్తాయి. మ‌నం త‌డిస్తే జ‌లుబొస్తుంది. ఎందుకంటే మ‌నం ధాన్యం కాదు కాబ‌ట్టి. గింజ‌కి మొల‌క రావ‌డం ప్ర‌కృతి. మ‌నిషికి వ‌స్తే వికృతి. మొల‌క‌లొచ్చాయ‌ని నాకు చెబితే నేను ఏం చేయాలి?  అందుకే ముద్దుగా ఎర్రి ప‌ప్ప అన్నాను”

ఎర్రి అనే ప‌దం వెర్రికి రూపాంత‌రం. వెర్రిని పిచ్చి, తిక్క , ఉన్మాదం అని కూడా అంటారు. ఇంగ్లీష్‌లో క్రాక్‌, మ్యాడ్‌, మెంట‌ల్ అంటారు. ఇంగ్లీష్ పిచ్చి భాష‌. ప్ర‌తిదానికీ రెండు అర్థాలుంటాయి. ప‌ప్ప అంటే డాడీ అని కూడా చెప్పాను క‌దా. శిశువు మాట‌లు నేర్చుకునేట‌ప్పుడు ప‌ప్పాప్పా అంటాడు. అవి ముద్దు మాట‌లు. మాట వేట కంటే ప్ర‌మాద‌క‌రం. మాట‌లు కోట‌లు దాటుతాయి అంటే తెలుసా

“ఆరు నూర‌యినా, నూరు ఆరైనా, కారుమూరి మార‌డు” అనుకుంటూ విలేక‌రులు వెళ్లిపోయారు.