ఆ ఒక్క విష‌యంలో…ఆయ‌న సార్థ‌క నామ‌ధ్యేయుడు!

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు… ఒకే ఒక్క విష‌యంలో మాత్రం సార్థ‌క నామ‌ధ్యేయుడు అనిపించుకున్నారు. బీజేపీ అంటే చంద్ర‌బాబుకు అనుకూల‌మైన పార్టీగా ఇంత కాలం వ్య‌వ‌హారం న‌డిచింది. ఏపీ బీజేపీలో పేరుకు జాతీయ…

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు… ఒకే ఒక్క విష‌యంలో మాత్రం సార్థ‌క నామ‌ధ్యేయుడు అనిపించుకున్నారు. బీజేపీ అంటే చంద్ర‌బాబుకు అనుకూల‌మైన పార్టీగా ఇంత కాలం వ్య‌వ‌హారం న‌డిచింది. ఏపీ బీజేపీలో పేరుకు జాతీయ పార్టీ నాయ‌కులున్న‌ప్ప‌టికీ, ఉన్న‌వాళ్ల‌లో మెజార్టీ చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. అందుకే ఆ పార్టీ ఏపీలో ఎద‌గ‌లేక‌పోయింది. ఏపీ బీజేపీలో ఇప్ప‌టికీ చంద్ర‌బాబు తాబేదార్లున్నారు. అయితే విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకునే కీల‌క ప‌ద‌విలో టీడీపీ అనుకూల నేత‌లు లేక‌పోవ‌డంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

టీడీపీ పాలిట విల‌న్‌గా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు త‌యార‌య్యారు. వీర్రాజుకు ముందు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బీజేపీ నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు చూశారు. ప‌ద‌వీ కాలం ముగియ‌డం, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో టీడీపీలోకి జంప్ అయ్యారు. బీజేపీలో వుంటూ టీడీపీ ప్ర‌యోజ‌నాల కోస‌మే ప‌ని చేశార‌నేందుకు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణే నిలువెత్తు నిద‌ర్శ‌నం. టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేసే నాయ‌కుల ఏరివేత‌కు సోము వీర్రాజు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం ఎల్లో మీడియాకు ఏ మాత్రం న‌చ్చ‌డం లేదు.

వైసీపీతో పాటు టీడీపీకి వ్య‌తిరేకంగా ఆయ‌న విమ‌ర్శ‌లు చేయ‌డం, రెండు పార్టీల‌ను స‌మాన దూరంలో పెట్ట‌డంతో ఎల్లో మీడియా గింజుకుంటోంది. అలాగే బీజేపీలోని టీడీపీ అనుకూల నేత‌లు జుత్తు పీక్కుంటున్నారు. సోము వీర్రాజు మాట‌ల‌కు వ‌క్ర‌భాష్యం చెబుతూ, త‌ద్వారా జాతీయ పార్టీ అధ్య‌క్షుడిని, వైసీపీని క‌లిసి బ‌ద్నాం చేయ‌డానికి తోక ప‌త్రిక శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తోంది. రాష్ట్రం కోసం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తున్నామంటూ సోము వీర్రాజు అన్నార‌ని బ్యాన‌ర్ వార్త అచ్చు వేయ‌డం వెనుక దురుద్దేశం ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఎల్లో చాన‌ల్ య‌జ‌మానికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు విష్ణుకుమార్‌రాజు పార్టీ విధానాల‌కు విరుద్ధంగా మాట్లాడ్డార‌ని, వివ‌ర‌ణ ఇవ్వాల‌ని షోకాజ్ నోటీసు ఇవ్వ‌డాన్ని ఎల్లో మీడియా త‌ప్పు ప‌డుతోంది. వీర్రాజు షోకాజ్ నోటీసు జారీ చేయించ‌డంపై కొంద‌రు బీజేపీ నేత‌లు ఆగ్ర‌హంగా ఉన్నార‌ని రాయ‌డం ఆ ప‌త్రిక‌కే చెల్లింది. విష్ణుకుమార్ రాజుకు షోకాజ్ నోటీస్ ఇవ్వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం… సీఎం జ‌గ‌న్‌కు నెల‌కు రూ.2 వేల కోట్లు చొప్పున దోచుకుంటున్నార‌ని విష్ణుకుమార్ రాజు విమ‌ర్శ‌లు చేశార‌నే కోపంతో అని చెప్ప‌డం గ‌మ‌నార్హం.  

అలాగే మాజీ మంత్రి టీజీ వెంక‌టేశ్‌ను కూడా బీజేపీ నాయ‌క‌త్వం మందలించడాన్ని కూడా త‌ప్పు ప‌డుతూ రాశారు. ఎల్లో మీడియా ఏపీ బీజేపీ చీఫ్‌ను టార్గెట్ చేస్తూ వార్త‌లు రాస్తున్న‌దంటే, ఆ పార్టీకి మంచి రోజులు వ‌చ్చిన‌ట్టే. ఇంత‌కాలానికి కేవ‌లం బీజేపీ కోస‌మే ఆలోచించే నాయ‌కుడు వీర్రాజు రూపంలో వ‌చ్చాడ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

టీడీపీ విమ‌ర్శ‌లు, ఎల్లో మీడియా రాత‌ల‌ను లెక్క చేయ‌కుండా పేరుకు త‌గ్గ‌ట్టే వీరోచితంగా వారికి ఎదురొడ్డి వీర్రాజు పోరాడ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది. రానున్న రోజుల్లో వీర్రాజు ఇదే రీతిలో గ‌ట్టిగా నిల‌బ‌డితే మాత్రం…బీజేపీలోని టీడీపీ నేత‌లు ఊపిరాడ‌క చంద్ర‌బాబు పంచ‌న చేర‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి త‌లెత్తుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.