ఎన్నిక‌ల డీజీపీనా?

నూత‌న డీజీపీగా కేవీ రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈయ‌న 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల డీజీపీగా రాజ‌కీయ పార్టీల నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. త‌న‌కు న‌మ్మ‌క‌స్తుడైన ఐపీఎస్ అధికారిని వైఎస్ జ‌గ‌న్ డీజీపీగా నియ‌మించుకోవ‌డం వెనుక…

నూత‌న డీజీపీగా కేవీ రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈయ‌న 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల డీజీపీగా రాజ‌కీయ పార్టీల నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. త‌న‌కు న‌మ్మ‌క‌స్తుడైన ఐపీఎస్ అధికారిని వైఎస్ జ‌గ‌న్ డీజీపీగా నియ‌మించుకోవ‌డం వెనుక మ‌రో రెండున్న‌రేళ్ల‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లే కీల‌క‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి గౌత‌మ్ స‌వాంగ్‌ను డీజీపీగా వ‌చ్చీ రాగానే జ‌గ‌న్ నియ‌మించుకున్నారు.

డీజీపీగా జ‌గ‌న్ మ‌న‌సెరిగి స‌వాంగ్ న‌డుచుకున్నార‌ని ఇంత కాలం అంద‌రూ అనుకున్నారు. 2023లో రిటైర్డ్ అయ్యే వ‌ర‌కు కూడా ఆయ‌నే డీజీపీగా గౌత‌మ్ కొన‌సాగుతార‌ని భావించారు. అయితే ఏమైందో తెలియ‌దు కానీ, స‌వాంగ్‌ను ఆక‌స్మికంగా మార్చారు. ఆయ‌న గౌర‌వానికి ఇబ్బంది లేకుండా ఏపీపీఎస్సీ చైర్మ‌న్‌గా స‌వాంగ్‌ను సీఎం నియ‌మించారు.

మాజీ డీజీపీ స‌వాంగ్ నుంచి శ‌నివారం రాజేంద్ర‌నాథ్‌రెడ్డి బాధ్య‌త‌లు తీసుకున్నారు. 1992వ బ్యాచ్‌కు చెందిన రాజేంద్ర‌నాథ్‌రెడ్డికి వృత్తిప‌రంగా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సీఎం జిల్లాకే చెందిన రాజేంద్ర‌నాథ్‌రెడ్డిని పోలీస్ బాస్‌గా నియ‌మించ‌డంపై ప్ర‌తిప‌క్షాలు ర‌క‌ర‌కాల వాద‌న‌ల‌ను తెర‌పైకి తెచ్చాయి. ప్ర‌ధానంగా 2024 ఎన్నిక‌ల‌ను టీడీపీ, వైసీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోనున్నాయి. టీడీపీకి ఆ ఎన్నిక‌లు చావుబ‌తుకు స‌మ‌స్య‌. ఒక‌వేళ పార్టీ అధికారంలోకి రాక‌పోతే, టీడీపీ మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌నే ఆందోళ‌న ఆ పార్టీ నేత‌ల్లో ఉంది. మ‌రోసారి అధికారంలోకి రావ‌డం వైసీపీకి కూడా ప్ర‌ధాన‌మే.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని మ‌ట్టి క‌రిపిస్తే, ఆ త‌ర్వాత రాజ‌కీయంగా ఎదురే ఉండ‌ద‌నేది ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నేత‌ల ఆలోచ‌న‌. 2024లో అధికారంలోకి వ‌స్తే, ఆ త‌ర్వాత 2029 నాటికి చంద్ర‌బాబు వ‌య‌సు 80వ సంవ‌త్స‌రంలో ప‌డుతుంది. ఇక చంద్ర‌బాబు చురుగ్గా ప‌ని చేసే ప‌రిస్థితి ఉండ‌ద‌నేది వైసీపీ అంచ‌నా. అందువ‌ల్ల 2024 ఎన్నిక‌ల‌ను వైసీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోనుంది. 

అందుకే స‌మ‌ర్థుడైన పోలీస్ బాస్ మ‌ద్ద‌తు ఎన్నిక‌ల్లో అవ‌స‌ర‌మ‌ని అధికారి పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌నే వాద‌న‌ను కొట్టి ప‌డేయ‌లేని ప‌రిస్థితి. అయితే అధికార పార్టీ చెప్పిన ప్ర‌తిదానికీ రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఎంత వ‌ర‌కూ త‌లూపుతాడో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది. మొత్తానికి డీజీపీగా రాజేంద్ర‌నాథ్‌రెడ్డిని తీసుకురావ‌డంలో 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌లే కీల‌కంగా ప‌ని చేశాయ‌ని విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.